బీజేపీపై రేవంత్ కీలక వ్యాఖ్యలు… తెరపైకి ‘బ్రిటిష్ జనతా పార్టీ’!

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్ లో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. ఆపై గాంధీభవన్‌ లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును… 140 కోట్ల భారతీయులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అని చెప్పిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి… అనంతరం కాంగ్రెస్ పార్టీ నేతలు, ప్రస్తుత బీజేపీ పాలనపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా భారతీయ జనతాపార్టీ (బీజేపీ) ని బ్రిటీష్ జనతా పార్టీ అంటూ ప్రస్థావించడం గమనార్హం!

ఈ సందర్భంగా రేవంత్… దేశ ప్రజలకు స్వాతంత్ర్య ఫలాలు అందించాలని లక్షలాది కాంగ్రెస్ శ్రేణులు ప్రాణత్యాగాలు చేశారని గుర్తుచేశారు. ఈ క్రమంలో ఈరోజు ప్రధానంగా ముగ్గురిని మనం స్మరించుకోవాలని అన్నారు. వారు.. మహాత్మగాంధీ, అంబేద్కర్, జవహర్ లాల్ నెహ్రూ అని రేవంత్ స్పష్టం చేశారు.

అహింస మార్గంతో పోరాటం చేయవచ్చని నిరూపించిన మహనీయుడు మహాత్మా గాంధీ.. దేశంలో ఓటును ఆయుధంగా మార్చి అందరికీ సమాన హక్కులు కల్పించిన మహానుబావుడు అంబేద్కర్ .. కరువు కాటకాలతో తల్లడిల్లుతున్న దేశాన్ని సంక్షేమ ఫలాలు అందించిన మహానేత జవహర్ లాల్ నెహ్రూ అని వివరణ ఇచ్చారు.

ఇదే సమయంలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర వనిత ఇందిరా గాంధీ అని కొనియాడిన రేవంత్ రెడ్డి… దేశంలో ఐటీ రంగంలో గొప్ప స్ఫూర్తినిచ్చిన గొప్ప ప్రధాని రాజీవ్ గాంధీ అని తెలిపారు. ఇదే క్రమంలో… దేశాన్ని ఆర్థికంగా పురోగతివైపు నడిపించింది పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ అని పేర్కొన్నారు.

అయితే నేడు దేశంలో విభజించు పాలించు విధానాన్ని బ్రిటిష్ జనతా పార్టీ అవలంబిస్తోందని రేవంత్ విమర్శించారు. అందుకోసమే… విద్వేషాన్ని వీడాలని భారత్ జోడోతో రాహుల్ గాంధీ స్ఫూర్తి నింపారని తెలిపారు. ఇదే సమయంలో బీజేపీ ప్రభుత్వంలో చేసిన అప్పులపైనా రేవంత్ కీలక విషయాలు వెల్లడించారు.

ఇందులో భాగంగా… భారతదేశ మొట్టమొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ వరకు 60 ఏళ్లలో చేసిన అప్పుకంటే.. ఎనిమిదేళ్లలో మోడీ రెండింతలు ఎక్కువ అప్పు చేశారని దుయ్యబట్టారు. ఇప్పుడు భారతదేశం అప్పు కోటి కోట్లను రేవంత్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

బీజేపీ వస్తే జీడీపీ పెరుగుతుందన్నారు.. కానీ పెరిగింది గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు అని రేవంత్ దుయ్యబట్టారు. మణిపూర్ మండుతుంటే సైన్యాన్ని పంపి నిలువరించాల్సింది పోయి.. కాంగ్రెస్ ఓడించేందుకు ఈడీ, సీబీఐని పంపించారని.. నియంతలకంటే నికృష్టాంగా మోడీ వ్యవహరిస్తున్నారని రేవంత్ తీవ్రస్థాయిలో విమర్శించారు.