ఏపీలో బీజేపీ ఎదుగుదలకు పాతకాపులే అడ్డుగోడలు

(యనమల నాగిరెడ్డి)

దేశంలో ఒకప్పుడు కేవలం రెండు ఎంపీ స్థానాలను మాత్రమే గెలిచి నామమాత్రం అస్తిత్వంతో ఉన్న భారతీయ జనతా పార్టీ ఆ తర్వాత రెండు సార్లు దేశాన్ని పాలించినా “ఏపీలో అప్పటికీ ఇప్పటికీ నామమాత్రం గానే” ఉండిపోయింది.

“ఈ రాష్ట్రం నుండి జాతీయస్థాయి నాయకులు గా ఎదిగిన వ్యక్తులు, వారి వర్గంగా ముద్ర వేసుకున్న పాతకాపులు, తెలుగుదేశంతో పెట్టుకున్న పొత్తులు, పట్టుదల,వ్యక్తిగత చరిష్మా, పసలేని నాయకత్వం చేతికి పార్టీ పగ్గాలు ఇవ్వడం, రాజకీయంగా పార్టీకి ఆత్మహత్యా సదృశమైన నిర్ణయాలు తీసుకుని ఎత్తులు వేయడం” ఏపీలో పార్టీ నామమాత్రంగా మిగలడానికి కారణాలుగా పార్టీకి చెందిన సీనియర్ కార్యకర్తలు విశ్లేసిస్తున్నారు.

అలాగే పార్టీలో పదవులు పొంది అనేక రకాలుగా లబ్ది పొందిన ఘనులు, పార్టీని అభివృద్ధి చేయడానికి పని చేయడం కంటే, తమ స్వప్రయోజనాలకే అధిక ప్రాధాన్యమిచ్చి పార్టీ ఎదగకుండా అడ్డుపడటం మరో ప్రధాన కారణంగా ఉంది.

1977 లో జనతా ప్రభుత్వములో చేరిన జనసంఘ్ తర్వాత బీజేపీగా రూపాంతరం చెందింది. ఆ తర్వాత కాలంలో అద్వానీ రథయాత్ర, కరసేవ కార్యక్రమాలు చేపట్టడం, 1992లో బాబరీ మస్జీద్ కూల్చివేత బీజేపీకి ప్రాణం పోశాయి. స్వంతంగా శక్తి పుంజుకొని బలమైన పార్టీగా మారింది. 1998లో అటల్ బిహారీ వాజపేయి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా, ఒక్కఓటుతో తేడాతో ప్రభుత్వం కూలిపోయింది. తిరిగి 1999 ఎన్నికలలో గెలిచి బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ తర్వాత కాలంలో 2014లో జరిగిన ఎన్నికలలో మోడీ మంత్రంతో పార్టీ స్వంతంగా మెజారిటీ స్థానాలను గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. అయితే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రతిసారి ఏపీలోబీజేపీ టీడీపీ తో పొత్తు పెట్టుకోవడం, బీజేపీ నాయకత్వం టీడీపీకి తొత్తుగా పనిచేయడం వల్ల రాష్ట్రంలో పార్టీ స్వంతంగా ఎదగడంలో పూర్తిగా విఫలమైంది. ఒకవేళ ఏదైనా అవకాశం ఉండి వేరే పార్టీల నుండి ఎవరైనా వస్తే వారికి పాతకాపులు పొగ పెట్టి బయటికి తరుముతున్నారు.

ఏపీలో బీజేపీ గత వైభవం

సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1983 లో టీడీపీ ఆవిర్భావానికి ముందు జనసంఘ్ బలంగా ఉండేది. ఆరెస్సెస్ శాఖలు కూడా బాగా విస్తరించి ఉండేవి. జనసంఘ్ కార్యకర్తలు, ఆరెస్సెస్ కార్యకర్తలు, ఇతర విభాగాలు సంపూర్ణ సమన్వయంతో పనిచేసేవి. కమ్యూనిస్టులు కూడా కార్యకర్తల అండతో బలంగా ఉండేవారు. కాంగ్రెస్ పాలనతో విసిగి వేసారిన ప్రజలు ఆ పార్టీపై తీవ్ర వ్యతిరేకత పెంచుకుని ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో బీజేపీ ఒక బలమైన శక్తిగా ఉండేది.

అదే సమయంలో స్వర్గీయ ఎన్టీఆర్ టీడీపీని స్థాపించి, రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలిలా పర్యటించి ఎన్నికలలో కాంగ్రెసును మట్టి కరిపించారు. ఆ దెబ్బతో కాంగ్రెస్ తో పాటు, కాంగ్రెస్ ను వ్యతిరేకిస్తున్న బీజేపీ, కమ్యూనిస్టులు లాంటి పార్టీలు కూడా దెబ్బ తిన్నాయి. ఆ తర్వాత కాంగ్రెస్ తనదైన శైలిలో రాజకీయం నడిపి ఎన్టీఆర్ ను గద్దె దించడం, “ప్రజాస్వామ్య పరిరక్షణ” కోసం జరిగిన ప్రజా ఉద్యమంలో ఉత్తర దక్షిణ ధ్రువాలైన బిజెపి , కమ్యూనిస్టులు కలసి పోరాడారు. ఈ పోరాటానికి వెంకయ్యనాయుడు, చంద్రబాబు నాయుడు నాయకత్వం వహించారు. ఎన్టీఆర్ తిరిగి గద్దె ఎక్కి ఎన్నికలకు వెళ్లడం, కాంగ్రెస్ ను మరోసారి మట్టి కరిపించడం పాఠకులకు విదితమే. ఆ ఎన్నికలలో బీజేపీ, టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ఆ తర్వాత కాలంలో బీజేపీ పాలిట శాపంగా మారింది. అప్పటి నుంచి బీజేపీ ఈ రాష్ట్రంలో నానాటికి దిగజారి తన అస్తిత్వాన్ని కోల్పోయిందని చెప్పక తప్పదు.

వాజపేయి హయాం బీజేపీ కార్యకర్తలకు అందలం.

1999లో అటల్ బిహారీ వాజపేయి నేతృత్వంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడినప్పడు ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ కార్యకర్తల జాబితా తీసుకుని వారి అర్హతను పట్టి పదవులు కట్టపెట్టారు. అప్పట్లో బీజేపీ- టీడీపీ తో పొత్తు పెట్టుకున్నాకూడా కేంద్రం తన పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన అనేక సంస్థలలో కార్యకర్తలకు చోటు కల్పించడం, చిన్నచిన్న ఏజన్సీలు ఇప్పించడం జరిగింది. ప్రొద్దుటూరుకు చెందిన పార్టీ నాయకుడు “గౌరు పుల్లారెడ్డి” పేరును గవర్నర్ పదవికి సిపార్స్ చేయడం అప్పట్లో పార్టీ కార్యకర్తలకు దక్కిన గౌరవంగా ఇప్పటికీ చెప్పుకుంటారు.

మోడీ ప్రభుత్వ హయాం ఎపి కార్యకర్తలకు కష్టకాలమే

2014లో బీజేపీ-టీడీపీ కలసి పోటీ చేయడం అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో రెండు పార్టీలు కలసి ప్రభుత్వాలు ఏర్పరచడమే బీజేపీ పార్టీ రాష్ట్రంలో పూర్తిగా నాశనం కావడానికి బీజం పడింది. కేంద్రం ప్రభుత్వంలో భాగస్వామి కావడం టీడీపీ నాయకులకు అదృష్టంగా మారగా, రాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ చేరడం ఆ పార్టీ కార్యకర్తల దురదృష్టం అని వారు వాపోతున్నారు.

ఎన్నికలలో టీడీపీ మిత్ర ధర్మాన్ని మరచి గుంతకల్, కడప స్థానాలను బీజేపీకి కేటాయించి కూడా, తన అభ్యర్థులను పోటీకి దింపి వెన్నుపోటు పొడిచి ఇరువురిని ఓడించింది. అలాగే ఏ మాత్రం సంబంధం లేని పురంధేశ్వరిని రాజంపేట నుంచి పోటీ చేయించడం పార్టీని దెబ్బ తీయడమే అంటున్నారు సీనియర్లు. టీడీపీ- బీజేపీ పొత్తు కుదర్చడంలో కీలక పాత్ర పోషించిన వెంకయ్యనాయుడు కానీ, ప్రకాష్ జవదేకర్ కానీ ఈ వెన్నుపోట్లను గురించి అసలు పట్టించుకోక పోవడం వల్ల పార్టీ కార్యకర్తల స్తైర్యం పూర్తిగా దెబ్బతినింది. ఈ నాలుగేళ్లుగా టీడీపీ బీజేపీ ద్వారా అన్ని రకాల వ్యక్తిగత, రాజకీయ, ప్రభుత్వానికి చెందిన అన్ని పనులు చేయించుకోవడం,రాష్ట్రంలో బీజేపీని అధఃపాతాళానికి తొక్కడం జరిగింది.

కేంద్రంలో పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కార్యకర్తలకు ప్రభుత్వ, పార్టీ పరంగా ఎలాంటి మద్దతు లేదు. అలాగే రాష్ట్రంలో దేవాదాయశాఖ, వైద్య ఆరోగ్యశాఖల మంత్రులు బీజేపీ వారైనా దేవాలయాలకమిటీల్లో కానీ, వైద్యశాలల కమిటీల్లో కానీ “కేవలం ఒక్క సభ్యుడిని కూడా నియమించుకోలేని దౌర్బాగ్యం” పార్టీకి పట్టిందని కార్యకర్తలు వాపోతున్నారు.

పార్టీ పాతకాపులే బీజేపీని నాశనం చేశారు

బీజేపీ ఒంటరిగా పోటీ చేయాలని కార్యకర్తలు ఎన్నిసార్లు కోరినా రాష్ట్రానికి చెందిన బడానాయకులు (తమ స్వార్తం కోసం) పట్టించుకోకుండా టీడీపీతో రెండు సార్లు పొత్తు కలిపి పార్టీని నాశనము చేశారు. ప్రత్యేకించి 2014 ఎన్నికలలో టీడీపీతో పొత్తు, ఆ తర్వాత నాయకుల వ్యహారశైలి వల్ల బీజేపీ కార్యకర్తలు పూర్తిగా నిరాశా నిసృహలలో మునిగి, స్తబ్దంగా మారి పార్టీకి దూరంగా ఉండిపోయారు. హరిబాబు అధ్యక్షుడుగా ఉన్న కాలంలో ఆయన పార్టీని ఏ మాత్రం పట్టించుకోకపోగా, కార్యకర్తలను పూర్తిగా నాశనము చేశారు.

పార్టీ పెరగడానికి ఎన్ని అవకాశాలు వచ్చినా పార్టీలో పాతుకు పోయి” తాము మాత్రమే ఉండాలని, అందలం ఎక్కాలని భావించిన” నాయకులు పార్టీని బ్రతికించడానికి బదులు దెబ్బ తీస్తూనే ఉన్నారు. “2014 మే 25న ఈ రాష్ట్రానికి చెందిన 5 మంది పార్లమెంటు సభ్యులు ఒక బడా నాయకుడిని కలసి బీజేపీలో చేరగలమని చెప్పినా ఆయన పట్టించుకోలేదని” కడప కు చెందిన ఓ కార్యకర్త తెలుగు రాజ్యం ప్రతినిధికి తెలిపాడు.

పార్టీలో చేరిన కాటసాని రాం భూపాల్ రెడ్డి లాంటి వారు పాతకాపులు పెట్టె పొగ తట్టుకోలేక పార్టీ నుండి వెళ్లిపోగా, కందుల రాజమోహన్ రెడ్డి లాంటి వాళ్ళు అలాగే కొనసాగుతున్నారు. బీజేపీకి చెందిన కదిరి మాజీ శాసనసభ్యుడు పార్థసారధి, తంబళ్లపల్లె నాయకుడు చల్లపల్లె నరసింహారెడ్డి, యువ నేత విష్ణు వర్ధన్ రెడ్డి లాంటి వారు “తమ స్వంత పనులలో మునిగి తేలుతూ, తమ ప్రాబల్యాన్ని పెంచుకోడానికి తమ ప్రత్యర్థులను దెబ్బ తీయడం, కొత్తవారికి పొగ పెట్టడం ” లాంటి పనులలో మునిగి తేలుతూ ఉన్నారు. పార్టీలో ఉన్న “ఉడ్డా ముగ్గురు సభ్యులను” ముప్పైఆరు దోవలు పట్టించారని రాయలసీమ కార్యకర్తలు వాపోతున్నారు. బీజేపీ లో గత కొన్ని సంవత్సరాలుగా కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్న రవీంద్ర రాజు వ్యవహారశైలి కూడా పార్టీ ఎపిలో దెబ్బతినడానికి మరో కారణమని వారు వాపోతున్నారు. ఆయనను తొలగించి మరో సమర్ధుడైన వ్యక్తిని కార్యదర్శిగా నియమించాలని ఎన్ని సార్లు కోరినా పార్టీ పట్టించుకోలేదని వారు ఆరోపించారు.

టీడీపీ కంటే ముందుగా బీజేపీ ఆ పార్టీతో పొత్తు తెంచుకోవడం, పార్టీని దెబ్బ తీస్తున్న నాయకులపై చర్యలు తీసుకోవడం, రాయలసీమ డిక్లరేషన్ ను అమలు చేయడానికి కృషి చేయడం, కడప ఉక్కుపై సకాలంలో స్పందించి పునాది వేయడం, ఎన్నికల ప్రణాళికలో చెప్పిన విధంగా రాయలసీమకు నీటి కేటాయింపుల కోసం కృషి చేయడం, విభజన చట్టం మేరకు ఇక్కడ నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్ లను పూర్తి చేయడం, ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన క్రింద ఇక్కడ ప్రాజెక్ట్ లకు నిధులు మంజూరు చేయించి, పూర్తి చేయించడానికి ప్రయత్నం చేసి ఉంటె కనీసం రాయలసీమ లో నైనా పార్టీ బ్రతికి ఉండేదని సీనియర్ కార్యకర్తలు వాపోతున్నారు. హరిబాబును ఇంకా ముందుగా తొలగించి కన్నా లక్ష్మీనారాయణ లాంటి వ్యక్తికి కనీసం ఒక సంవత్సరం ముందుగా అధ్యక్ష పదవి కట్టబెట్టి ఉంటె పార్టీ పరిస్థితి మెరుగ్గా ఉండేదని వారంటున్నారు.

జాతీయస్థాయిలో ఉన్న ఒక నాయకుడి వర్గమే ప్రధానంగా రాష్ట్రంలో పార్టీ నాశనం కావడానికి కారణమని, “ఒక సర్పంచ్ ను కానీ, ఎంపిటిసిని కానీ గెలిపించుకోలేని నాయకుల కబంద హస్తాల” నుండి పార్టీని ఇప్పటికైనా తప్పించాలని అనేకమంది కోరుతున్నారు. ఈ దశలోనైనా బీజేపీ జాతీయ నాయకత్వం కళ్లు తెరచి రాష్ట్రంలోఅవసానదశకు చేరుకున్న పార్టీకి జవసత్వాలు కలిగించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని, పార్టీని బ్రతికించేందుకు అడుగులు వేయాలని 25 ఏళ్లుగా పార్టీలో పనిచేస్తున్న సీనియర్ కార్యకర్తలు కోరుతున్నారు. ఈ ఎన్నికల నాటికి బీజేపీ ఊపిరి తీసుకుని తన అస్తిత్వాన్ని నిలుపుకుంటుందా? లేక మట్టి కొట్టుక పోతుందా ? అన్నది కాలమే తేల్చాలి.