CRDA Headquarters: ఘనంగా ప్రారంభమైన సీఆర్డీఏ నూతన కార్యాలయ భవనం – పరిపాలన మరింత సులభతరం

ఆంధ్రప్రదేశ్‌ కలల రాజధాని అమరావతి పరిధిలో నూతనంగా నిర్మించిన సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ) ప్రధాన కార్యాలయ భవనాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఘనంగా ప్రారంభించారు. రాయపూడి సమీపంలోని సీడ్ ఆక్సిస్ రహదారి వద్ద అత్యాధునిక హంగులతో, ఏడు అంతస్తుల్లో (జీ+7) నిర్మించిన ఈ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా వేదపండితులు పూర్ణకుంభం, వేదాశీర్వచనాలతో సీఎంకు స్వాగతం పలికారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని కోసం భూములిచ్చిన రైతులతో కలిసి ఈ కార్యాలయాన్ని ప్రారంభించడం విశేషం. ఈ సందర్భంగా ఆయన రైతులతో కాసేపు ముచ్చటించి, రాజధాని నిర్మాణం కోసం వారు చేసిన త్యాగం వెలకట్టలేనిదని కొనియాడారు. అనంతరం, ముఖ్యమంత్రి భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఆయన వెంట ఉన్న మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ భవన నిర్మాణ శైలి, అందుబాటులో ఉన్న సౌకర్యాలను సీఎంకు వివరించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

భవనం ప్రత్యేకతలు, సౌకర్యాలు: సీఆర్డీఏ ప్రధాన కార్యాలయ భవనాన్ని 4.32 ఎకరాల్లో 3,07,326 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు.  అమరావతిని ప్రతిబింబించేలా ‘A’ అక్షరంతో ప్రత్యేక ఎలివేషన్‌ను రూపొందించారు.

అంతస్తుల వారీగా విభాగాలు: రిసెప్షన్, పబ్లిక్ ఎక్స్‌పీరియెన్స్ సెంటర్, బ్యాంకు, ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్. మొదటి అంతస్తు మీటింగ్ హాల్స్. 2, 3, 5 అంతస్తులు సీఆర్డీఏ విభాగాలు. నాలుగో అంతస్తు సీడీఎంఏ పురపాలక డైరెక్టరేట్ కార్యాలయం. ఆరో అంతస్తు అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ADCL) విభాగాలు. ఇతర సౌకర్యాలు ఉన్నతాధికారుల ఛాంబర్లు, AI కమాండ్ సెంటర్, భవనం పైకప్పుపై ప్రీ-ఇంజినీర్డ్ డైనింగ్ ఏరియా.

సీఆర్డీఏతో పాటు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలకు అనుబంధంగా ఉన్న కార్యాలయాలన్నీ ఈ నూతన భవనంలోకి మారనున్నాయి. దీంతో వివిధ శాఖల కార్యాలయాలు ఒకే చోట కొలువుదీరి, పరిపాలన సౌలభ్యం మెరుగుపడి, ప్రజలకు మరింత సమర్థంగా సేవలు అందించే వీలు కలుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

పక్కనే అదనపు భవనాలు:

ప్రధాన కార్యాలయానికి పక్కనే మొత్తం 8 ఎకరాల్లో మరో 4 అదనపు భవనాలను కూడా నిర్మించారు. ఒక్కో భవనం 41,500 చదరపు అడగుల విస్తీర్ణంలో రూపుదిద్దుకుంది. ఇంతకుముందు వరకు విజయవాడ కేంద్రంగా పరిపాలన సాగించిన సీఆర్డీఏ కార్యాలయం ఇప్పుడు కొత్త భవనం పూర్తి కావడంతో అమరావతికి తరలిరానుంది. ఈ ప్రారంభోత్సవంతో రాజధాని అభివృద్ధి పనుల పునరుద్ధరణ కూడా వేగంగా సాగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Jubilee Hills Bypoll 2025: Sunitha Vs Naveen | Telugu Rajyam