పవన్ మెడకు కొత్త పామును చుట్టిన నాగబాబు

ప్రస్తుతం జనసేన పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది.  పవన్ మామూలుగా మాట్లాడితేనే నానార్థాలు వెతుకుతుంది.  అలాంటిది విపరీతాలు మాట్లాడితే ఊరుకుంటుందా.  ప్రస్తుతం మెగాబ్రదర్ నాగబాబు ఇలాంటి విపరీతం గురించి మాట్లాడే వివాదం తెచ్చుకున్నారు.  అంతేనా పవన్‌ను, పార్టీని కూడా ఇరుకుల్లో పెట్టారు.  నిన్న నాథూరాం గాడ్సే పుట్టినరోజు కావడంతో ఆయన్ను గుర్తుచేసుకున్న నాగనాబు గాడ్సే దేశభక్తి గొప్పదని కితాబిచ్చారు.  అదే ఇంత అగ్గిని రాజేసింది. 
 
నాథూరాం నిజమైన దేశభక్తుడు.  గాంధీని చంపడం కరెక్టా కాదా అనేది డిబేటబుల్.  గాడ్సే వైపు వాదనను ఆ రోజుల్లో మీడియా చెప్పలేదు.  కేవలం మీడియా అధికార ప్రభుత్వానికి లోబడి పనిచేసింది.  గాంధీని చంపితే అపఖ్యాతి పాలవుతానని తెలిసినా చేశాడు.  అతని దేశభక్తిని శంకించలేము.  మే హిజ్ సోల్ రెస్ట్ ఇన్ పీస్ అంటూ సానుభూతి స్టేట్మెంట్ ఇచ్చారు.  ఇలాంటి మాటలు సభ్య సమాజంతో పనిలేని ఆర్జీవీ లాంటి ఇండివిడ్యువల్ వ్యక్తులు మాట్లాడితే జనం కూడా లైట్ తీసుకుంటారు. 
 
కానీ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న నాగబాబు లాంటి వ్యక్తి మాట్లాడితే అందరూ తప్పుబడతారు.  అది సహజం.  ఎందుకంటే గాంధీజీ మహోన్నత వ్యక్తి.  ఇప్పటికీ ఆయన మార్గాలు, మాటలు ఆచరణీయం, అభినందనీయం.  అలాంటి వ్యక్తిని హత్య చేయడానికి గాడ్సే దగ్గర ఎలాంటి కారణాలైనా ఉండొచ్చు.  కానీ హత్య చేయడం నేరం.  అలాంటి వ్యక్తిని దేశభక్తుడు అంటే ఎవరు మాత్రం అంత సులభంగా వదులుతారు.  అందుకే నాగబాబు మాటల్ని తీవ్రంగా ఖండించారు.  
 
అంతేనా అటు తిరిగి ఇటు తిరిగి వివాదాన్ని పవన్ మెడకు చుట్టేస్తున్నారు.  పవన్ కళ్యాణ్ ఏమో గాంధీవాదం గొప్పదని అంటారు, ఆయన మాటల్ని పదే పదే గుర్తు చేస్తుంటారు.  కానీ అయన సోదరుడు నాగబాబు మాత్రం గాంధీని చంపిన గాడ్సే గొప్ప దేశ భక్తుడని అంటాడు.  ఈ తంతు చూస్తుంటే భాజాపా మెప్పు పొందడం కోసం చేస్తున్నట్టే ఉంది అంటూ జాతీయ స్థాయి వివాదంలోకి లాగేశారు.  భాజాపా నేతలు కొందరు, దాని అనుబంధ సంస్థ ఆరెస్సెస్ కూడా అంతే కాంగ్రెస్ మీద వ్యతిరేకతతో గాడ్సేను పొగుడుతుంటుంది.  అందుకే జనసేనను వారితో పోల్చుతున్నారు. 
 
ఇంతా జరిగిన తర్వాత నాగబాబు నన్ను అర్థం చేసుకోండి.  నేను గాడ్సే నేరాన్ని సమర్థించలేదు.  అతని వెర్షన్ కూడా వినాలి అంటున్నాను.  నాకు కూడా గాంధీ అంటే చాలా గౌరవం అంటూ బురద కడుక్కునే ప్రయత్నం చేశారు.  అసలు ఇలాంటి విపరీతమైన వ్యక్తిగతాభిప్రాయాలు ఉంటే వాటిని లోపలే అనచుకోవాలి లేదా సన్నిహితులతో మాత్రమే పంచుకోవాలి.  అంతేకానీ ఇలా పబ్లిక్ చేసి మాటలు పడటం గాలికి పోయే కంపను గుడ్డకు తగిలించుకోవడం లాంటిదే అవుతుంది.