టీ-కాంగ్రెస్ కుప్పకూలుతోంది.! రేవంత్ రెడ్డి వల్లనేనా.?

కాంగ్రెస్ పార్టీది ఓ చిత్రమైన రాజకీయం.! నిజానికి, కాంగ్రెస్ పార్టీకి వేరే శతృవులు అవసరం లేదు. ఆ పార్టీ నాయకుల్ని ఎవరో నాశనం చేయాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం సెల్ఫ్ డిస్ట్రక్షన్ మోడ్‌లో వుంది. టి-కాంగ్రెస్ సీనియర్లు, టి-కాంగ్రెస్ జూనియర్లతో గొడవ పడుతున్నారు.

రాజకీయాలన్నాక గిల్లి కజ్జాలు మామూలే. పార్టీ నాశనమైపోతుందనే భావనతో కాస్త జాగ్రత్తగా వుంటారు ఏ పార్టీలో అయినా. కానీ, కాంగ్రెస్ లెక్కలు వేరు. కాంగ్రెస్ జెండా మెడలో కప్పుకుని, కాంగ్రెస్ పార్టీకి ఉరేసే రాజకీయ నాయకులు కాంగ్రెస్ నిండా కనిపిస్తారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గాడిన పెట్టడానికి పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి తనవంతు ప్రయత్నాలు తాను చేస్తున్నారు. ఆయన వల్ల పార్టీ బాగు పడుతుందా.? నష్టపోతుందా.? అన్నది వేరే చర్చ. కానీ, రేవంత్ వల్ల కాంగ్రెస్ బాగుపడకూడదని కాంగ్రెస్ సీనియర్లు కొందరు అనుకుంటున్నారు. అంతే, రేవంత్ రెడ్డిని కాళ్ళు పట్టుకుని కిందకి లాగేస్తున్నారు.

ఇక్కడ పడేది రేవంత్ రెడ్డి మాత్రమే కాదు, నాశనమయ్యేది కాంగ్రెస్ పార్టీ కూడానని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు తెలుసుకోలేకపోతున్నారు. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ రెండు వర్గాలుగా విడిపోయింది. ఒకటి రేవంత్ వర్గం, ఇంకోటి రేవంత్ వ్యతిరేక వర్గం. రేవంత్ వర్గానికి చెందిన దాదాపు 13 మంది కీలక నేతలు రాజీనామా లేఖల్ని, కాంగ్రెస్ అధిష్టానానికి పంపారు. సీనియర్లు కొందరు, తమను జూనియర్లనీ.. వేరే పార్టీ నుంచి వలస వచ్చిన నేతలనీ విమర్శించడాన్ని రేవంత్ మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు.

పార్టీ అధిష్టానం ఆదేశాల నేపథ్యంలో కీలకమైన సమావేశాన్ని ఏర్పాటు చేస్తే, దానికి సీనియర్లు డుమ్మా కొట్టారు. ఈ నేపథ్యంలో రచ్చ షురూ అయ్యింది. ఒకరి మీద ఒకరు తీవ్రాతి తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటున్నారు. వెరసి, అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీని చంపేస్తున్నారు.