Ponniyin Selvan 2 Review – పొన్నియన్ సెల్వన్ – 2 మూవీ రివ్యూ!

అద్భుతమైన కళాఖండాలను అందించిన క్రియేటివ్ దర్శకుడు మ‌ణిర‌త్నం.. త‌న డ్రీమ్ ప్రాజెక్ట్‌ “పొన్నియన్ సెల్వన్” చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మొదటి భాగం విడుదలై మంచి విజయాన్ని అందుకున్నా… పూర్తి అసంపూర్తిగా ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది. అయితే… ఈ రోజు రెండో పార్ట్ ప్రేక్షకుల ముందుకు వ‌చ్చింది. మొదటి భాగం మిగిల్చిన ఆ అసంతృప్తిని ఈ సెకండ్ పార్ట్ ఫుల్ ఫిల్ చేసిందా.. పొన్నియన్ సెల్వన్ నవలను రెండు భాగాలుగా చదివి పూర్తిచేసిన తృప్తిని ఈ సెకండ్ పార్ట్ ఇచ్చిందా అన్నది ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాని తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుద‌ల చేశారు.

రాజ్యాన్ని హస్తగతం చేసుకునేందుకు చోళనాడు యువరాజు అరుణ్మోజి వర్మన్ ని చంపాలని చూస్తారు. ఈ సమయంలో యువరాజు అరుణ్మోజి గా నటించిన జయం రవి ని కాపాడే బాధ్యత వల్లవరాయన్ గా నటించిన కార్తీ తీసుకుంటాడు. సముద్రంలో ప్రత్యర్ధులతో జరిగిన యుద్ధంలో అరుణ్మోజి మరణించాడని అంతా అనుకుంటారు. అప్పుడు అరుణ్మోజి మరణానికి ప్రతీకారంగా ఆదిత్య కరికాలన్ పాత్రలో ఒదిగిపోయిన విక్రమ్ ఏం చేశాడు? అసలు చోళులపై నందిని పాత్రలో నటించిన ఐశ్వర్య రాయ్ పగ ఎందుకు పెంచుకున్నారు? ఆదిత్య కరికాలుడిని చంపి, చోళనాడును ఆమె ఎందుకు నాశనం చేయాలనుకుంటుంది? అనేది మిగిలిన కథ!

పీఎస్ పార్ట్ 2లో విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష, శోబితా దూళిపాళ్ల కీలక పాత్రల్లో నటించారు. పైన చెప్పుకున్న పేర్లలో… ఎవరి నటన గురించీ ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. అదే క్రమ్మలో ఈ చిత్రంలోనూ… ప్రతీ ఒక్కరూ వారి వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఏ పాత్ర కూడా నిరాశ‌ప‌ర‌చే విధంగా ఉండ‌దు.

అయితే ఈ చిత్రంలో నందిని గా ఐశ్వర్య రాయ్ – కరికాలన్ గా విక్రమ్ ఎదురుపడే సన్నివేశాలు మాత్రం సినిమాకే హైలెట్ గా నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం ఉండదు. ఎప్పటిలాగానే చియాన్ విక్రమ్ తన నటనతో ఆకట్టుకున్నాడు. కార్తీ, త్రిష, జయం రవి కూడా వావ్ అనిపించారు. శోబితా దూళిపాళ్ల కూడా తన పరిధిమేరకు బాగానే నటించింది.

ఇక దర్శకుడు మ‌ణిర‌త్నం గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. సాధారణ కథని సైతం తన టెకింగ్ మేజిక్ తో అందంగా తెరకెక్కించడంలో దిట్ట అయిన మణిరత్నం… ఈ స్థాయి హిస్టారికల్ నవలని ఎలా తెరకెక్కించారనేది ఎవరి ఊహకు వారికి వదిలేయాల్సిన పరిస్థితి. ఆయన… ప్రతీ ఫ్రేముని చాలా అందంగా తీసాడు.

ఇక అన్నింటికంటే ఏఆర్ రెహ్మాన్ ఇచ్చిన మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ సినిమాలో మరో హైలైట్ అని చెప్పాలి. ఇదే క్రమంలో ర‌వివర్మ సినిమాటోగ్రఫీ, గ్రాఫిక్స్ వర్క్, విజువల్ ఎఫెక్ట్స్, స్క్రీన్ ప్లే అద్భుతం అని చెప్పొచ్చు.

అవును… ముందుగా చెప్పుకున్నట్లుగానే… న‌టీన‌టుల ప‌ర్‌ఫార్మెన్స్ కి తోడు.. రెహ‌మాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మణిరత్నం దర్శకత్వ ప్రతిభ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ కాగా… అక్కడక్కడా కాస్త కన్ ఫ్యూజ్ చేసే ఎడిటింగ్.. మైనస్ అని చెప్పాలి. అయితే… పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ కథపై తెలుగు ప్రేక్షకులకు కాస్త గ్రిప్ తక్కువగా ఉండటంవల్ల.. మరింత శ్రద్ధగా చూస్తే తప్ప క్లారిటీ రాదు. ఈ సినిమాకి త‌మిళ ఆడియ‌న్స్ మాత్రం ఫిదా అవుతారు.