Narayana Rao Death: అత్యాచార నిందితుడు నారాయణరావు మృతి: పోలీసుల తీరుపై కుటుంబ సభ్యుల ఆందోళన

తునిలో బాలికపై అత్యాచారం కేసులో నిందితుడైన నారాయణరావు (62) మృతిపై అతని కుటుంబ సభ్యులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. పోలీసులు రిమాండ్ కోసం తరలిస్తున్న సమయంలో నారాయణరావు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నా, ఇది అనుమానాస్పద మృతిగా వారు ఆరోపిస్తున్నారు.

ఉమ్మడి కాకినాడ జిల్లా తొండంగి సమీపంలోని తోటలో 62 ఏళ్ల నారాయణరావు బాలికపై అత్యాచారం చేశాడన్న ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఈ ఘటనను సమీపంలో ఉన్న ఒక వ్యక్తి వీడియో తీసి, నారాయణరావును నిలదీసిన అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న బాలిక కుటుంబ సభ్యులు, స్థానికులు నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

బుధవారం రాత్రి నారాయణరావును తుని పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకు రిమాండ్‌ నిమిత్తం తరలిస్తుండగా, మార్గమధ్యలో టాయిలెట్‌కు వెళ్లాలని పోలీసులను కోరడంతో తుని శివారులోని చెరువు పక్కన వాహనాన్ని ఆపారు. ఆ సమయంలో నారాయణరావు అకస్మాత్తుగా చెరువులోకి దూకాడు. పోలీసులు గజ ఈతగాళ్లను పిలిపించి గాలింపు చర్యలు చేపట్టగా, రాత్రి కావడంతో మృతదేహం లభ్యం కాలేదు. గురువారం ఉదయం నారాయణరావు మృతదేహాన్ని వెలికి తీశారు.

కుటుంబ సభ్యుల ఆరోపణలు:

అయితే, నారాయణరావు మృతిపై ఆయన కుమారుడు సురేష్, కోడలు తీవ్ర అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు తమ ఇంటికి వచ్చి సంతకాలు సేకరించారని, ఆ తర్వాత కొద్దిసేపటికే నారాయణరావు చెరువులో దూకి చనిపోయారని చెప్పడం అనుమానాస్పదంగా ఉందని వారు ఆరోపిస్తున్నారు.

నారాయణరావును పోలీస్ స్టేషన్ నుంచి రిమాండ్‌ తరలించిన మార్గ మధ్యలోని సీసీ కెమెరాల ఫుటేజీని బయట పెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమకు న్యాయం జరగాలని కోరుతూ నారాయణరావు కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. దీనిపై పోలీసులు స్పష్టమైన వివరణ ఇవ్వాల్సి ఉంది.

2 Lakh Jobs Are False?, KS Prasad Analysis On Google Data Center In Vizag | Chandrababu