Madharasi Movie Review: ‘మదరాసి’ మూవీ రివ్యూ!

రచన – దర్శకత్వం: మురుగా దాస్
తారాగణం : శివ కార్తీకేయన్, రుక్మిణీ వసంత, విద్యుత్ జమ్వాల్, బిజూ మీనన్, విక్రాంత్, షబ్బీర్ కలరక్కల్
సంగీతం : అనిరుధ్ రవిచంద్రన్,
ఛాయాగ్రహణం : సుదీప్ ఎలమన్,
కూర్పు : శ్రీకర్ ప్రసాద్
బ్యానర్ : శ్రీ లక్ష్మీ మూవీస్
నిర్మాతలు : ఎం శ్రీలక్ష్మీ ప్రసాద్
విడుదల : సెప్టెంబర్ 5, 2025

ఇటీవల సల్మాన్ ఖాన్ తో భారీ ఫ్లాప్ ‘సికందర్’ ని అందించి భంగపడ్డ మురుగదాస్ వెంటనే శివ కార్తికేయన్ తో ‘మదరాసీ’ తీసి ముందుకొచ్చాడు. గత మూవీ ‘అమరన్ ‘ తో మంచి పేరుతెచ్చుకున్న శివ కార్తికేయన్ ఈసారి హెవీ యాక్షన్ థ్రిల్లర్ తో అభిమానుల్ని అలరించడానికి పానిండియా లెవెల్లో అడుగుపెట్టాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ తమిళ అభిమానుల్లో విపరీత క్రేజ్ సృష్టించింది. ట్రైలర్లూ వైరల్ అయ్యాయి. అయితే ’సికందర్’ మురుగ దాస్ ఏమైనా అప్డేట్ అయ్యాడా, లేక డిటోనా? ఈ విషయం తెలుసుకోవడానికి రివ్యూలో కెళ్దాం…

కథేమిటి?
రఘురాం (శివ కార్తికేయన్) చిన్నప్పట్నుంచే ఒక మానసిక వ్యాధితో బాధపడుతూ ఉంటాడు. ఆ వ్యాధి వాల్ల ఏది ధైర్యం, ఏది ఉన్మాదం విచక్షణ అతడికి వుండదు. ఇలాటి తను మాలతీ (రుక్మిణీ వసంత) అనే డెంటల్ డాక్టర్ ని తొలి చూపులోనే ప్రేమిస్తాడు. అతడి మానసిక వ్యాధి గురించీ, వాడుతున్న మందుల గురించీ తెలిసినా బేషరతుగా ప్రేమిస్తుందామె. అయితే ఒక వ్యక్తిగత కారణంతో అతడ్ని వదిలేసి వెళ్ళిపోతుంది. దీంతో ఆత్మహత్యా ప్రయత్నం చేస్తాడు. ఇలావుండగా, నార్త్ ఇండియానుంచి విరాట్ (విధ్యుత్ జమ్వాల్) అనే టెర్రరిస్టు తమిళనాడులో విధ్వంసం సృష్టించాలని ప్లాను వేస్తాడు. ఇతడికి పొలిటికల్ సిండికేట్ అండ వుంటుంది. ఇతడ్ని పట్టుకోవడానికి ఎన్ ఐ ఎ అధికారి ప్రేమ్ (బిజూ మీనన్) తన టీం తో వేటలో వుంటాడు. ఒక చోట విరాట్ తో సంఘర్షణలో మధ్యలో రఘురాం ఇరుక్కుని తీవ్రంగా గాయపడతాడు. విరాట్ తప్పించుకుని అక్రమ ఆయుధాలతో తమిళనాడులోకి జొరబడతాడు. ప్రేమ్ గాయపడ్డ రఘురాం ని హాస్పిటల్లో చేర్పిస్తాడు.

ఇప్పుడు ప్రేమ్ చేపట్టిన మిషన్ లోకి రఘురాం ఎలా ఎంటరయ్యాడు? తనకున్న మానసిక వ్యాధితో టెర్రరిస్టుల్ని ఎలా ఎదుర్కొన్నాడు? మాలతి అతడ్ని వదిలి వెళ్ళి పోయిన వ్యక్తిగత కారణమేమిటి? ఆమె అతడి కోసం తిరిగి వచ్చిందా? రఘురాం మానసిక సమస్య పరిష్కారమయిందా?… ఇదీ మిగతా కథ.

ఎవరెలా చేశారు?
శివ కార్తికేయన్ కిది చాలెంజింగ్ పాత్ర. నిజానికి దీన్ని షారుఖ్ ఖాన్ పోషించాలి. మిస్సయ్యింది. ధైర్యానికీ ఉన్మాదానికీ మధ్య వుండే హద్దు శివ కార్తికేయన్ ఆదుపాజ్ఞల్లో వుండదు. మామూలుగా ధైర్యంతో శత్రువుని ఎదుర్కొంటే దానికో లాజికల్ ఎండ్ వుంటుంది. ఉన్మాదానికి పాల్పడితే అంతూ పొంతూ వుండదు ఆ హింసకి. మానవ మృగమే. ఈ డబుల్ షేడ్ మానసిక సంఘర్షణ పోషించడానికి అతనెక్కువ కష్టపడలేదు. నటుడిగా ఆల్రెడీ ఆ టాలెంట్ వుంది అతడి దగ్గర. ఈ చాలెంజీని అవలీలగా జయించాడు. దీంతో పాటు రోమాంటిక్ ట్రాక్ లో కామెడీతో ఎంటర్ టైన్ చేయడం తో రిలీఫ్ పొందుతారు ప్రేక్షకులు. ఫస్టాఫ్ లో రోమాన్స్ వాళ్ళ వయొలెన్స్ అంతగా లేకపోయినా, సెకండాఫ్ లో హింస హద్దులు దాటింది ‘యానిమల్’ గుర్తొచ్చేలా. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ఇదే కాబట్టి ప్రేక్షకులు ఈ మూవీని హిట్ చేయాలి. అయితే మురుగ దాస్ చేతిలో ఈ క్యారక్టర్ ఉన్నంతగా కథ లేకుండా పోయింది..

డెంటల్ డాక్టర్ గా హీరోయిన్ రుక్మిణీ వసంత లవర్ పాత్రలో ఫర్వాలేదు గానీ, కథలో కలిసిపోతూ మెంటల్ డాక్టర్ గా ఉండాల్సింది డెంటల్ డాక్టర్ గా వుంది. లవర్ గా ప్రేమించిన వాడికోసం పడే తపన వరకూ ఆమె పాత్ర, నటన ఫర్వాలేదు. విలన్ గా బాలీవుడ్ యాక్షన్ స్టార్ విద్యుత్ జమ్వాల్ ది బలహీన పాత్ర. యాక్షన్ సీన్స్ కి మాత్రం పనికొచ్చే పాత్ర. ఎన్ ఐ ఏ అధికారిగా బిజూ మీనన్ మెప్పిస్తాడు.

సాంకేతికాలేమిటి?
నిర్మాణ విలువలు సహజంగానే రిచ్ గా వున్నాయి, కథా కథనాల విలువలు మాత్రం దీనికి దూరంగానే వున్నాయి. ఇప్పటి సినిమాలల్లో ఇంతే.అయితే ఎందుకనో అనిరుద్ రవిచందర్ కూడా ఫెయిలయ్యాడు. అతడు అందించిన బిజిఎం గానీ, సాంగ్ గానీ పూర్తిగా నిరాశ పరుస్తాయి. ఇంటర్వెల్ ముందు వరసగా మూడు లవ్ సాంగ్స్ వస్తాయి. ఈ మూడూ ఘోరంగా టార్చర్ పెడతాయి. బాగున్నదల్లా సుదీప్ కెమెరా వర్క్ మాత్రమే. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ ఎడతెగకుండా సాగుతున్న సెకండాఫ్ కి బాగా కత్తెర పెట్టాల్సింది.

కథా కథనాలు?
ఇక్కడే మరోసారి మురుగ దాస్ తన మూస ధోరణిని చూపించుకున్నాడు. ట్రెండీ గా ఉండాల్సిన సీన్లు పాత మూస ధోరణిలో వున్నాయంటే ఇంకా తను అప్డేట్ కావడం లేదు. లవ్- యాక్షన్- రివెంజ్- మెంటల్ ప్రాబ్లం ఇవన్నీ మేళవించి కథ చెబుతున్నప్పుడు రకరకాల దారులు పట్టాడు. చేతిలో వున్న హీరో క్యారక్టర్ కి తగ్గ కథా కథనాలు, కాన్ఫ్లిక్ట్, సస్పన్స్, థ్రిల్స్ వంటి బాక్సాఫీసు ఎలిమెంట్స్ ని పూర్తిగా విష్మరించాడు. దీని`వల్ల పాత్ర కుండల్సిన ఎమోషన్స్ కరువై ఉత్త ఉన్మాద ప్రదర్శనగా మిగిలింది.

ఫస్టాఫ్ లో ఇంటర్వెల్ ముందు మూడు లవ్ సాంగ్స్ రావడం దారుణ ప్లానింగ్. ఇంతకీ ఆ ప్రేమ కథలో బలముందా అంటే అదీ లేదు. పైగా సెకండాఫ్ లో సాగదీసిన ప్రేమ సీన్లు. అసలు ప్రధాన మైన యాక్షన్ కథ ఎటు పోతోందో అర్ధం గావడం లేదన్నట్టు చేతులెత్తేసిన వైనం కనిపిస్తుంది. మురుగ దాస్ కిది మరో భంగపాటు. శివ కార్తికేయన్ నటుడిగా ఎదగడానికి మాత్రం పనికొచ్చిందీ మూవీ!

రేటింగ్: 2.5/5

Madharasi Movie Review | AR Murugadoss Strong Counter To Pawan Kalyan | Bharadwaj | Telugu Rajyam