కన్నడ నటి రణ్యా రావు బంగారు స్మగ్లింగ్ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఇటీవల ఆమెను దుబాయ్ నుంచి బెంగళూరుకు చేరుకున్న వెంటనే DRI అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో ఆమె వద్ద 14.2 కిలోల బంగారం దొరికిందని, దాని విలువ రూ.12.56 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఇంట్లో జరిగిన సోదాల్లో కూడా బంగారు ఆభరణాలు, భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు.
విచారణలో రణ్యా కొన్ని షాకింగ్ విషయాలు వెల్లడించిందని సమాచారం. ఆమె మాట్లాడుతూ, స్మగ్లింగ్ అనేది కొత్త విషయమని, ఈ పని ఎలా చేయాలో యూట్యూబ్ చూసి నేర్చుకున్నానని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, విచారణ సమయంలో పూర్తి సహకారం అందించలేదని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆమె బెయిల్ పిటిషన్ ప్రత్యేక ఆర్థిక నేరాల కోర్టులో పెండింగ్‌లో ఉంది.
ఈ కేసులో అధికారిక భద్రతా ప్రోటోకాల్‌ను తప్పుగా ఉపయోగించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. విమానాశ్రయంలో ఉన్న భద్రతా వ్యవస్థను ఆమె ఎలాగైనా మోసం చేసిందని, అధికారుల ప్రోత్సాహం లేకుండా ఇది సాధ్యమేనా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో రాజకీయ నాయకుల ప్రమేయం కూడా ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ దీనిని ఖండించారు.
ఇప్పటికే ఈ కేసుపై CBI, DRI సంయుక్తంగా దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. రణ్యా వెనుక పెద్ద నెట్‌వర్క్ ఉందా? లేక ఒంటరిగా ఆమె ఈ వ్యవహారాన్ని నడిపించిందా? అనే విషయాలు త్వరలోనే స్పష్టతకు వస్తాయని తెలుస్తోంది. సీఎం సిద్ధరామయ్య ఈ కేసుపై ప్రత్యేక దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.