ప్రస్తుత కాలంలో ప్రజలలో చాలా మార్పు వచ్చింది. పూర్వం పెద్దవారిని చూసిన వెంటనే మర్యాదపూర్వకంగా లేచి నమస్కరించేవారు. అయితే ఇప్పుడు మాత్రం హాయ్.. హలో.. అంటూ పాశ్చాత్య సంస్కృతిని అలవాటు చేసుకుని మన భారతీయ సంస్కృతిని కాలికి వదిలేస్తున్నారు. భారతీయ సంస్కృతిలో నమస్కారానికి చాలా ప్రత్యేకత ఉంది. నమస్కారం అనేది ఒక గౌరవ సూచికం. దేవుడికి, తల్లిదండ్రులకు, గురువులకు, పెద్దలకు భక్తితో నమస్కరించటం మన వ్యక్తిత్వానికి నిదర్శనంగా ఉంటుంది. అయితే నమస్కారం చేసే సమయంలో కూడా కొన్ని నియమాలు పాటించాలి. దేవుళ్ళకి, వ్యక్తులకు నమస్కారం చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా దేవాలయాలకు వెళ్ళినప్పుడు దేవుడు ఎదురుగా నిలబడి నమస్కారం చేస్తూ ఉంటారు. పొరపాటున కూడా అలా చేయకూడదు. మన హిందూ సంస్కృతి ప్రకారం దేవాలయాలకు వెళ్లినవారు దేవుడికి ఎడమవైపుగా నిలబడి నమస్కరించటం శ్రేయస్కరం. పొరపాటున కూడా దేవుడికి ఎదురుగా నమస్కారం చేయటం వల్ల గుడికి వెళ్లిన ఫలితం లభించదు. ఇక సాధారణంగా శివాలయానికి వెళ్ళినప్పుడు లింగాన్ని తాకి నమస్కారం చేస్తూ ఉంటారు. శివునికి, విష్ణువుకు నమస్కరించేటప్పుడు తలవంచి 12 అంగుళాల ఎత్తున చేతులు జోడించి నమస్కరించాలి. శివ కేశవులు మధ్యఏ భేదం లేదని చెప్పడానికి ఇది గుర్తు. శివ కేశవులకు తప్ప మిగతా దేవతలకు శిరస్సు మీద చేతులు జోడించి నమస్కరించకూడదు.
ఇక తల్లి, తండ్రి,గురువు ని కూడా దైవంతో సమానంగా భావిస్తారు. అందువల్ల వారికి కూడా మర్యాదపూర్వకంగా చేతులు జోడించి నమస్కరించాలి. అయితే గురువులకు నమస్కారం చేసేటప్పుడు ముఖానికి ఎదురుగా చేతులు జోడించి నమస్కారం చేయాలి. అలాగే తండ్రికి ఇతర పెద్దలకు నమస్కారం చేసే సమయంలో నోటికి సమానంగా చేతులు జోడించి నమస్కరించటం ఉత్తమం. అలాగే తల్లికి నమస్కారం చేసే సమయంలో ఛాతికి ఎదురుగా చేతులు జోడించి తల్లికి నమస్కరించాలి. అలాగే యోగులకు సాధువులకు నమస్కారం చేసే సమయంలో రెండు చేతులను వక్షస్థలానికి సమానంగా ఉంచి నమస్కరించాలి.