Custody Movie Review : ‘కస్టడీ’ తెలుగు మూవీ రివ్యూ & రేటింగ్

తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన తాజా చిత్రం ‘కస్టడీ’. ఈ చిత్రం కోసం అక్కినేని అభిమానులతో పాటు, యాక్షన్, థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూశారు. ఇటీవ‌ల అక్కినేని ఫ్యామిలీ హీరోల సినిమాలు వ‌రుస ప‌రాజయాలు సాధించాయి. నాగ చైతన్య ఫిల్మ్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్నా.. ఎప్పటికప్పుడు కష్టపడుతూ.. తనలోని టాలెంట్ ను బయటకు తీసుకువస్తూ.. తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపుతో ముందుకు సాగిపోతున్నాడు. ఆ మధ్య వరుసగా విజయాలను అందుకున్న అతడు.. ఇప్పుడు మాత్రం ఇబ్బంది పడుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని అక్కినేని ఫ్యాన్స్‌ని ఉత్సాహ‌ప‌రిచేందుకు నాగ చైత‌న్య ‘క‌స్ట‌డీ’ అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన ఈ చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఇందులో కృతి శెట్టి హీరోయిన్‌గా నటించగా.. అరవింద స్వామి, శరత్ కుమార్, ప్రియమణి కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిచారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక‌కాలంలో రూపొందిన ‘క‌స్ట‌డీ’ చిత్రం ఎన్నో అంచనాల మధ్య ఈ శుక్ర‌వారం (12 మే 2023) ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ‘క‌స్ట‌డీ’తోనే నాగ‌చైత‌న్య హీరోగా త‌మిళంలోకి ఎంట్రీ ఇచ్చాడు. మరి రెండు భాష‌ల్లో అత‌డికి విజ‌యం ద‌క్కిందా? ఇంతకీ ‘క‌స్ట‌డీ’ చిత్రం క‌థ ఏంటి? వెంక‌ట్ ప్ర‌భు త‌న‌దైన మ్యాజిక్ స్క్రీన్‌ప్లేతో ప్రేక్ష‌కుల్ని మెప్పించాడా? ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుందో అన్న‌ది తెలియాలంటే క‌థ‌లోకి వెళ్లాల్సిందే…

క‌థ: ఎంతో నిజాయితీ గల కానిస్టేబుల్ శివ (నాగ చైతన్య ). ఒక సిన్సియర్ కానిస్టేబుల్ అతడు. డ్యూటీ అంటే ప్రాణం పెడతాడు. డ్యూటీ కోసం ఎంత‌టివారినైనా ఎదురిస్తాడు. తను ప్రేమించిన రేవతి (కృతి శెట్టి)ని వివాహం చేసుకొని జీవితంలో హాయిగా.. సంతోషంగా గడపాలని అనుకుంటాడు. రేవతి కూడా శివని ప్రాణంగా ప్రేమిస్తుంది. అయితే సఖినేటి పల్లి పోలీస్ స్టేషన్ లో రాజన్న (అరవింద్ స్వామి)ని అరెస్ట్ చేసి ఉంచుతారు, అప్పుడు డ్యూటీ లో ఉన్న శివకి రాజన్నని ఎవరో చంపేస్తున్నారు అనే విష‌యం తెలుస్తుంది. మ‌రో వైపు వైపుకులాలు వేరు కావడంతో రేవతి ఇంట్లో శివతో పెళ్లికి ఒప్పుకోరు. రేవ‌తికి వేరే పెళ్లి నిశ్చ‌యించార‌ని తెలుస్తుంది. దీంతో శివ ఎలాగైనా న్యాయం గెలవాలని చెప్పి రాజన్నని కోర్ట్ లో అప్పగించేందుకు అదే రాత్రి, ఇటు రేవతితో పాటు రాజన్నని కూడా తీసుకెళ్తాడు. దీంతో శివ రాజన్నల‌ కోసం పోలీసుల వెతుకులాట జ‌రుగుతుంది. ఈ క్రమంలో జరిగిన నాటకీయ పరిణామాల నేపథ్యంలో రాజన్న (అరవింద్ స్వామి), సీబీఐ ఆఫీసర్ జార్జ్ (సంపత్ రాజ్)ను అరెస్ట్ చేసి స్టేషనుకు తీసుకొస్తాడు శివ. మరోవైపు రాజును చంపాడనికి పోలీస్ కమీషనర్ నటరాజన్ (శరత్ కుమార్) సహా ఏకంగా పోలీస్ ఫోర్స్, రౌడీలు రంగంలోకి దిగుతారు. అసలు ఈ రాజు ఎవరు?, రాజును ఎలాగైనా సిబిఐ కి అప్పగించాలని శివ ఎందుకు బలంగా ప్రయత్నం చేస్తాడు ?, ఈ ప్రయాణంలో శివకి ఎదురైన సవాళ్లు ఏమిటి? రాజ‌న్నని చంపాల‌నుకున్న‌ది ఎవ‌రు? ఎందుకు చంపాలనుకుంటున్నారు? శివ పోరాటం ఫ‌లిస్తుందా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ : ‘కస్టడీ’ సినిమా ఒక సిన్సియర్ పోలీస్ కానిస్టేబుల్ గురించి సాగే కథతో తెరకెక్కింది. తన ఉద్యోగ బాధ్యతలు నిర్వహించే క్రమంలో అతడికి ఎదురైన సమస్యలు ఏంటి? ప్రత్యర్ధితో అతడు ఎలా పోరాటం చేశాడు? ఈ క్రమంలోనే తన ప్రేమకు ఎదురైన ఆటంకాలు ఏంటి? అనే అంశాలతో సాగింది. అయితే.. సినిమా ఫస్టాఫ్ డల్‌గానే ఉంది. సినిమా చాలా నెమ్మదిగా, ఫ్లాట్‌గానే ప్రారంభం అవుతుంది. అయితే, ప్రీ ఇంటర్వెల్ ముందు మాత్రమే కొంత ఆసక్తికరంగా సాగుతుంది. పాటలు నిరాశ పరిచాయి. ఫ్లాష్‌బ్యాక్ అస్సలు కనెక్ట్ కాదు. యాక్షన్ సీక్వెన్స్‌లు రిపీట్‌గా ఉన్నాయి. కస్టడీ లో మెయిన్ కంటెంట్ అండ్ పాయింట్ బాగున్నా.. ట్రీట్మెంట్ విషయంలో కొన్ని చోట్ల స్లో అనిపించింది. దీనికితోడు దర్శకుడు వెంకట్ ప్రభు సెకండ్ హాఫ్ కథనం విషయంలో రాజీపడకుండా ఉండి ఉంటే బాగుండేది. ముఖ్యంగా సెకండాఫ్ లో సినిమా జరుగుతున్నంతసేపు తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠను ఇంకా పెంచగలిగే స్కోప్ ఉన్నపటికీ దర్శకుడు వెంకట్ ప్రభు ఆ అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోలేదు. అలాగే సెకండ్ హాఫ్ ను కాస్త ఎమోషనల్ గా నడుపుదామని మంచి ప్రయత్నం చేశారు గాని, కొన్ని చోట్ల అది స్క్రీన్ మీద ఎఫెక్టివ్ గా వర్కౌట్ కాలేదు.

అలాగే చాలా చోట్ల లాజిక్స్ కూడా లేకుండా ప్లేను డ్రైవ్ చేశారు. దీనికి తోడు కథ కూడా సింపుల్ గా ఉండటం, చివరకు ఏం జరుగుతుంది అనేది ప్రేక్షకులకు ముందే అర్థం అయిపోతుండటంతో సినిమాపై ఆసక్తి కలగదు. మంచి పాయింట్ ను తీసుకున్నా.. ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకోవడంలో, దాన్ని ఇంకా ఉత్కంఠభరితంగా తెరకెక్కించడంలో వెంకట్ ప్రభు పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదు. కస్టడీ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో.. మెయిన్ పాయింట్ తో పాటు కొన్ని యాక్షన్ అండ్ కామెడీ సీన్స్ బాగున్నాయి. ఐతే, కథ సింపుల్ గా ఉండటం, స్క్రీన్ ప్లే కూడా స్లోగా సాగడం, అలాగే లాజిక్ లెస్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. అయితే, సినిమాలో చైతన్య యాక్టింగ్ తో పాటు మిగిలిన స్టార్ కాస్టింగ్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. ఓవరాల్ గా ఈ చిత్రంలో కొన్ని ఎలిమెంట్స్ కనెక్ట్ అయినా, సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ క‌థాంశంతో సాగే క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీగా క‌స్ట‌డీని తెర‌కెక్కించారు ద‌ర్శ‌కుడు వెంక‌ట్ ప్ర‌భు. సాధార‌ణంగా క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చాలా వ‌ర‌కు హీరో, విల‌న్ పోరాటం నేప‌థ్యంలో సాగుతుంటాయి. కానీ క‌స్ట‌డీ మాత్రం విల‌న్‌ను కాపాడ‌ట‌మే హీరో ల‌క్ష్యంగా ఓ డ్రామా సెట్ చేస్తూ దాని చుట్టూ క‌థ‌ను అల్లుకున్నారు ద‌ర్శ‌కుడు. ముఖ్య‌మంత్రి, పోలీస్ క‌మీష‌న‌ర్‌తో పాటు రౌడీల‌ను ఎదురిస్తూ ఓ సాధార‌ణ కానిస్టేబుల్ సాగించే జ‌ర్నీకి యాక్ష‌న్‌, భారీ ఛేజింగ్స్ జోడిస్తూ థ్రిల్లింగ్‌గా ఈ సినిమాను న‌డిపించే ప్రయత్నం చేశారు. ఇలాంటి క్రైమ్ థ్రిల్ల‌ర్ సినిమాల్ని టైట్ స్క్రీన్‌ప్లేతో రేసీగా న‌డ‌ప‌డం చాలా ముఖ్యం. కానీ ఆ స్పీడ్‌నెస్ ఈ సినిమాలో లోపించింది. సినిమా మొద‌లైన ముప్పై నిమిషాల్లోనే క‌థేమిటి, క్లైమాక్స్ ఎలా ఉండ‌బోతుంద‌న్న‌ది ద‌ర్శ‌కుడు హింట్ ఇచ్చేశాడు. ట్విస్ట్‌లు పెద్ద‌గా వ‌ర్క‌వుట్ కాలేదు. అండ‌ర్ వాట‌ర్ యాక్ష‌న్ సీక్వెన్స్‌, రాంకీ గ‌న్ ఫైట్ సీన్ లాంటి హై మూవ్‌మెంట్స్ కొన్ని ఉన్నా ఆ టెంపో చివ‌రి వ‌ర‌కు కొన‌సాగించ‌లేక‌పోయారు. ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్ సినిమాలో ప్రేమ క‌థ స‌రిగా ఇమ‌డ‌లేదు.

ఎవరెలా చేశారంటే… నాగచైతన్య తన కెరీర్ లో ఒక ఛాలెంజ్ గా ఈ సినిమాలోని శివ పాత్రలో నటించాడు. పైగా తన గత సినిమాల్లో కంటే ఈ సినిమాలో నాచైతన్య చాలా సెటిల్డ్ గా నటించాడు. నిజాయితీప‌రుడైన కానిస్టేబుల్ పాత్ర‌లో చ‌క్క‌టి ఎమోష‌న్స్ ప‌డించాడు. యాక్ష‌న్ స‌న్నివేశాల్లో ఈజ్‌తో క‌నిపించాడు. శివ పాత్రలో నాగ చైతన్య అద‌ర‌గొట్టాడు. మొదట్లో కొంచెం సెట్ అవ్వనట్లు అనిపించినా, ఎప్పుడైతే కథలో లీనమయ్యామో, శివ పాత్రతో కనెక్ట్ అవ్వకుండా ఉండలేం. నాగ చైతన్య ఈ చిత్రం కోసం శక్తివంచన లేకుండా కష్టపడ్డారు. కొన్ని సన్నివేశాల్లో చైతు లుక్ సూపర్ స్టైలిష్ గా ఉన్నాయి. ఇటు హీరోయిన్ కృతి శెట్టి తో ప్రేమ సన్నివేశాల్లో గాని, అటు యాక్షన్ సన్నివేశాల్లో గాని అతడి నటన బాగుంది. హీరోయిన్ గా నటించిన కృతి శెట్టి తన నటనతో ఆకట్టుకుంది. కొన్ని చోట్ల సందర్భానుసారంగా ఆమె పలికించిన హావభావాలు మరియు ఆమె నటన బాగుంది. ఈ చిత్రానికి మరో ప్రధానాకర్షణ అరవింద్ స్వామి. నాగ‌చైత‌న్య త‌ర్వాత ఈ సినిమాలో అర‌వింద్ స్వామి పాత్రే ఎక్కువ‌గా హైలైట్ అయ్యింది. హావ‌భావాల‌తోనే విల‌నిజాన్ని పండిస్తూనే కామెడీ టైమింగ్‌తో ఆక‌ట్టుకున్నాడు. నమ్మిందే న్యాయం అనుకుని అతని చేసే క్రైమ్ లో కూడా కామెడీ పండిస్తూ అరవింద్ స్వామి తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. అతడు పలికిన కొన్ని డైలాగ్స్ కూడా పేలాయి. పోలీస్ కమీషనర్ నటరాజన్ గా శరత్ కుమార్ నటన బాగుంది. అలాగే ప్రియమణి, సంపత్ రాజ్, ప్రేమ్ జీ అమరెన్, ప్రేమి విశ్వనాథ్ లతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. వెన్నెల కిషోర్ కామెడీ పెద్ద‌గా వ‌ర్క‌వుట్ కాలేదు. అలాగే కొన్ని కీలక సన్నివేశలను దర్శకుడు వెంకట్ ప్రభు చాలా బాగా తెరకెక్కించాడు. ఇంటర్వెల్ సీక్వెన్స్ తో పాటు చేజింగ్ సీన్స్ ను, మరియు పాత్రలను డిజైన్ చేసిన విధానం బాగుంది.

టెక్నిక‌ల్ విష‌యానికి వ‌స్తే.. ఈ సినిమాకు పనిచేసిన సాంకేతిక టీమ్ పనితనం బేషుగ్గా ఉంది. సన్నివేశాలకు అనుగుణంగా సాంకేతిక వర్క్ సాగింది. సంగీత దర్శకులు ఇళయరాజా, యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం ఫర్వాలేదు. ఎస్ఆర్ కతీర్ ఐఎస్ సి సినిమాటోగ్రఫీ కూడా మెచ్చుకునేలా సాగింది. ఎక్కడా బ్యూటీ తగ్గకుండా ఈ చిత్రాన్ని తీర్చి దిద్దారు ఆయన. శ్రీనివాస చిట్టూరి నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. వెంకట్ ప్రభు తమిళ్ లో మంచి దర్శకుడు కాగా, ఆయ‌న ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకి అనుగుణంగా, ఇటు తమిళ ప్రేక్షకులకి అనుగుణంగా అందంగా ప్ర‌జెంట్ చేశారు. అయితే కథ, కథనం అంత బాగున్నప్పటికీ, చిత్రంలో అక్కడక్కడా తమిళ్ నేటివిటీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి మంచి బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు. దర్శకుడు వెంకట్ ప్రభు ఇంటర్వెల్ నుంచి కథపై కాస్త ఆసక్తి కలిగించగలిగారు కానీ.. ఎంగేజ్ చేసేలా స్క్రీన్ ప్లే రాసుకోలేదు. సినిమా మొత్తం పాటలు టైం గడపడానికి మాత్రమే పెట్టినట్లు ఉంది. కొన్నిసన్నివేశాలు కన్విన్సింగ్ గా అనిపించవు.

(చిత్రం: ‘కస్టడీ’ విడుదల తేది : మే 12, 2023, రేటింగ్ : 2.75/5, నటీనటులు: నాగ చైతన్య అక్కినేని, కృతిశెట్టి, అరవింద్ స్వామి, ప్రియమణి, శరత్ కుమార్, సంపత్ రాజ్, ప్రేమ్ జీ అమరెన్, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ తదితరులు. దర్శకత్వం: వెంకట్ ప్రభు, నిర్మాత: శ్రీనివాస చిట్టూరి, సంగీతం : ఇళయరాజా-యువన్ శంకర్ రాజా, సినిమాటోగ్రఫీ: ఎస్ఆర్ కతీర్ ఐఎస్ సి, ఎడిటింగ్ : వెంకట్ రాజన్)