వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రస్తుతం పోలీసుల రడార్‌పై ఉన్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరు ప్రాంతంలో జరిగిన అక్రమ మైనింగ్ కేసులో ఆయనపై సీరియస్ ఆరోపణలు రావడం, విచారణకు నోటీసులు పంపినా స్పందించకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. తాజాగా, గురువారం ఉదయం ఏపీ పోలీసులు కాకాణిపై లుకౌట్ నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశమైంది. దేశంలోని అన్ని విమానాశ్రయాలు, నౌకాశ్రయాలకు ఈ నోటీసులు పంపారు. ఆయన విదేశాలకు పారిపోతారన్న అనుమానంతోనే ఈ జాగ్రత్త చర్య తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఇంతకీ విషయమేంటంటే, కాకాణి మంత్రి హోదాలో ఉన్నప్పుడు నెల్లూరులో రూ.250 కోట్ల విలువైన క్వార్ట్జ్ ఖనిజాన్ని అక్రమంగా తవ్వించి అమ్మకాలు జరిపినట్టు ఆరోపణలు వచ్చాయి. ప్రాథమిక విచారణలోనూ ఈ విషయాలు నిజమేనన్న నిర్ధారణలు రావడంతో, పోలీసులు కాకాణి, ఆయన అనుచరులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అప్పటి నుంచి ఆయనను విచారణకు హాజరయ్యేలా పోలీసు శాఖ నోటీసులు జారీ చేస్తోంది. కానీ ఆయన నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం, నోటీసుల్ని కూడా తీసుకోకపోవడం పోలీసులను ఉలిక్కిపడేలా చేసింది.
ఇప్పటికే రెండు వారాలుగా కాకాణి ఎక్కడ ఉన్నారన్న సమాచారం పోలీసులకు లేదు. దీనిపై అనేక ఊహాగానాలు రేగుతున్నాయి. తప్పించుకోవడానికి ముందస్తు ప్లాన్ వేసుకున్నారని ప్రచారం సాగుతోంది. ఇక లుకౌట్ నోటీసుల నేపథ్యంలో ఆయన విదేశాలకు వెళ్లిపోయే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్న పోలీసులు తదుపరి చర్యల కోసం రంగం సిద్ధం చేస్తున్నారు. కాకాణి కుటుంబసభ్యులు, ముఖ్యంగా ఆయన అల్లుడిపై కూడా ఇదే కేసులో నేరపూరిత చర్యలు ప్రారంభించడం గమనార్హం. ఆయన కూడా విచారణకు హాజరుకాలేదు. ఇప్పుడు కాకాణి ఎక్కడ..? ఆయన వాస్తవంగా దేశం దాటి పారిపోయారా..? పోలీసుల తదుపరి అడుగేంటి..? అన్నది ఆసక్తికర చర్చగా మారింది.
