దేశం దిగ్భ్రాంతి.. రౌడీషీటర్ గ్యాంగ్ కాల్పుల్లో 8 మంది పోలీసులు మృతి

8 Cops Killed
ఉత్తరప్రదేశ్ నందు దారుణం చోటుచేసుకుంది.  ఒక రౌడీ షీటర, అతని గ్యాంగ్ జరిపిన కాల్పుల్లో 8 మంది పోలీసులు మరణించారు.  ఈ ఘటన దేశవ్యాప్తంగా అలజడి క్రియేట్ చేసింది.  వివరాల్లోకి వెళితే వికాస్ దూబే మోస్ట్ యూపీలో వాంటెడ్ రౌడీ షీటర్.  అతను బీజేపీకి చెందిన మంత్రి హత్య కేసుతో పాటు మరో 60 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు.  ఛాన్నాళ్ల నుండి పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుని తిరుగుతున్న వికాస్ దూబేను ఎలాగైనా అరెస్ట్ చేయాలని యూపీ పోలీసులు గట్టిగా నిర్ణయించుకున్నారు.  వికాస్ దూబే కాన్పూర్ శివార్లలోని బికరూ గ్రామంలో నక్కి ఉన్నట్టు పక్కా సమాచారం అందింది.  దీంతో పోలీస్ బృందం శుక్రవారం తెల్లవారుఝామున బికరూ గ్రామాన్ని చుట్టుముట్టారు. 
 
గ్రామంలోని ప్రతి ఇంటినీ జల్లెడపట్టడం స్టార్ట్ చేశారు.  ఇంతలో పోలీసుల రాకను పసిగట్టిన వికాస్ దూబే గ్యాంగ్ ఉన్నట్టుండి పెద్ద ఎత్తున కాల్పులు స్టార్ట్ చేశారు.  ఊహించని ఎదురుదాడితో పోలీసులు ఖంగుతిన్నారు.  తేరుకుని చూసే లోపు పోలీస్ బృందంలో ఎనిమిది మంది మరణించారు.  మృతుల్లో డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ దేవేంద్ర మిశ్రాతో ముగ్గురు సబ్ ఇన్స్పెక్టర్లు, నలుగురు కానిస్టేబుళ్లు ఉన్నారు.  మరో ఆరుగురు కానిస్టేబుళ్లు, ఒక పౌరుడు గాయపడ్డారు.  పోలీసుల మీద జరిగిన ఈ మారణకాండతో యూపీ మాత్రమే కాదు దేశం మొత్తం దిగ్భ్రాంతికి లోనైంది. 
 
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఘటనపై స్పందిస్తూ అమరులైన పోలీసుల ధైర్య సాహసాలను యూపీ ఎప్పటికీ మర్చిపోలేదని అంటూ రౌడీ షీటర్ గ్యాంగును అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఆదేశించారు.  దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అలర్ట్ అయిన పోలీసులు వికాస్ దూబే గ్యాంగ్ కోసం గాలింపు జరుపుతున్నారు.  ఇప్పటికే కాన్షీరాం నివాడ గ్రామం వద్ద ఇద్దరు గ్యాంగ్ సభ్యులను ఎన్కౌంటర్లో మట్టుబెట్టారు.  ఇక వికాస్ దూబేతో పాటు ఇంకో ముగ్గురు క్రిమినల్స్ కోసం వెతుకుతున్నారు.  బీజేపీ పాలిత రాష్ట్రంలో ఈ ఘోరం జరగడంతో ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.