హత్రాస్ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంకా గాంధీలు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారని, ఆ తోపిడిలో ఆయన కిందపడిపోయారనే వార్తలు సోషల్ మీడియాల్లో, పత్రికల్లో, ఛానెల్స్ లో కొంత అలజడిని సృష్టించాయి. రాహుల్ గాంధీ అంటే సామాన్యుడా? ఈ దేశ రాజకుటుంబానికి చెందిన వ్యక్తి. ఏనాటికైనా ఈ సువిశాల దేశానికి ప్రధానమంత్రి అయ్యే అర్హత కలిగిన రాజకుమారుడు. అంతటి వ్యక్తిని కూడా లెక్కచెయ్యకుండా పోలీసులు అడ్డుకోవడం ఒకరకంగా చెప్పుకోవాలంటే దుర్మార్గమే. అందుకు రాహుల్ గాంధీ మీద సానుభూతిని ఒలకబోస్తూ బోలెడన్ని వార్తలు! రాహుల్ గాంధీ అంతటివాడినే నేలమీదకు తోస్తారా అంటూ ఆగ్రహావేశాలు!

ఒకసారి గతంలోకి తొంగి చూస్తే….
ఏడెనిమిదేళ్లు వెనక్కు వెళదాం. వైఎస్ రాజశేఖర రెడ్డి అనే ఒక నాయకుడు మూడు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో ప్రాణనాడిగా జవజీవాలు అందించాడు. చంద్రబాబు దెబ్బకు నేలకరిచిన పార్టీని రెండుసార్లు వరుసగా అధికారంలోకి తెచ్చాడు. లెక్కలేనన్ని సంక్షేమపథకాలను అమలు చేసి ఇందిరమ్మ రాజ్యం అంటే ఏమిటో తెలియనివారికి అంతకన్నా గొప్ప పరిపాలన అందించాడు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం రెండు సార్లు అధికారంలోకి రావడానికి సహకరించాడు. అలాంటి మహా నాయకుడు మరణించిన తరువాత ఆయన కొడుకు, నేటి రాహుల్ గాంధీలాంటి హోదాయే కలిగిన జగన్మోహన్ రెడ్డి మీద అనేక అక్రమ కేసులు పెట్టారు. ఒకసారి ఆయన్ను చంచల్ గూడ నుంచి సిబిఐ ఆఫీసుకు తీసుకెళ్లడానికి జేబుదొంగలను తీసుకెళ్లే జీపులో తీసుకెళ్లారు. అప్పటికి ఆయన రాహుల్ గాంధీలా అసమర్ధుడు కాదు. వందలకోట్ల రూపాయల పరిశ్రమలు నిర్వహిస్తున్న పారిశ్రామికవేత్త. పైపెచ్చు పార్లమెంట్ సభ్యుడు. మరొక సంఘటనలో వైఎస్సార్ భార్య విజయమ్మను, కుమార్తె షర్మిలను, జగన్ భార్య భారతి రెడ్డిని రాజ్ భవన్ గేటు ముందు కింద కూర్చోబెట్టారు పోలీసులు. ఇంకొక సంఘటనలో వారు పశ్చిమగోదావరి జిల్లాలో ఎక్కడికో కారులో వెళ్తుంటే పోలీసులు రోడ్డు మీద వారి కారును ఆపి సామానులు కింద పడేసి ఎవరో స్మగ్లర్లను, దొంగరవాణాదారులను సోదాలు చేసినట్లు చేసి అవమానించారు. అప్పుడు కేంద్రంలో అధికారం చెలాయిస్తున్నది ఇదే రాహుల్ గాంధీ, సోనియా గాంధీలే. రాహుల్ గాంధీ ఏ విధంగా జగన్మోహన్ రెడ్డికంటే నాడు గొప్పవాడు? ఇద్దరూ ప్రజలచేత ఎన్నిక కాబడిన ప్రజాప్రతినిధులే కదా?
క్షీణిస్తున్న నైతిక విలువలు
ప్రజాస్వామ్యాన్ని గౌరవించే దేశాల్లో ప్రధానమంత్రితో సముడుగా ప్రతిపక్ష నాయకుడిని కూడా గౌరవిస్తారు. ముఖ్యమంత్రితో సమానంగా ప్రతిపక్షనేతను కూడా మర్యాదిస్తారు. రాష్ట్రానికి సంబంధించిన విషయాల్లో ప్రతిపక్ష నేతలను కూడా సంప్రదిస్తారు. ప్రతిపక్ష నాయకులు అంతకుముందు అధికారపక్షంలో ఉన్నవారైతే వారి అనుభవాన్ని వినియోగించుకుంటారు. కానీ నేడు అలాంటి పరిస్థితి ఉన్నదా? అధికారంలోకి వచ్చినవాడు తాను శాశ్వతం అనుకుంటున్నాడు. మిగిలినవారిని పురుగుల్లా చూస్తున్నాడు. నియంతగా విర్రవీగుతున్నాడు. ప్రతిపక్షాలను గౌరవించడం అనేది నాశనమై దశాబ్దాలు గడిచాయి. పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నేత వాజపేయిని అలాగే గౌరవించారు. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు వాజపేయిని అమెరికా పంపించి మూత్రపిండాలకు చికిత్స చేయించారు. అలాంటి మర్యాదలు, గౌరవాలు నేడు ఎక్కడున్నాయి? అయిదేళ్ల పాటు ప్రభుత్వాన్ని నడిపించిన పీవీ నరసింహారావును ఇదే సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఎలా గౌరవించారో ఈదేశం చూసింది. ఆయన్ను కోర్టు బోను ఎక్కించారు. కోర్టుల చుట్టూ తిప్పించారు. ఆయనకు లోక్ సభ టికెట్ కూడా ఇవ్వకుండా ఘోరంగా అవమానించారు. చివరకు ఆయన పార్ధివదేహాన్ని ఢిల్లీలోని పార్టీ ఆఫీసులోకి కూడా అనుమతించలేదు.
పోలీసుల ప్రవర్తన ఎప్పుడైనా ఒకటే
పోలీసులదేముంది? ప్రభుత్వంలో ఎవరున్నా వారి పనితీరు ఒకటిగానే ఉంటుంది. రాహుల్ గాంధీ బయటకొస్తుంటే ఆయనకు సెల్యూట్లు చేసింది ఇదే పోలీసులు కదా? ఆయన ఎక్కడికైనా పర్యటనలకు వెళ్ళినపుడు బుల్లెట్ ప్రూఫ్ కారు దిగగానే ఆయన వెంట పరిగెత్తేది ఇదే పోలీసులు. అదే పోలీసులు నాడు జగన్మోహన్ రెడ్డిని రెక్కలు పట్టుకుని జీపు ఎక్కించారు. ఆయన్ను చూసి సలాములు కొట్టలేదు. నేడు అదే పోలీసులు ఈరోజు జగన్ మోహన్ రెడ్డికి వందనాలు సమర్పిస్తున్నారు. ఆయన బులెట్ ప్రూఫ్ కార్ ఎక్కగానే ఆ కారు వెంట సెక్యూరిటీ వారు పరిగెత్తుతున్నారు! అయన పర్యటనలకు వెళ్తే వందలాదిమంది పోలీసులు గంటల ముందే మొత్తం బ్లాక్ చేసి జగన్ కాన్వాయ్ కు దారి క్లియర్ చేస్తారు. జగన్ మాట అంటే రాష్ట్రంలోని అధికారులందరికీ వేదం. ఆయన కూర్చుంటే ఆయన పక్కన వినయంగా ఐపీఎస్ డీజీపీ, ఐఏఎస్ చీఫ్ సెక్రెటరీ కూడా నిలుచునే వివరించాలి. అంతా కాలమహిమ! ప్రజాస్వామ్య మహిమ!!
ఎద్దు పుండు కాకికి ముద్దా?
కాబట్టి రాహుల్ గాంధీని ఏదో అవమానించారని ఎవరూ కన్నీరు పెట్టాల్సిన పనిలేదు. మనం వేపకొమ్మను నాటితే మామిడి కాయలు కాయవు. విశాలమైన సముద్రంలో నావలో పయనించేవాడు దాహానికి మంచినీళ్ల సీసాలు పట్టుకుని వెళ్లాల్సిందే. అది సహజం. ఏమో..రేపు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఇదే పోలీసులు నరేంద్రమోడీని పెడరెక్కలు విరిచి లాక్కెళ్తారు. అనవసరంగా పోలీసులను ఆడిపోసుకోవద్దు!! చేసుకున్నవారికి చేసుకున్నంత మహాదేవ అని పెద్దలు ఊరికే చెప్పలేదు..
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు
