సూపర్ స్టార్ కృష్ణ అస్తమయం

సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుఝామున 4 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆదివారం అర్దరాత్రి గుండెపోటు, శ్వాస ఇబ్బందులతో హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరిన కృష్ణ కన్నుమూశారు. శరీరంలోని ప్రధానమైన అవయవాలేవీ పనిచేయలేదు. వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ.. ఆయన కోలుకోలేదు. వైద్యానికి శరీరం సరిగా స్పందించలేదు. కృష్ణ ఆరోగ్యం విషమంగానే ఉందని నిన్న మధ్యాహ్నం వరకు డాక్టర్లు చెప్పారు. 48 గంటలు గడిస్తే గానీ.. ఏమీ చెప్పలేదని తెలిపారు. కృష్ణ కోలుకోవాలని అభిమానులంతా పూజలు చేశారు. కానీ వైద్యులు ప్రయత్నాలు గానీ.. అభిమానుల పూజలు గానీ ఫలించలేదు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఎనభై ఏళ్ల వయస్సులో తుదిశ్వాస విడిచారు.

భార్య ఇందిరా దేవి, పెద్దకుమారుడు రమేష్ బాబు మరణాల తర్వాత కృంగిపోయిన కృష్ణ అనారోగ్యం పాలయ్యారు. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్యం క్షీణించింది. కృష్ణ మరణవార్తతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. సినీ పెద్దలు దిగ్భ్రాంతికి గురయ్యారు. ధైర్యంగా ఉండాలంటూ కుమారుడుకు మహేష్ బాబుకు ప్రగాడ సానుభూతి తెలుపుతున్నారు. అభిమానులు కూడా కన్నీరు పెట్టుకుంటున్నారు. కృష్ణ 1943, మే 31వ తేదీన గుంటూరు జిల్లాలోని తెనాలి మండలం బుర్రిపాలెంలో జన్మించారు.. 1960లో ఏలూరు సి.ఆర్‌.రెడ్డి. కాలేజీలో బిఎస్సీ పూర్తి చేశారు. ఆయన నటించిన తొలి చిత్రం తేనె మనసులు.  ఇప్పటి వరకు 340కి పైగా చిత్రాల్లో నటించారు. గూఢచారి 116తో ఇండస్ట్రీలో ఆయనకు గుర్తింపు లభించింది.

తెలుగు చిత్ర పరిశ్రమలో నటశేఖరుడు ట్రెండ్‌సెట్టర్‌ అనిపించుకున్న సందర్భాలు కోకొల్లలు. 1964-95 మధ్య ఏడాదికి 10 సినిమాల చొప్పు.. 300 సినిమాలు చేశారు. సినిమాల నటించడంతో పాటు డైరెక్టర్‌, ప్రొడ్యూసర్‌గానూ పనిచేశారు. 18 సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఆయన నటించిన తొలి చిత్రం ‘తేనెమనసులు’ ఫస్ట్‌ ఈస్ట్‌మన్‌ కలర్‌ సోషల్‌ చిత్రం. తొలి జేమ్స్‌బాండ్‌ చిత్రం ‘గూఢచారి 116’, తొలి కౌబారు చిత్రం ‘మోసగాళ్ళకు మోసగాడు’, తొలి తెలుగు సినిమా స్కోప్‌ ‘అల్లూరి సీతారామరాజు’, తొలి తెలుగు 70ఎంఎం సినిమా ‘సింహాసనం’, తొలి ఓ.ఆర్‌.డబ్ల్యు రంగుల చిత్రం ‘గూడుపుఠాణి’, తొలి ప్యూజీ రంగుల చిత్రం ‘భలే దొంగలు’, తొలి సినిమా స్కోప్‌ టెక్నో విజన్‌ చిత్రం ‘దొంగల దోపిడి’, తొలిసారి తెలుగు పాటకు జాతీయ అవార్డు అందుకున్న చిత్రం ‘అల్లూరి సీతారామరాజు’ (తెలుగు వీర లేవరా..)..

ఇలా ఎన్నో విభిన్న చిత్రాలతో ప్రయోగాల హీరోగా, సాహసాల నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఘట్టమనేని ఫ్యామిలీలో ఈ ఏడాది మూడో విషాదం. జనవరిలో కృష్ణ కుమారుడు, మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు మరణించారు. సెప్టెంబరులో కృష్ణ సతీమణి ఇందిరా, మహేష్ బాబు తల్లి కన్నుమూశారు. ఇప్పుడు కృష్ణ కూడా మరణించారు. వరుస విషాదాలతో సూపర్ మహేష్ బాబు దు:ఖ సాగరంలో మునిగిపోయారు. ఆయనకు సినీ ప్రముఖలంతా ప్రగాడ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.