Ramabanam Movie Review: ‘రామబాణం’ మూవీ ఎలా ఉందంటే…?

‘లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత మాచో స్టార్ గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్‌ కలయికలో వచ్చిన హ్యాట్రిక్ ఫిల్మ్ ‘రామబాణం’. వరుస విజయాలతో దూసుకుపోతున్న అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల సంయుక్తంగా భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో గోపీచంద్ సరసన నాయికగా డింపుల్ హయతి నటించగా, జగపతి బాబు, కుష్బూ ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ప్రచారం చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. హీరో గోపీచంద్ మంచి హిట్ కొట్టి చాలా కాలమే అయింది. ఏడాదికి ఒకటిరెండు సినిమాలు చేసుకుంటూ వెళ్తోన్న అతడు మంచి స్క్రిప్ట్‌లు ఎంపిక చేసుకోవడంలో విఫలమవుతున్నాడు. మాచో హీరో గా పేరు సంపాదించుకున్న యాక్ష‌న్ హీరో గోపీచంద్ వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తూ ఉంటాడ‌న్న విష‌యం అందరికీ తెలిసిందే. అయితే అన్ని ఉన్నా అల్లుడు నోట్లో శని ఉంది అన్నట్లు మంచి టాలెంట్ ఉన్నా కూడా ఆయ‌న స‌రైన విజయాలను అందుకోలేకపోతున్నాడు. గ‌త కొంత కాలంగా వ‌రుస పెట్టి సినిమాలు చేస్తున్నా సరే.. కాలం కలిసిరాక చాలా సినిమాలు ఫ్లాపులుగానే నిలిచాయి. 2014లో వచ్చిన ‘లౌక్యం’ సినిమా తరవాత మళ్లీ ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయాడు. మళ్లీ ఇప్పుడు ఆ సినిమా దర్శకుడు శ్రీవాస్‌తో ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చేశాడు గోపిచంద్.

దీనికి నందమూరి బాలకృష్ణ ‘రామబాణం’ అనే టైటిల్ ఖరారు చేశారు. ప్రముఖ దర్శకుడు టి. కృష్ణ కుమారుడిగా ‘తొలివలపు’ సినిమాతో హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యాడు గోపీచంద్. తర్వాత ఏ హీరో చేయని విధంగా విలన్ క్యారెక్టర్స్ లో నటించి అదరగొట్టాడు. జయం, నిజం, వర్షం సినిమాల్లో ప్రతినాయకుడిగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత యజ్ఞం సినిమాతో మళ్లీ హీరోగా సినీ కెరీర్ ను ప్రారంభించాడు. తర్వాత అనేక హిట్ సినిమాలతో మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘లక్ష్యం’, ‘లౌక్యం’ సినిమాల తరవాత గోపీచంద్-శ్రీవాస్ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా కావడం.. విడుదలకు ముందు వచ్చిన ట్రైలర్, టీజర్, సాంగ్స్, పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ రావడంతో సహజంగానే ప్రేక్షకుల్లో ‘రామబాణం’పై అంచనాలు ఏర్పడ్డాయి. ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ సైతం సినిమాపై అంచనాలు పెంచాయి. పండుగ వాతావరణాన్ని ప్రతిభింభించేలా గుడి ఆవరణలో పంచె కట్టు, నుదుటన బొట్టుతో గోపీచంద్, జగపతిబాబు ఒకరి చేయి ఒకరు పట్టుకొని నడిచొస్తున్న పోస్టర్ తెలుగుదనం ఉట్టిపడేలా ఎంతో అందంగా ఉండి ఆసక్తిని కలిగించింది. డింపుల్ హయాతి, జగపతిబాబు, ఖుష్బూ నటించిన ఈ సినిమా నేడు (మే 5, 2023)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ కాంబో హ్యాట్రిక్ కొట్టిందా, అంచనాలను అందుకుందా? లేదా? లక్ష్యం, లౌక్యం లాంటి సూపర్ హిట్స్ తర్వాత గోపీచంద్, శ్రీవాస్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ‘రామబాణం’ ప్రేక్షకులను మెప్పించిందా.. తొమ్మిది సంవత్సరాల తర్వాత గోపీచంద్ కోరుకున్న విజయాన్ని అందించిందా అనేది సమీక్షలో చూద్దాం..

కథ: చిన్నప్పుడే తన అన్నయ్య రాజారాం (జగపతిబాబు)తో గొడవ పడి ఇంటి నుంచి వెళ్ళిపోతాడు విక్కీ (గోపిచంద్). అలా వెళ్ళిపోయిన అతడు కలకత్తా చేరి అక్కడ పెద్ద డాన్ అవుతాడు. అదే సమయంలో విక్కీ జీవితంలోకి భైరవి (డింపుల్ హయతి) ప్రవేశిస్తుంది. అనుకోని పరిస్థితుల్లో చాలా ఏళ్ల తర్వాత మళ్లీ కుటుంబం దగ్గరికి విక్కీ వెళ్లాల్సి వస్తుంది. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత తన కుటుంబం సమస్యల్లో ఉందని తెలుసుకుంటాడు. తన అన్నయ్య చేస్తున్న ఆర్గానిక్ ఫుడ్ బిజినెస్ కు ఒక పెద్ద బిజినెస్ మాన్ (తరుణ్ అరోరా) అడ్డుపడుతున్నట్టు తెలుసుకుంటాడు విక్కీ. ఆ తర్వాత అతడేం చేశాడు అనేది అసలైన కథ.

విశ్లేషణ : కథానాయకుడు గోపీచంద్‌ మరోసారి ప్రేక్షకులను మెప్పించలేకపోయారు. సినిమా రొటీన్‌గా ఉండడమే గాక కాలంచెల్లిపోయిన కథతో చేసిన ఈ ప్రయోగం ఏమంత ఆశాజనకంగా లేదు.. ఒక్క గోపీచంద్ తప్ప సినిమాలో ప్లస్ పాయింట్లు అంటూ ఏమీ లేవు. చిన్నప్పుడే హీరో ఇంటి నుంచి పారిపోవడం.. బయటికి వెళ్లి ఒక పెద్ద స్థాయికి చేరుకోవడం.. ఎదిగే క్రమంలో కొన్ని తప్పులు చేయడం.. ఆ తర్వాత మళ్లీ సొంత ఇంటికి వచ్చి కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళను బయటపడేయడం ఈ కాన్సెప్ట్ తో తెలుగులో ఇదివరకే ఎన్నో సినిమాలు వచ్చాయి. ఈ ‘రామబాణం’ కూడా ఇదే తరహాలో వచ్చిన సినిమా. లక్ష్యం, లౌక్యం లాంటి సినిమాల తర్వాత మరోసారి రొటీన్ కాన్సెప్ట్ తో శ్రీవాస్ ఈ సినిమాను తెరకెక్కించాడు. సినిమా మొదలైన తొలి పదినిమిషాల్లోనే హీరో ఏం చేస్తాడు ఎందుకు వెళ్లిపోయాడు అనే క్లారిటీ ఇచ్చాడు. ఆ తర్వాత కుటుంబం కష్టాల్లో ఉంది అని తెలుసుకొని రావడం.. ఒక్కొక్కటిగా హీరో ఆ సమస్యలను పరిష్కరించుకుంటూ వెళ్లడం జరుగుతుంది. ఇంటర్వెల్ ఫైట్ కాస్త ఆసక్తికరంగా తెరకెక్కించాడు. ఫస్ట్ అఫ్ అంత పూర్తిగా యాక్షన్ అక్కడక్కడ కామెడీతో నింపేశాడు దర్శకుడు. సెకండాఫ్ పూర్తిగా మాస్ ఎలిమెంట్స్ తో కవర్ చేయాలని చూసాడు. మధ్యలో ఆర్గానిక్ ఫుడ్ చుట్టూ కథను తిప్పాడు. కాకపోతే అది కూడా అనుకున్నంత స్థాయిలో వర్కౌట్ అవలేదు. కథ మరీ రొటీన్ గా ఉండడం.. లక్ష్యంలా అటు ఎమోషన్ పండలేదు.. లౌక్యంలా ఇటు కామెడీ వర్కౌట్ కాలేదు. మధ్యలో ఆగిపోయింది రామబాణం. దానికి తోడు స్క్రీన్ ప్లే లోపం కూడా ఈ సినిమాకు మైనస్ గా మారింది. డింపుల్ హయతితో వచ్చే లవ్ సన్నివేశాలు.. పాటలు ఇరికించినట్లు ఉన్నాయి.

గోపీచంద్ మాత్రం చాలా స్టైలిష్‌గా కనిపించాడు. యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి. కొన్ని కామెడీ సీన్లు, ఇంకొన్ని పాటలు మినహా సినిమాలో ఆసక్తికర అంశాలు ఏమీ లేకపోవడంతో సినిమా చూస్తున్న ప్రేక్షకులు బోర్ ఫీలయ్యారు. హీరో గోపీచంద్‌ ఇలాంటి నాసిరకం కథను ఎందుకు ఎంచుకున్నాడో అర్ధంకాదు. సినిమాలో ఎక్కడా సూపర్ అనిపించే సన్నివేశాలే లేవు. సినిమా చూస్తున్న ప్రేక్షకుడు తరవాత ఏం జరుగుతుందో ఇట్టే ఊహించేస్తాడు. నిజానికి ఈ సినిమా విడుదలకు ముందు దర్శకుడు శ్రీవాస్ చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పారు. ప్రస్తుతం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు రావడం లేదని, ఆ కొరతను ‘రామబాణం’ తీరుస్తుందని గోపీచంద్, శ్రీవాస్ చెప్పుకున్నారు. ఫ్యామిలీ మొత్తం కలిసి థియేటర్‌కు వెళ్లి ఎంజాయ్ చేసే సినిమా ‘రామబాణం’ అని అన్నారు. అలాగే, ఒక సోషల్ మెసేజ్ కూడా ఉందని చెప్పారు. అయితే, ఇవేవీ ఇప్పుడు సినిమాను కాపాడేలా కనిపించడం లేదు. ఇదివరకు లక్ష్యం సినిమాలో అన్నదమ్ముల్లుగా నటించిన గోపీచంద్, జగపతి బాబు మరోసారి ఈ సినిమాలో బ్రదర్స్ క్యారెక్టర్స్ పోషించారు. ‘రామబాణం’ లో జగపతి బాబు, గోపీచంద్ మధ్య అన్నదమ్ముల బంధం చాలా బాగానే చూపించారు. జగపతి బాబు కెమికల్ ఫార్మింగ్ పై పోరాటం చేస్తూ ఆర్గానిక్ ఫుడ్ చేసే మేలు గురించి చెబుతుంటాడు.

ఈ సినిమా అంతా కల్ కతా బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంటే హీరోయిన్ డింపుల్ యూట్యూబర్ గా తన అందం, నటనతో అలరించింది. డింపుల్ తో రొమాన్స్, కామెడీ, డ్రామా అన్ని కలగలిపిన చిత్రమిది. తన అన్నయ్య జగపతి బాబు, వదిన కోసం గోపీచంద్ చేసే యాక్షన్ సీన్స్ కొంతమేరకు ఊరట కలిగిస్తాయి. యాక్షన్ అంశాలతో కూడిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా చిత్రం తెర‌కెక్క‌గా, ఈ మూవీ అన్న -తమ్ముళ్ల అనుబంధంగా సాగింది. కార్పొరేట్ మాఫియా నేపథ్యంలో సాగే కధగా చిత్రాన్ని తెర‌కెక్కించ‌గా, కార్పొరేట్ మాఫియా రూపంలో కుటుంబానికి ఎదురైనా కష్టాలని హీరో ఎలా ఎదుర్కొన్నాడు, తన కుటుంబాన్ని రక్షించే క్రమంలో హీరో ఎదుర్కొనే పరిస్థితులు ఏంటి? హీరోకి జ‌గ‌ప‌తిబాబు ఎలాంటి స‌పోర్ట్ అందించాడు అనేది వెండితెర‌పై చూడాల్సిందే. ఈ చిత్రంలో గోపిచంద్ త‌న పాత్రకి నూటికి నూరు శాతం న్యాయం చేశాడు. గోపిచంద్ సీనిమాలంటే యాక్షన్ సీన్స్, టాప్ డైలాగ్స్, ఎలివేషన్ లు క‌చ్చితంగా ఉంటాయి. అయితే ఇది ఫ్యామిలీ డ్రామా అనే స‌రికి అవేమి ఉండ‌వ‌ని అనుకుంటారు. కాని శ్రీవాస్ అన్ని మిక్స్ చేసి ప్రేక్ష‌కుల‌కి మంచి సినిమాని అందించే ప్రయత్నం మాత్రం బాగానే చేశాడు కానీ…ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయాడు.

నటీనటులు ఎలా చేశారంటే.. గోపీచంద్ లుక్స్ పరంగా హీరోయిజం ఎలివేషన్స్ పరంగా మరోసారి ఆకట్టుకున్నాడు. జగపతి బాబు, గోపీచంద్ మధ్య అన్నదమ్ముల బంధం చాలా బాగా చూపించారు. అన్నయ్య జగపతి బాబు, వదిన కోసం గోపీచంద్ చేసే యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయి . గోపీచంద్ ఈ తరహా పాత్రలు చేయడం ఇది మొదటిసారి కాదు. కెరీర్ మొదటి నుంచి ఇలా చేస్తూనే ఉన్నాడు. రామబాణంలో కూడా కొత్తగా ఏమనిపించలేదు. తనకు అలవాటు అయిన పాత్రలు ఇరగదీసాడు. జగపతిబాబు క్యారెక్టర్ బాగుంది. డింపుల్ హయాతి గ్లామర్ షోతో ఆకట్టుకుంది. కుష్బూ తన పాత్రకు న్యాయం చేశారు. అలీ, సత్య, గెటప్ శ్రీను కామెడీ పర్లేదు. విలన్స్ గా నాజర్, తరుణ్ అరోరా రొటీన్ అయిపోయారు.

టెక్నిక‌ల్ విష‌యాలకొస్తే… దర్శకుడు శ్రీవాస్ సినిమాలో యాక్షన్ , కామెడీని సరైన నిష్పత్తిలో కలపడానికి ప్రయత్నించాడు. అయితే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉండేలా సినిమా చూసుకోలేక పోయారు. మిక్కీ జే మేయర్ సంగీతం పెద్దగా ఆకట్టుకోలేదు. పాటల్లో మోనాలిసా పర్లేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ మరింత షార్ప్ గా ఉండాల్సింది. సినిమాటోగ్రఫీ వర్క్ పర్లేదు. శ్రీవాస్ డైరెక్షన్ రొటీన్ గా ఉంది. స్క్రీన్ ప్లే మరింత రొటీన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ విలువలు బాగున్నాయి .వెట్రి పళనిసామి సినిమాటోగ్రఫీ నాణ్యమైన విజువల్స్ ఒకే అనిపించాయి. భూపతి రాజా కథ కాస్త పాతదిగా ఉండటం సినిమాకి మైన‌స్ గా నిలీచింది. నిర్మాణ విలువ‌లు మాత్రం బాగున్నాయి. సో. మొత్తం మీద రొటీన్ కథనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన దర్శకుడు శ్రీవాస్ ‘రామబాణం’ గురితప్పేలా చేశాడు.

(చిత్రం : రామబాణం, రేటింగ్ : 2/5, నటీనటులు : గోపీచంద్, జగపతి బాబు, డింపుల్ హయాతి, ఖుష్బూ. వెన్నెల కిషోర్, అలీ, సప్తగిరి, సత్య, గెటప్ శ్రీను తదితరులు. దర్శకత్వం : శ్రీవాస్, నిర్మాత: టి.జి. విశ్వ ప్రసాద్, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల, నిర్మాణం : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సంగీతం: మిక్కీ జే మేయర్, డీఓపీ: వెట్రి పళని స్వామి, కథ: భూపతి రాజా, మాటలు : మధుసూధన్ పడమటి, ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ కుమార్ మన్నె)