వయసు తక్కువే అయినా, లక్ష్యాలు మాత్రం ఆకాశమంతా. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సంజన వరద ఇప్పుడు దేశవ్యాప్తంగా అందాల పోటీల్లో దూసుకెళ్తున్నారు. ఇప్పటికే మిస్ టీన్ గ్లోబ్ ఇండియా 2024 టైటిల్ గెలిచి వార్తల్లో నిలిచిన ఆమె, తాజాగా మిస్ గ్రాండ్ ఇండియా 2025 ఫైనలిస్ట్‌గా ఎంపికయ్యారు. ఇది ఆమె అందం మాత్రమే కాక, ఆత్మవిశ్వాసానికి మరో ఘనతగా చెప్పవచ్చు.
తిరుపతి జిల్లా చంద్రగిరిలో జన్మించిన సంజన, విద్య కోసం బెంగళూరులోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్‌లో చదివారు. ప్రస్తుతం కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ చేస్తూ, అదే నగరంలో మోడలింగ్ రంగంలోనూ దూసుకెళ్తున్నారు. చదువుతో పాటు మోడలింగ్, నటన.. ఇలా అన్ని రంగాల్లో ఆమె చూపిస్తున్న ప్రతిభ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. 2024లో మిస్ టీన్ గ్లోబ్ ఇంటర్నేషనల్ పోటీల్లో ఫస్ట్ రన్నరప్‌గా నిలవడం ద్వారా ఆమె అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు పొందారు.
ఇప్పుడు మిస్ గ్రాండ్ ఇండియా పోటీతో మరో మెట్టుపైకి ఎదగాలని సంజన ఉత్సాహంగా సిద్ధమవుతున్నారు. ఈ పోటీల్లో దేశంలోని ప్రతిభావంతులైన యువతులు తమ టాలెంట్, వ్యక్తిత్వం, సామాజిక బాధ్యతలపై అవగాహనను ప్రదర్శిస్తారు. అందుకే ఫైనలిస్ట్‌గా ఎంపికవడం ఒక్క అందానికి మాత్రమే సంబంధించిన విషయం కాదు. సంజనకు ఇది మరింత బాధ్యతను చాటే స్థానం. ఈ పోటీల ఫినాలే ఎప్పుడు జరగబోతుందనేది ఇంకా ప్రకటించనప్పటికీ, ఆమెపై ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున మద్దతు వ్యక్తమవుతోంది.