జపాన్ కు ఏమయింది? చావులెక్కువ, పుట్టుకలు తక్కువ…

చావు పుట్టుకల వ్యత్యాసం మధ్య జపాన్ కొట్టుమిట్టాడుతూ ఉంది. జనాభా దారం తెగిన గాలిపటంలాగా పడిపోతావుంది.చావులెక్కువవుతున్నాయి, పుట్టే వాళ్ల సంఖ్య పడిపోతావుంది. దేశం నిండా వయోవృద్ధులే.

జపాన్ దేశంలో 2018 లోె  పుట్టిన పిల్లలు కేవలం 9,21,000 మాత్రమే. అంటే మిలియన్ జననాలు కూడా లేవన్నమాట. కాని  1.37  మిలియన్ల మంది చనిపోయారు. 2017 కంటే 2018లో  25000 మంది తక్కువ పుట్టారు. ఇది ప్రభుత్వంలోని పెద్దలను ఆందోళనకు గురిచేస్తూ ఉంది. పిల్లలను కనమంటే ఎవరూ ఆసక్తి చూపడం లేదు. (ఆ మధ్య  జపాన్ వెళ్లి నపుడు ఇదే ఆందోళనతో  ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తిరిగొచ్చి చాలా రోజులు ఎక్కడికి పోయినా జపాన్ జనాభా  అగచాట్ల గురించి చెబుతూ వచ్చారు. అంతేకాద, ఆ పరిస్థితి ఇక్కడ దాపురించకుండా ఉండేందుకు ఎక్కువ మంది పిల్లలను కనాలని కూడా సలహా ఇచ్చారు. ఇది వేరే విషయమనుకోండి.)

జపాన్ లో జనన మరణాలను రికార్డు చేయడం 1899 లో మొదలయింది.  అయితే అప్పటి నుంచి బర్త్ రేట్  (ప్రతి వేయి జనాభాలో జననాల సంఖ్య) 2018లో పడిపోయినంతగా ఎపుడూ పడిపోలేదట. అంతేకాదు, ఇలా ఏయేటికాయేడు జపాన్ జనాభా కోలుకోలేకుండా పడిపోవడం వరుసగా ఇది ఎనిమిదో సంవత్సరం. పుట్టే వాళ్లసంఖ్య మిలియన్ కంటే కిందికి పడిపోవడం ఇది మూడో సారి. ఇలా అయితే, జపాన్ అంతాచూస్తుండగానే  ఖాళీ అయిపోతుందేమో. చావులు, పుట్టుకలు కూడికలు తీసివేతలు చేశాక, జపాన్ జనాబా ఈ ఏడాది  4, 48,000 తగ్గిపోయింది. 

జనాభా స్థిరంగా ఉండాలంటే ప్రతి మహిళ సగటున 2.7 మంది పిల్లల్ని కనాలి  అక్కడ.  ఇపుడు జననాల రేటు ( అంటే జీవిత కాలంలో ఒక మహిళకు పుట్టే పిల్లలు ) 1.43 మాత్రమే. 2026 నాటికి  దీనిని 1.80 తీసుకు రావాలని జపాన్ ప్రభుత్వం తల కిందులవుతూ ఉంది.

దీనితో జపాన్ లో వృద్ధుల సంఖ్య పెరుగిపోతూ ఉంది.  65 సంవత్సరాలు పైబడిన వయో వృద్ధుల సంఖ్యలో ప్రపంచంలో జపాన్ నెంబర్ వన్. ఆతర్వాతి స్థానాలు ఇటలీ, పోర్చుగల్, జర్మనలవి. జపాన్ శతాధిక వయోవృద్ధులు 69,785 మంది ఉన్నారు .వీరిలో 88 శాతం మంది మహిళలే.