రాయలసీమకు అన్యాయం: కన్నతండ్రే కాటేస్తే ఆ బిడ్డ ఎవరికి చెప్పు కోవాలి?

 
 
(వి శంకరయ్య) 
 
టిటిడి ఉద్యోగాల భర్తీలో జోనల్ సిస్టమ్ రద్దు.సీమ నేతలే సీమకు శత్రువులా? 
 
దేశంలో అన్ని రాష్ట్రాలతో సమానంగా ఎపి అభివృద్ధి చెందే వరకు కేంద్ర ప్రభుత్వం ఎపికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నారు. ధర్మ పోరాట దీక్షలు పేర పెద్ద ఉద్యమమే సాగిస్తున్నారు.ఇందుకు ఎవరికీ అభ్యంతరం వుండ నక్కరలేదు. కాని రాష్ట్రంలో అభివృద్ధి చెందిన జిల్లాలతో సమానంగా వెనుకబడిన రాయలసీమ జిల్లాలు అభివృద్ధి చేందేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధులు ఏమిటి? మాటలు తప్ప చేతలు శూన్యం. 2014 ఎన్నికల తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు పలు దఫాలు జిల్లా కలెక్టర్ ల సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలలో ప్రతి దఫా జిల్లాలకు గ్రేడింగ్ ఇస్తున్నారు. తొలి దశలో ప్రకటించిన విధంగానే ఇప్పటికీ వెనుక బడిన జిల్లాలు వెనుక బడే వున్నాయి.
 
సీమలో యువతకు ఉపాధి పనులు లేకుండా వలసలు పోవలసి వస్తున్నది. ఈ నేపథ్యంలో 
అమరావతి రాజధాని అద్భుతంగా నిర్మించు తున్నందున ఫ్రీజోన్ చేయాలని తమకు అందులో ఉపాథి కల్పించాలని వెనుక బడిన రాయలసీమ జిల్లాల యువకులు కోరుతున్నారు. ఈ మొర ఆలకించే వారులేరు.
 
పోనీ అంత వరకు అయితే ఫర్వాలేదు. కాని వెనుక బడిన రాయల సీమలో వున్న ఉద్యోగాలకు ఎసరు పెట్టారు. 
 
రాష్ట్ర పతి ఆదేశాల మేరకు అమలు జరుగుతున్న జోనల్ సిస్టమ్ కు ఎసరు పెట్టి  టిటిడి ని ఫ్రీజోన్ చేశారు. ఈ దుశ్చర్యకుతలపడింది ఎవరో కాదు. వెనకబడిన ఈ రాయల సీమ జిల్లాలో రాజకీయంగా ఓనమాలు దిద్దు కొని ప్రస్తుతం ముఖ్యమంత్రిగా వున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ జీవో జారీ చేసింది. . అందుకే కన్న తండ్రే కాటేస్తే ఎవరికి చెప్పు కోవాలని వెక్కి వెక్కి ఏడవాలసి వస్తోంది.ఈ రోదన ఇంతటితో నే ఆగి పోదు. పిల్లిని కూడా గదిలో పెట్టి హింసించితే ఏంచేస్తుందో అందరికీ తెలుసు. అందుకే ఆనాటి నుండి ఇప్పటి వరకు సీమ నేతలే సీమకు శత్రువులు అనే నానుడి ఎర్పడింది
 
రాయలసీమ వాసులు రాజధాని లో ఉపాధి పొందేందుకు అమరావతి ఫ్రీజోన్ గాలేదు. కాని రాయలసీమ వున్న ఒకే ఒక ఉపాధి కల్పన కేంద్రం టిటిడి మాత్రం ఫ్రీజోన్ చేయ బడింది.
 
వెనుక బడిన సీమ జిల్లాలకు ఇంత అన్యాయం జరుగుతున్నా సీమ కు చెందిన ఏ ఒక్క రాజకీయ పార్టీ నేత తుదకు ప్రతి పక్ష నేతలు ఈ అంశంపై నోరు విప్ప లేదంటే సీమ వాసులు చేసుకున్న దురదృష్టమా? లేక సీమ కు చెందిన రాజకీయ పార్టీల నేతలను అధికార పెనుభూతం ఆవరించి అమ్ముడు పోయారా?
ఇప్పుడే కాదు. గతంలో కూడా ఎక్కువ కాలం సీమ నుండి వెళ్లి ముఖ్యమంత్రి పదవులు పొందిన వారే సీమకు తీరని ద్రోహం చేశారు.
 
1960 శ్రీ శైలం ప్రాజెక్టు నిర్మాణం సమయంలో సీమ నుండి వెళ్లిన నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగావుండి ఒక చుక్క నీరు గొంతెండి పోతున్న రాయలసీమ కేటాయింపులు చేయించ లేదు. పైగా కేవలం జల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుగా నిర్మాణం చేయడంతో సీమకు శ్రీ శైలం జలాశయం నీటిలో చట్ట బద్ద మైన హక్కులు లేకుండా పోయాయి.అంతకు ముందు కృష్ణ పెన్నార్ ప్రాజెక్టు గాలికిపోయింది. కనీసం శ్రీ శైలం కాకుండా సిద్దేశ్వరం వద్ద ప్రాజెక్టు నిర్మాణం చేసివున్నా తుదకు సిద్దేశ్వరం వద్ద అలుగు నిర్మాణం జరిగి వుండినా సీమ ఎడారి లాగా వుండేది కాదు. ప్రతి దశలోనూ అన్యాయం జరిగింది. ఇప్పుడు సీమ యువత నోటి కాడ కూడును దుమ్ము లో కలిపేస్తున్నారు. 
 
అంతేకాదు. 1988 ఎన్టీఆర్ ప్రతి పాదించిన ప్రాజెక్టులను తన 9 ఏళ్ల కాలంలో దస్త్రాలకే ముఖ్యమంత్రిగా చంద్రబాబు పరిమితం చేసి నందున పుణ్య కాలం గడచి పోయింది. ఫలితంగా బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ వద్ద నీటి కేటాయింపులు లేకుండా పోయాయి. 
 
తుదకు 2014 లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత శ్రీ బాగ్ ఒడంబడికను దుమ్ములో కలపడం అటుంచి రాజధానిలో సీమ యువతకు ఉపాధి కల్పన లేకుండా చేస్తూ అదే సమయంలో సీమ యువత కు జోనల్ సిస్టమ్ ప్రకారం టిటిడి లో లభ్యమయ్యే ఉద్యోగాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎసరు పెట్టడమంటే ఆదినుండి ఇప్పటి వరకు సీమ నేతలే శత్రువులు గా మిగులు తున్నారు.

 

(వి శంకరయ్య, సీనియర్ జర్నలిస్టు 9848394013)