తమిళ రాజకీయాలకు, సినీ పరిశ్రమకు విడదీయరాని బంధం ఉంది. అక్కడి రాజకీయ పరిస్థితులను సినిమా సెలబ్రిటీలు బాగా ప్రభావితం చేస్తుంటారు. ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి లాంటి ముఖ్యమైన నేతలు సినిమా రంగానికి చెందినవారే. వీరు ముగ్గురూ ముఖ్యమంత్రులుగా పనిచేశారు. వీరి పనితనం వలన సినిమా సెలబ్రిటీలను రాజకీయాల్లోకి రావాలని తమిళ ప్రజలు కోరుతూ ఉంటారు. ఎంజీఆర్ చాన్నాళ్ల క్రితమే మరణించగా జయలలిత, కరుణానిధి ఈమధ్యే కాలం చేశారు. వీరి మరణంతో తమిళ రాజకీయాల్లో గొప్ప శూన్యత ఏర్పడింది. దాన్ని భర్తీ చేయగల చరీష్మా ఉన్న నేత అప్పటికి ఎవరూ లేరు. దీంతో సూపర్ స్టార్ రజనీకాంత్ మాత్రమే వారు లేని లోటును భర్తీ చేయగలరని ఆయన అభిమానులు భావించి ఆయన మీద ఒత్తిడి తెచ్చారు. రజనీకాంత్ సైతం ముందుకు వచ్చి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేశారు. కానీ ఇంతవరకు ఎలాంటి యాక్టివిటీస్ లేవు.
రజనీకాంత్ భయం అదే కావొచ్చు:
రజనీకాంత్ కి అశేషమైన అభిమానగణం అయితే ఉంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. దాన్ని చూసుకునే ఆయన రంగంలోకి దిగారు. అభిమానులంతా ఓటేస్తే గెలవలేమా అనుకున్నారు. కానీ ఎంజీఆర్ కాలానికి ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది. ఆయన్ను ఆదరించినట్టు ఇప్పుడు తనను ఆదరిస్తారా అనే అనుమానం ఆయనలో మొదలై ఉండవచ్చు. అధికార పక్షం అన్నాడీఎంకే ప్రజల్లో బలహీనంగా ఉన్నా ప్రతిపక్షం డీఎంకే మాత్రం బలం పుంజుకుంటోంది. స్టాలిన్ ఎలాగైనా ఈసారి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చుని తీరాలని గట్టిగా డిసైడ్ అయ్యారు. బలంగా జనంలోకి వెళుతున్నారు. ఆయన్ను తట్టుకోవడమే రజినీకి కష్టం. ఒకవేళ అటు ఇటు అయి ఓడినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
అంత వైభవంగా రాజకీయాల్లోకి దిగి అధికారం అందుకోలేకపోతే ప్రతిష్ట దెబ్బ తింటుందని రజనీ సందేహం కావొచ్చు. అందుకే ఆయన తన పార్టీ నుండి ముఖ్యమంత్రిని తాను కాదని వేరొక సమర్థుడిని నియమిస్తానని అన్నారు. సరే ఓటమిని తట్టుకున్నా ఓడిన పార్టీని కాపాడుకోవడం చాలా కష్టం. దానికి ఎంతో ఓపిక, దూకుడు ఉండాలి. బయట, లోపల జరిగే రాజకీయ కుట్రల్లో పార్టీ ముక్కలు కాకుండా కాచుకోవాలి. అదే ప్రధానం. అప్పుడే పడినా లేవడానికి ఇంకో అవకాశం ఉంటుంది. అలా కాకుండా పడిన చోటే భూస్థాపితం అయిపోతే ఏమీ మిగలదు. బహుశా ఈ భయమే రజనీని వెనక్కి లాగుతున్నట్టుంది. పైగా ఆయన మీద ఇప్పటికే స్థానికేతరుడనే ప్రచారం కూడ మొదలైంది. ఈ నాన్ లోకల్ ఫీలింగ్ పనిచేస్తే రజనీ చాలా నష్టపోవలసి వస్తుంది.
రజనీకాంత్ దగ్గర టైమ్ తక్కువుంది :
రజనీ గతంలో లోక్ సభ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయడం లేదు అంటే తన లక్ష్యం అసెంబ్లీ ఎన్నికలని అన్నారు. ఇప్పుడు ఆ ఎన్నికలే దగ్గరపడ్డాయి. ఇంకో ఏడెనిమిది నెలల్లో ఎన్నికలు రావొచ్చు. ఇంకా ఆరంభ పనులే మొదలుకాలేదు. రజనీ మక్కల్ మండ్రం అనే పేరు మినహా ఆయన పార్టీ గురించి ప్రజలకు పెద్దగా ఏమీ తెలీదు. పార్టీ విధివిధానాలు, ఎన్నికల మేనిఫెస్టో, పార్టీలో ఉండబోయే నాయకులు ఎవరు అనే వాటి మీద క్లారిటీ లేదు. వాటన్నింటినీ రూపొందించుకోవాలి. ఇంకా జెండా, ఎన్నికల గుర్తు రావాలి. నియోజకవర్గాల వారీగా పార్టీ నిర్మాణం జరగాలి. అభిమాన సంఘాలన్నీ పార్టీ క్యాడర్ గా రూపాంతరం చెందాలి. అభ్యర్థులను ఏర్పాటు చేసుకోవాలి. ఎన్నికల ప్రచారానికి రూట్ మ్యాప్ సిద్దం కావాలి. ఇలా అనేక ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి.
వాటన్నింటికీ ఏడెనిమిది నెలల సమయం అంటే చాలా తక్కువ. పార్టీని పటిష్టంగా నిర్మించాలంటే ఆ టైమ్ సరిపోవాలంటే రజనీ సూపర్ వేగంతో పనిచేయాలి. అలా చేయగలరా అంటే ఖాళీగా ఉంటే చేయవచ్చు. కానీ ఆయన సైన్ చేసిన సినిమాలు రెండు మూడు ఉన్నాయి. ఒకటి ఆల్రెడీ షూటింగ్ దశలో ఉంది. కరోనా ఎఫెక్ట్ తగ్గి అవి పూర్తి కావడానికి ఎంత టైమ్ పడుతుందో చెప్పలేం. సో.. కరెక్టుగా చెప్పాలంటే రజనీ దగ్గర సమయం చాలా తక్కువ ఉంది. ఈ సమయంలోనే అయన ఎన్నో కార్యాలు చేయాలి. అవి కూడ ఎంతో పకడ్బందీగా. గెలుపును అందించేలా ఉండాలి. సో…ఈ ఎలక్షన్లు స్టార్ రజనీ రాజకీయ సామర్థ్యానికి ఒక పరీక్ష లాంటివన్నమాట.