ఈ మధ్య వాట్సాప్ లో వస్తున్న తప్పుడు మెసేజ్ లతో మూక దాడులు పెరిగిపోయాయి. ఈ దాడుల్లో అమాయకులైన వ్యక్తులు బలైపోయారు. దీనిని ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని వాట్సాప్ సంస్థకు నోటిసులు జారీ చేసింది. నోటిసులు అందుకున్న వాట్సాప్ సంస్థ ఓ నిర్ణయానికి వచ్చింది. భారత్ లో తమ యాప్ ద్వారా సర్క్యూలేట్ అవుతున్న తప్పుడు ప్రచారాలు మూక దాడులకు దారి తీస్తున్న నేపథ్యంలో త్వరలో ఇండియాకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వాట్సాప్ ఇండియాకు ఓ అధిపతిని, విధాన నిర్ణయాల కోసం మరో అధిపతిని నిర్ణయించనున్నట్టు పేర్కొంది. భారత్ కోసం ప్రత్యేక పాలసీ, నిబంధనలు ప్రకటించే అవకాశం ఉంది. తమ యాప్ ను దుర్వినియోగం చేసేవారిని గుర్తించి తప్పుడు వార్తలను అడ్డుకుంటామని వాట్సాప్ తెలిపింది. ఇది తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారికి హెచ్చరికలాంటిదని పలువురు అంటున్నారు.