చరణ్‌తో మిస్సయ్యింది.! మరో మెగా హీరోతో వర్కవుట్ అవుతోంది.!

టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో ఓ సినిమా తెరకెక్కించాల్సి వున్న సంగతి తెలిసిందే. అయితే, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్టు అటకెక్కింది.

చరణ్‌తో సినిమా మిస్ అవడంతో గౌతమ్ తిన్ననూరి ఒకింత గుస్సా అయ్యాడట. ఇంతలోనే విజయ్ దేవరకొండతో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో దిల్ రాజు ఓ ప్రాజెక్ట్ సెట్ చేశాడన్న ప్రచారం తెరపైకొచ్చింది. ఇదైనా కార్యరూపం దాల్చుతుందా.? లేదా.? అన్న సస్పెన్స్ కొనసాగుతోంది.

కాగా, గౌతమ్ తిన్ననూరికి గతంలో హామీ ఇచ్చిన రామ్ చరణ్, ఆ హామీకి కట్టుబడి అతనితో సినిమా చేయడానికే మొగ్గు చూపుతున్నాడట. అయితే, హీరోగా కాదు.. నిర్మాతగానట.

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మాతగా ఓ సినిమా రూపొందనున్నట్లు తెలుస్తోంది. ‘ఉప్పెన’ ఫేం వైష్ణవ్ తేజ్‌తో ఇటీవల గౌతమ్ తిన్ననూరి భేటీ అయ్యాడనీ, ఈ భేటీలో చరణ్ కూడా పాల్గొన్నాడనీ సమాచారం. ఈ వ్యవహారానికి సంబంధించి ఇంకాస్త స్పష్టత రావాల్సి వుంది.