సచివాలయాల్లో సేవలకు ఛార్జీలా.. ఇదెక్కడి విడ్డూరం 

AP government thinking to charge fee from people to get Sachivalayam services
వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామ వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగుల పేరుతో రెండున్నర లక్షల మందికి పైగా ఉద్యోగులను ప్రభుత్వంలోకి తీసుకున్నారు.  పరిపాలనా సౌలభ్యం కోసమే ఈ వ్యవస్థ అంటూ కారణం చూపారు.  పరిపాలనా వెసులుబాటు కోసం కొత్త వ్యవస్థను సృష్టించడం మంచి విషయమే.  కానీ ఆ వ్యవస్థ ప్రజలకు భారంగా మారితేనే కష్టం.  త్వరలో గ్రామ, వార్డు సచివాలయాల పరిస్థితి ఇలానే ఉండనుందనేది టాక్.  ఎందుకంటే సచివాలయాల్లో కల్పించే పౌర సేవలకు ఛార్జీలు వసూలు చేయాలనే ఆలోచనలో జగన్ సర్కార్ ఉందని రాజకీయవర్గాల్లో టాక్.  ఇదే గనుక నిజమైతే పెద్ద పొరపాటే అవుతుంది. 
 
 
ఎందుకంటే ఇప్పటికే ఉన్న ప్రభుత్వ శాఖల ఉద్యోగులు చేసే పనులనే కొత్తగా సృష్టించబడిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు చేస్తున్నారు.  వీరు లేకపోయినా సగం కార్యకలాపాలు యధావిధిగా జరిగిపోతాయి.  ఇంకొన్ని పనులను ఆ ఉద్యోగులకే అప్పగించవచ్చు.  కానీ అలాంటివేమీ లేకుండా కొత్త వ్యవస్థనే సృష్టించారు జగన్.  దీని వలన యువతకు ఉపాధి దొరకడం, ప్రభుత్వం ప్రజలకు దగ్గరగా రావడం వంటివి కనిపించడంతో ప్రజలు సైతం హర్శించారు.  ఒకరకంగా చెప్పాలంటే ఈ వ్యవస్థను నడపడానికి అయ్యే భారీ వ్యయం నిధుల కొరతతో అల్లాడుతున్న రాష్ట్రానికి భారమనే చెప్పాలి.  కానీ ఉద్దేశ్యం మంచిది కాబట్టి ప్రజలు వ్యతిరేకించలేదు. 
 
 
పైగా గ్రామ వాలంటీర్ల నియామకంలో కూడా చాలా రాజకీయం నడిచింది.  ఎక్కువ ఉద్యోగాలు వైకాపా కార్యకర్తలకే వెళ్లాయి.  ఈ విషయాన్ని స్వయంగా విజయసాయిరెడ్డిగారే చెప్పారు.  వాలంటీర్లలో అందరూ మనవాళ్లే ఉన్నారంటూ మాట్లాడారు.  ప్రతిపక్షాలు ఈ అంశాన్ని హైలెట్ చేసినా జనం పట్టించుకోలేదు.  ఇక సచివాలయ భవనాల కోసం  పెద్ద ఎత్తున ఖర్చు పెట్టడం, పంచాయితీ భవనాలకు పార్టీ జెండా రంగులు వేయడం, కోర్టు ఉత్తర్వులతో తొలగించడం, వేరే రంగులు వేయడంతో కొన్ని వందల కోట్లు వృధాగా పోయాయి.  అయినా ప్రజలు మాట్లాడలేదు. 
 
 
అలాంటిదిప్పుడు సచివాలయాల్లో అందించే పౌర సేవలకు ప్రజల నుండి ఛార్జీలు వసూలు చేయాలనే ఆలోచనను ప్రభుత్వం చేస్తుండటం దారుణం.  పరిపాలనా సేవలను పొందడం అనేది ప్రజల హక్కు.  ఆ హక్కును పొందడానికి డబ్బులు చెల్లించమనడం అన్యాయమే అవుతుంది.  ఒక ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తుంది అంటే అర్థం దాని పాలన జనరంజకంగా ఉందని అర్థం.  జనరంజకమైన పాలన అంటే కష్టం, జాప్యం  లేకుండా ప్రజల పనులు జరిగిపోవాలి.  అలాంటిది వైకాపా సర్కార్ మాత్రం సేవలను పొందాలంటే డబ్బు చెల్లించాలనే షరతును పెడితే అది ప్రజల హక్కును వారికే అమ్మడం అవుతుంది.  ప్రజాస్వామ్యంలో ఇలాంటి పోకడలు అస్సలు కుదరవు. 
 
 
ఒకవేళ నిజంగా ఈ ఛార్జీల వసూలును అమలుచేయాలనే ఆలోచనే జగన్ ప్రభుత్వానికి  ఉంటే వెంటనే దాన్ని విరమించుకోవాలి.  లేకుంటే రాజకీయంగా భవిష్యత్తులో పెద్ద ఎదురుదెబ్బలను చూడాల్సి ఉంటుంది.  ప్రతిపక్షాలైన తెలుగుదేశం, జనసేనలు ఈ అంశాన్ని అంత సులువుగా వదలవు.  ఆందోళనలు చేస్తాయి.  ప్రజల నుండే వ్యతిరేకత వచ్చే వాతావరణాన్ని సృష్టిస్తాయి.  ఫలితంగా వైకాపా భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు.  మంచి ఉద్దేశ్యం కోసం ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థ మీద వ్యతిరేకత పుడుతుంది.  ఒకవేళ వచ్చే దఫాలో వేరే ప్రభుత్వం ఏర్పడితే ఆ వ్యవస్థనే తొలగించవచ్చు.  కనుక ఈ దుష్పరిణామాలు జరగకుండా ఉండాలంటే ఛార్జీల వసూలు ఆలోచన గనుక ఉంటే దాన్ని వెంటనే విరమించుకోవాలి.