ఏమాటకామాట చెప్పుకోవాలంటే… నందమూరి తారక రామారావు నుంచి, ఆయన ఫ్యామిలీ మొత్తం చంద్రబాబుకోసమే పుట్టారేమో అనిపిస్తుంటుంది! ఎన్టీఆర్ కూతురును ఇచ్చి పెళ్లి చేశారు.. పార్టీలో సముచిత స్థానం ఇచ్చారు.. ఆయనకు ఎప్పుడైనా ఇబ్బంది వస్తే చూసుకోవడానికి బాలయ్య లాంటి బావమరిదిని ఇచ్చారు.. పక్క పార్టీల్లో ఉంటూ పరోక్షంగా సపోర్ట్ చేయడానికి పురందేశ్వరి లాంటి వదినను ఇచ్చారు.. అని గతకొన్ని రోజులుగా తెలుగు రాజకీయాల్లో ఒక చర్చ నడుస్తుంది.
ఆ చర్చకు బలం చేకూరుస్తూ తాజాగా బాలకృష్ణ “ఆహా” యాప్ లో వచ్చే అన్ స్టాపబుల్ షో లిమిటెడ్ ఎడిషన్ లో ఒక డైలాగ్ వేశారు. “మేము తప్పు చేయలేదని మీకు తెలుసు.. మేము తలవంచమని మీకు తెలుసు.. మనల్ని ఆపడానికి ఎవరూ రాలేరని మీకు తెలుసు.. అనిపించింది అందాం.. అనుకున్నది చేద్దాం.. ఎవడు ఆపుతాడో చూద్దాం..”! ఇది బాలయ్య వేసిన డైలాగ్!
దీంతో తప్పు చేయలేనిది ఎవరు.. ఎవరికి తెలుసు… కోర్టులకా, పోలీసులకా అంటూ పడుతున్న కామెంట్ల సంగతి కాసేపు పక్కనపెడితే… ఆ తర్వాత మరో డైలాగ్ పేల్చారు బాలయ్య. “సినిమా అయినా.. లైఫ్ లో అయినా.. అంతా బాగున్నప్పుడే ఒకడు దిగుతాడు. మొత్తం నాశనం చేయడానికి బయలుదేరతాడు. మళ్లీ సెట్ చేయడానికి హీరోలు జైలు నుంచి బయటకి రావాలి” అని! దీంతో పార్టీలో పాతుకు పోతాడేమో అని పక్కకెళ్లి ఆడుకోమని పంపించేసినా కూడా ఇంత తాపత్రయపడుతున్నారో అనే కామెంట్లు వినిపిస్తున్నాయి!
వివరాళ్లోకి వస్తే… ఇదిలా ఉంటే అన్ స్టాపబుల్ మూడో సీజన్ తాజాగా ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇందులో భాంగా ఫస్ట్ ఎపిసోడ్ కి అతిథులుగా బాలకృష్ణ హీరోగా నటిస్తున్న భగవంత్ కేసరి టీమ్ హాజరవుతోంది. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఈ ప్రోమోను చూస్తే మరోసారి బాలకృష్ణ తన రాజకీయ అవసరాల కోసం అన్ స్టాపబుల్ వేదికను వాడుకున్నట్లు అర్థమవుతుందని అంటున్నారు పరిశీలకులు.
దీంతో బాలయ్య పైన చెప్పిన డైలాగ్స్ విన్న వారు మాత్రం… వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నప్పుడు, ఇలాంటి డైలాగులు కాలక్షేపానికి బాగానే ఉంటాయి కానీ… వాస్తవాంలో ఎబ్బెట్టుగా ఉంటాయనే మాటలు వినిపిస్తున్నాయి. కాగా… స్కిల్ డెవలప్ మెంట్ స్కాం అనంతరం రెండు రోజులు పార్టీ ఆఫిసులో బాలయ్య సందడి చేసిన సంగతి తెలిసిందే. దీంతో… నారా అభిమానులు అలర్ట్ అయ్యి.. బాలయ్యను హైదరాబాద్ పంపించేశారని ఒక చర్చ ఏపీ రాజకీయాల్లో జరుగుతుంటుంది.