Kotha Lokah Movie Review: ‘కొత్త లోక’ మూవీ రివ్యూ!

రచన- దర్శకత్వం : డొమినిక్ అరుణ్
తారాగణం: కళ్యాణీ ప్రియదర్శన్, నెస్లేన్, శాండీ మాస్టర్, అరుణ్ కురియన్, విజయ రాఘవన్, టొవినో థామస్, దుల్కర్ సల్మాన్, సౌబిన్ షాహిర్ తదితరులు
సంగీతం : జేక్స్ బిజోయ్, చాయాగ్రహణం : నిమిష్ రవి, కూర్పు : చామన్ ఛాకో
బ్యానర్: వేఫారర్ ఫిల్మ్స్, నిర్మాత: దుల్కర్ సల్మాన్
విడుదల : ఆగస్టు 29, 2025

మలయాళం సినిమా ప్రయోగాలతో ముందు కెళ్తోంది. దేశంలోనే మొదటి సారిగా ఫిమేల్ సూపర్ మాన్ మూవీకి శ్రీకారం చుట్టింది. పానిండియా మూవీస్ అంటూ సూపర్ స్టార్స్ తో ఎన్నో యాక్షన్ సినిమాలు వస్తున్నాయి. కానీ ఎవరూ ఒక హీరోయిన్ తో అలాటి ధైర్యం చేయలేదు. మలయాళంలో అదీ మరీ పాపులర్ హీరోయిన్ కాకపోయినా ధైర్యం చేసి ‘’కొత్త లోక- చంద్ర -మొదటి చాప్టర్’ అనే యాక్షన్ ఫాంటసీ తీశారు, దర్శకుడు డొమినిక్ అరుణ్ ఈ సాహస ప్రయోగం చేశాడు. ప్రముఖ మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ కుమార్తె కళ్యాణీ ప్రియదర్శన్ హీరోయిన్ గా దీనిని నిర్మించడానికి మలయాళం స్టార్ దుల్కర్ సల్మాన్ పూనుకున్నాడు. నిన్న మలయాళం లో విడుదలైన ఈ మూవీ నేడు తెలుగులో కూడా రిలీజైంది. దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని అలరిస్తున్న ఈ ఈ ఫాంటసీ అడ్వెంచర్ లో వున్నదేమిటి, ఇది తెలుగు ప్రేక్షులకి నచ్చుతుందా పరిశీలిద్దాం….

కథేమిటి
చంద్ర (కళ్యాణీ ప్రియదర్శన్) అనే యువతి బెంగళూరు వచ్చి మకాం పెడుతుంది. ఆమెకు వెలుగు అంటే పడదు. నైట్ షిఫ్ట్ లోనే జాబ్ చేస్తూంటుంది. ఆమె మకాం ఎదుట సన్నీ (నెస్లేన్) నివాసముంటాడు. అతడి కిద్దరు ఫ్రెండ్స్ వుంటారు. వాళ్లకి చంద్ర మిస్టీరియస్ గా కనిపించడంతో ఆమెని కనిపెడుతూంటారు. నగరంలో ఓ మఫియని ఆమె టార్గెట్ చేసి వుంటుంది. ఈ మాఫియాతో బాటు పోలీస్ ఇన్స్ పెక్టర్ నచియప్ప (శాండీ మాస్టర్) ఆమెని టార్గెట్ చేస్తారు. ఆమెకు మత్తు మందిచ్చి కిడ్నాప్ చేయడంతో సంచలనం రేగుతుంది.

ఈ చంద్ర ఎవరు? ఈమె నీలి అనే యక్షిణిగా ఎందుకు మారింది? అవయవాల మాఫియాని ఎందుకు టార్గెట్ చేసింది? మాఫియా ఆమెని ఎందుకు కిడ్నాప్ చేసింది? అప్పుడు సన్నీ అతడి ఫ్రెండ్స్ ఏం చేశారు? తర్వాత చేతన్ (టోవినో థామస్) అనే అతను చంద్రతో చేసిన పనేమిటి? ఈ పరిస్థితుల్లో వార్ హీరో (దుల్కర్ సల్మాన్) ఎంటరై తిప్పిన మలుపు ఎటు దారి తీసింది? ఇవన్నీ ఎదుర్కొని చంద్ర తన లక్ష్యాన్ని సాధించుకుందా? …అన్నది మిగతా ఈ ఫాంటసీ కథ.

ఎవరెలా చేశారు?
ఫిమేల్ సూపర్ హీరో లేదా సూపర్ హ్యూమన్ పాత్ర ఈ సినిమాకి హైలైట్. హీరోయిన్ తో సూపర్ హ్యూమన్ సినిమా మన దేశంలో ఇంతవరకూ రాలేదు. ఇటీవల మలయాళం లో ‘మిన్నాల్ మురళి’ అనే హిట్టయిన సూపర్ హీరో సినిమా స్మాల్ బడ్జెట్ లో తీశారు. ఇప్పుడు కళ్యాణీ ప్రియదర్శన్ తో సూపర్ హ్యూమన్ యాక్షన్ ఫాంటసీని ప్రేక్షకుల ముందుంచారు. దీనికోసం కృత్రిమ పాత్రని సృష్టించలేదు. కేరళ జానపద కథల్లోంచి ఉట్టిపడే పాత్రని తీసుకున్నాడు దర్శకుడు. కల్లియన్ కట్టు నీలి అనే కేరళ జానపద కథల్లో ప్రసిద్ధి చెందిన రక్తం తాగే పిశాచి, గిరిజన యక్షిణి పాత్రతో ఈ ఫాంటసీని క్రియేట్ చేశాడు. ఈ పాత్రలో కళ్యాణీ ప్రియదర్శన్ ప్రకృతి శక్తులు పిలిచిన కారణంగా బెంగళూరులో మిషన్ చేపట్టి దుష్ట శిక్షణ చేస్తుంది.తను రక్తం తాగే పిశాచమైనప్పటికీ, స్వావలంబన కోసం, సమాజ నిబంధనలకి వ్యతిరేకంగా నిలిచే స్త్రీల గురించి తిరుగుబాటు చేసే ఆవేశంతో , తన శక్తిమేరకు కథని పరుగులు తీయించింది.

ఈ జానపద గిరిజన యక్షిణి నీలిగా ఆధునిక చంద్ర పాత్రలోకి ఒక మిషన్ తో ఎంటరై ఆమె యాక్షన్ లోకి దిగే దృశ్యాలు బహుశా ఏ హాలీవుడ్ సినిమాలకీ తీసిపోవు. సాహసక్రుత్యలతో బాటు భావోద్వేగ ప్రదర్శనలో కూడా బలమైన నటనని కనబర్చింది. అయితే కొన్ని బరువైన సీన్లలో బలహీనంగానూ కనిపించక పోలేదు. మొత్తానికి వన్ వుమన్ షోగా విజువల్ అప్పీల్ తో యూత్ ని థ్రిల్ చేసే పెర్ఫార్మెన్స్ ఇచ్చింది.

ఇక హీరో నస్లెన్ కేవలం సహాయ పాత్రగా మిగిలిపోయి నవ్వించడానికి పనికొచ్చాడు. ఇద్దరు ఫ్రెండ్స్ తో కామిక్ రిలీఫ్ కోసం అతడి పాత్రని సృష్టించినట్టున్నాడు దర్శకడు. ఇది వర్కుటయ్యింది. యాత్ర పాత్రల్లో అందరూ బాగా చేశారు. గెస్ట్ పాత్రల్లో దుల్కర్ సల్మాన్, టోవినో థామస్, సాబిన్ సాహిర్ ముగ్గురూ సంక్షిప్త పాత్రల్లో ర్న్తర్ తిన్ చేశారు.

సాంతికాలేమిటి?
సాంకేతికంగా చాలా స్ట్రాంగ్ మూవీ ఇది. మామూలుగా సూపర్ హీరో సినిమాలు తీయాలంటే చాల బడ్జెట్ కావాలి. లేకపోతే సాంకేతికంగా తేలిపోతాయి. దర్శకుడు డొమినిక్ అరుణ్ సుమారు 30 కోట్ల బడ్జెట్ తోనే బిగ్ మూవీ ఫలితాలు సాధించడం ఆశ్చర్య పరచే విషయం. కాస్ట్యూమ్స్ దగ్గర్నుంచి సెట్టింగ్స్, అట్మాస్ఫియర్ కి వాడిన కలర్ టోన్, యాక్షన్ దృశ్యాలూ ప్రతీదీ వంక పెట్టలేని విధంగా హై క్వాలిటీతో క్రియేట్ చేశాడు. ఇది ఇతర దర్శకులకి గైడ్ లా వుంటుంది. జేక్స్ బిజోయ్ నేపథ్య స్కోరు హైలైట్ గా నిలిచింది. ఇంటర్వెల్ లో యాక్షన్ సీను కిచ్చిన స్కోరు ఉర్రూతలూగిస్తుంది. యానిక్ బెన్ సమకూర్చిన యాక్షన్ దృశ్యాలు థ్రిల్ చేస్తాయి. నిమిష్ రవి చాయాగ్రహణం, థామస్ చాకో ఎడిటింగ్, ఇతర ప్రొడక్షన్ విలువలు టాప్ క్లాస్ గా వున్నాయి.

కథా కథనాలు?

గోథిక్ (రక్త పిశాచాల)బ్యాక్ డ్రాప్ తో ఈ ఫాంటసీ కథ హీరోయిన్ క్యారక్టర్ ని నిలబెట్టే విధంగా వుంది. అయితే దీనికోసం సృష్టించిన కథా ప్రపంచం అద్భుతంగా వున్నా, ఫస్టాఫ్లో హీరోయిన్ పాత్ర పరిచయ సన్నివేశాలు సుదీర్ఘంగా సాగడం, సకాలంలో కథ మొదలుపెట్టక పోవడం బలహీనతలే. ఇంటర్వెల్ సీనుతో కిక్ వస్తుంది. మళ్ళీ వెంటనే సెకండాఫ్ కాసేపు డ్రాప్ అవుతుంది. అయితే కథా పరంగా డ్రాప్ అయిన భాగాన్ని సంగీత దర్శకుడు మ్యూజిక్ తో ఎక్స్ ట్రా పంచ్ ఇచ్చి నిలబెట్టాడు.

మానవ అవయవాల ట్రాఫికింగ్ మాఫియా చుట్టూ సాగే ఈ కథ పాతదే. అయితే దేనికి జానపద కథలోని పాత్రతో, డ్రాక్యులా కథల గోథిక్ జానర్లో చెప్పడం వల్ల కొత్తదనం వచ్చింది. అయితే కథ నడుపుతున్నప్పుడు కొన్ని అస్పష్టతలు, కన్ఫ్యూజన్ ఎదుర్కొక తప్పదు. దీన్ని ఫ్రాంచైజీ మూవీగా ప్రారంభించారు కాబట్టి తర్వాతి చాప్టర్ లో ఈ లోపాలకి సమాధానం దొరుకుతుందేమో. కథ తక్కువే, యాక్షన్ ఎక్కువ. ఒక కొత్త అనుభూతితో కాలక్షేపానికి తెలుగు ప్రేక్షకులు నిరభ్యంతరంగా చూడొచ్చు.

Journalist Bharadwaj EXPOSED Chandrababu Vennupotu Real Story | NTR | Balakrishna | Harikrishna | TR