Passport: మూడురోజుల్లో పాస్‌పోర్ట్ కావాలా.. అయితే ఇలా చేయండి..!

విదేశీయానం ఇప్పుడు సర్వ సాధారణం అయిపోయింది.. ప్రస్తుతం ఎప్పుడు ఏ సందర్భం ఎదురవుతుందో చెప్పలేం. ఒక్కోసారి అత్యవసరంగా విదేశీ టూర్‌కి బయలుదేరాల్సి వస్తుంది. వైద్య చికిత్స, విదేశీ ఉద్యోగం, బిజినెస్‌ మీటింగ్‌, ఫ్యామిలీ సందర్భం ఏదైనా పాస్‌పోర్ట్‌ లేకుండా కుదరదు. అయితే అప్పటి వరకు పాస్‌పోర్ట్‌ తీసుకోలేదంటే వెంటనే దానిని పొందాల్సిన అవసరం ఉంది. అయితే పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసి వచ్చినంత సమయం ఏ పరిస్థితిలోనూ ఉండదు. ఇలాంటి సందర్భాల్లో తత్కాల్ పాస్‌పోర్ట్ సేవ ఎంతో ఉపయోగపడుతుంది.

తత్కాల్ పాస్‌పోర్ట్ అంటే అత్యవసర పాస్‌పోర్ట్‌ ప్రాసెసింగ్‌ సౌకర్యం. సాధారణ పాస్‌పోర్ట్‌ కంటే ఇది చాలా వేగంగా పూర్తి అవుతుంది. 30–45 రోజులు పడే సాధారణ ప్రక్రియకు బదులుగా, తగిన డాక్యుమెంట్లు ఉంటే, మూడు పని రోజుల్లోనే పాస్‌పోర్ట్ మీ చేతికి అందే అవకాశం ఉంటుంది. ఇదే తత్కాల్‌ ప్రత్యేకత. తత్కాల్‌ కోసం మూడు గుర్తింపు పత్రాలు తప్పనిసరిగా సమర్పించాలి. ఆధార్‌ కార్డు, ఓటర్‌ ID, డ్రైవింగ్‌ లైసెన్స్, పాన్‌ కార్డు, ఉద్యోగ ID, కుల ధృవీకరణ, పింఛన్‌ పత్రాలు వంటి పత్రాలు ఉండాలి. గెజిటెడ్‌ అధికారుల నుండి రికమండేషన్‌ అవసరం లేకుండా డాక్యుమెంట్లతోనే పనులు పూర్తవుతాయి.

తత్కాల్ పాస్‌పోర్ట్‌కి కొంచెం ఎక్కువ ఫీజు ఉంటుంది. 36 పేజీల పాస్‌పోర్ట్‌కి ₹3,500, ఎక్కువ పేజీలు కావాలంటే 60 పేజీల పాస్‌పోర్ట్‌కి రూ. 4,000. పాత పాస్‌పోర్ట్‌ పోయినా, ఫిర్యాదు చేసి తిరిగి పొందాలంటే రూ. 5,000 వరకు ఖర్చు అవుతుంది. తత్కాల్‌ ప్రక్రియలో ముందే పోలీస్‌ వెరిఫికేషన్‌ ఉండదు. అవసరమైతే కూడా త్వరగా పూర్తవుతుంది. కానీ అందరికీ ఈ అవకాశం ఉండదు. విదేశాల్లో పుట్టినవారు, జమ్మూ కాశ్మీర్‌ నివాసితులు, దత్తత పిల్లలు, వివాహ రిజిస్ట్రీ, పేరు మార్పులు కోరేవారు తత్కాల్‌ ద్వారా పాస్‌పోర్ట్ పొందలేరు.

తగిన డాక్యుమెంట్లు, ఫీజు సిద్ధం చేసి దరఖాస్తు చేస్తే ఈ సౌకర్యం అత్యవసర పరిస్థితుల్లో చాలా వసతిగా ఉంటుందని పాస్‌పోర్ట్‌ అధికారులు చెబుతున్నారు. అంటే అసహాయ పరిస్థితుల్లో పాస్‌పోర్ట్‌ కోసం రోజులు కూర్చోవాల్సిన అవసరం లేదు. తత్కాల్‌ ఉందంటే చాలు, ఎప్పుడు అయినా విదేశీ టికెట్‌ దొరికినట్టే!