Smriti – Palash : స్మృతి – పలాశ్ మధ్యలో “మోసం” అనే టాపిక్.. అసలేది నిజం?

స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన, మ్యూజిక్ డైరెక్టర్ పలాశ్ ముచ్చల్ వివాహం ఈ నెల 23న జరగాల్సి ఉండగా… అది కాస్తా ఊహించని పరిణామాల నేపథ్యంలో నిరవధికంగా వాయిదా పడింది. అందుకు ప్రధాన కారణం… మంధాన తండ్రి అనారోగ్యమే అని చెబుతున్నారు. ఇదే సమయంలో.. ఈ వివాహం ఆగిపోవడానికి పలాశ్ కారణమంటూ ఓ కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది.

ఈ నేపథ్యంలో.. తన తండ్రి అనారోగ్యం కారణంగానే పలాశ్ తో స్మృతి వివాహం వాయిదాపడిందా?

వాయిదా ఇప్పటికే ఒకసారి పడగా… ఈసారి ‘నిరవదికంగా వాయిదా’ అని స్మృతి మేనేజర్ ప్రకటించడం వెనుక మరో కారణం ఏమైనా ఉందా?

ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఇటీవల పలాశ్ మరో అమ్మాయితో చాటింగ్ చేసిన విషయం స్మృతికి తెలిసిందని.. దీంతో అతడిని పక్కన పెట్టిందంటూ జరుగుతున్న ప్రచారంలో నిజమెంత?

అసలు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో స్మృతికి అండగా ఉండాల్సిన దేశం.. ఇలా సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు తెరపైకి తేవడం ఎంతవరకూ సహేతుకం?

టీమిండియా మహిళా స్ట్రార్ క్రికెటర్ స్మృతి మంధాన, మ్యూజిక్ డైరెక్టర్ పలాశ్ ముచ్చల్ లు నవంబర్ 23న వివాహ బంధంతో ఒక్కటి కావాల్సి ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. ఆమె తండ్రి ఆరోగ్య పరిస్థితి కారణంగా ఈ కార్యక్రమాన్ని నిరవధికంగా వాయిదా వేసినట్లు ఇరు కుటుంబాల నుంచి విడివిడిగా ప్రకటనలు వచ్చాయి. ఈ సమయంలో సోషల్ మీడియాలో స్మృతిని ముచ్చల్ మోసం చేశాడని.. అదే వివాహం నిరవదిక వాయిదాకు కారణం అని ప్రచారం ఊపందుకుంది.

అనారోగ్య కారణాలతో స్మృతి తండ్రి ఆస్పత్రిలో ఉండటంతో పాటు.. ఆయన అనారోగ్యానికి గురవడాన్ని తట్టుకోలేకపోయిన పలాశ్‌ ఆరోగ్యం కూడా క్షీణించడంతో అతడిని ఆస్పత్రిలో చేర్చినట్లు చెబుతున్నారు. ఈ సమయంలో.. వాయిదా ప్రకటనలు తెరపైకి వచ్చిన వేళ.. పలాశ్.. మరో అమ్మాయితో చాటింగ్ చేశాడంటూ మెసేజ్ ల స్క్రీన్ షాట్స్ వైరల్ అవుతున్నాయి. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

దీనికి తోడు స్మృతి తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ నుంచి ఎంగేజ్మెంట్ ఫోటోలు, ప్రపోజల్ వీడియోతో సహా ఇద్దరికీ సంబంధించిన పలు పోస్టులు తొలగించడం కూడా ఈ వాదనలకు బలం చేకూర్చిందనే చర్చా తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే.. వీరి వివాహం నిరవధిక వాయిదా వెనుక.. ముచ్చల్, ఒక మహిళ మధ్య జరిగిన కాన్వర్జేషనే అసలు కారణం అయ్యి ఉండోచ్చనే ప్రచారం ఊపందుకుంది.

వాస్తవానికి.. ఈ వివాహం ఈ నెల 23 న జరగాల్సి ఉండగా.. తొలుత స్మృతి తండ్రి అనారోగ్యం పాలై ఆస్పత్రిలో చేర్చాల్సి రావడంతో వాయిదా పడిందని ప్రకటించారు. ఈ క్రమంలో తాజాగా.. పలాశ్‌ సోదరి, సింగర్‌ పలాక్‌ ముచ్చల్‌ ఇన్‌ స్టా వేదికగా ఓ స్టోరీ షేర్‌ చేశారు. ఇందులో భాగంగా… మంధాన, పలాశ్‌ వివాహం ప్రస్తుతానికి ఆగిపోయిందని.. ఈ సున్నిత సమయంలో అందరూ ఇరు కుటుంబాల ప్రైవసీని గౌరవించాలని కోరుతున్నట్లు ఆమె పేర్కొన్నారు.

మరోవైపు.. మంధాన తండ్రి అనారోగ్యంతో బాధ పడుతున్నారని.. ఆయనను ఆస్పత్రికి తరలించారని.. ఈ పరిస్థితుల్లో తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని స్మృతి మంధాన స్పష్టంగా చెప్పిందని.. అందువల్ల వివాహాన్ని నిరవధికంగా వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారని.. స్మృతి మంధాన మేనేజర్ తుహిన్ మిశ్రా పేర్కొన్నారు. ఇలా వివాహం నిరవదిక వాయిదాపై ఇరు కుటుంబాల నుంచి విడివిడిగా ప్రకటనలు వచ్చాయి! ఇది అధికారిక ప్రకటన.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలు.. దేశం గర్వించదగిన క్రీడాకారిణి అయిన స్మృతి విషయంలో ఏమాత్రం సహేతుకంగా లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది పూర్తిగా స్మృతి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం.. పైగా మరో వ్యక్తి జీవితంతో ముడిపడిన వ్యవహారం. అంటే.. అత్యంత సున్నితమైన అంశం!

ఈ సమయంలో ఆమె తీసుకునే నిర్ణయాలు, వెల్లడించే అభిప్రాయాలు అన్నీ పూర్తిగా ఆమె వ్యక్తిగతం.. ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అత్యంత ప్రాముఖ్యమైన విషయం. పైగా ఆమె ఆడ పిల్ల.. పుట్టినింటిని వదిలి మరో ఇంటికి వెళ్లి, సరికొత్త జీవితాన్ని ప్రారంభించే అంశం. ఇలాంటప్పుడు ఆమె తీసుకున్న నిర్ణయాలకు అసలు కారణాలు తెలియకుండా సోషల్ మీడియాలో ప్రచారాలు చేయడం ఏమాత్రం సరైంది కాదనే చెప్పాలి.

ఈ వివాహ విషయం పూర్తిగా స్మృతి అంగీకారంతోనే జరిగింది. ఆమెకు ఎంగేజ్మెంట్ అయ్యింది.. వివాహానికి ముందు జరిగే సందడి జరిగింది.. వివాహానికి డేట్ కూడా ఫిక్స్ అయ్యింది. అన్నీ అనుకూలంగా జరిగి ఉంటే ఆమెకు వివాహమై ఇప్పటికే మూడు రోజులు అయ్యి ఉండేది. అయితే… ఆమె తండ్రికి సీరియస్ అవ్వడం, దానికి తోడు వరుడు కూడా అనారోగ్యానికి గురవ్వడంతో ఇద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఏ అమ్మాయీ అంగరంగ వైభవంగా వివాహం చేసుకుని ఊరేగాలని కోరుకోదు కదా! తన తండ్రి సంపూర్ణ ఆరోగ్యంగా ఇంటికి రావాలని.. తన వివాహ వేడుకలో సందడి చేయాలని.. తన దాంపత్య జీవితం నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా ఆశీర్వదించాలని కోరుకుంటుంది. ఈ విషయంలో జనాలు పాజిటివ్ గా ఆలోచించడం మానేసినట్లున్నారు.

తండ్రి హాస్పత్రిలో ఉన్నారు.. వివాహం నిరవధికంగా వాయిదా వేయాల్సి పరిస్థితి.. ఈ సమయంలో ఆమె ప్రైవసీకి భంగం కలిగించకుండా చూసుకోవడం ప్రతీ ఒక్క భాధ్యత గల భారతీయుడి కర్తవ్యం. ఆమె దేశం గర్వించదగిన క్రీడాకారిణి కూడా. అలాటప్పుడు ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ సున్నితమైన విషయంలో నెటిజన్లు తమ తమ అత్యుత్సాహాన్ని తగ్గించుకుంటారని.. ఆమె వివాహం విషయంలో హుందాగా నడుచుకుంటారని ‘తెలుగురాజ్యం’ ఆశిస్తోంది!

బహుజనులకు రిజర్వేషన్ | Journalist Bharadwaj On Madhya Pradesh IAS Comments | IAS Santosh Verma | TR