Anakapalli Police: అనకాపల్లి నుంచి అమెరికా వాసులను మోసం చేస్తున్నారు.. ఎలాగంటే?

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో భారీ స్థాయిలో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. కాల్ సెంటర్ పేరుతో నకిలీ సంస్థను నిర్వహిస్తూ అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకొని కోట్ల రూపాయలు కాజేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా మీడియాతో షేర్ చేశారు.

ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన కొంతమంది, గత రెండేళ్లుగా అచ్యుతాపురంలో ఓ కార్యాలయం ఏర్పాటు చేసి కాల్ సెంటర్ ముసుగులో ఆన్‌లైన్ మోసాలు జరుపుతున్నట్టు గుర్తించారు. నెలకు సుమారు రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు ఈ ముఠా దొంగదెబ్బ వేస్తోందని ప్రాథమిక సమాచారం. అమెరికాతో పాటు ఇతర దేశాల నుంచి పన్ను భద్రత, బ్యాంకింగ్ సంబంధిత సమాచారం పేరుతో డేటాను సేకరించి, మోసాలకు పాల్పడుతున్నారు.

ఈ సంస్థలో దాదాపు 250 మందికి పైగా పని చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు 33 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి రూ.3 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. నకిలీగా ఉద్యోగాలు ఇచ్చి, వాస్తవంగా విదేశీ పౌరులపై మోసాలకు ఉపయోగిస్తున్న ఈ వ్యవస్థపై పోలీసులు సీరియస్‌గా దర్యాప్తు ప్రారంభించారు.

ఇప్పటికే దేశవ్యాప్తంగా నిందితులపై చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. సీఐడీ, కేంద్ర దర్యాప్తు సంస్థల సహకంతో మిగిలిన నిందితులను కూడా పట్టుకోవాలని అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఇలాంటి నకిలీ కాల్ సెంటర్ల ప్రభావం విదేశాల్లో భారత్ పై పడకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.