మన హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రజలు ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేస్తూ ఉంటారు. అలాగే ప్రతిరోజు ఆలయానికి వెళ్లి దేవుడిని దర్శించుకుంటారు. అయితే పండుగలు ప్రత్యేకమైన పూజలు చేసినప్పుడు ఇంట్లో పూజా కార్యక్రమం ముగిసిన తర్వాత కొబ్బరికాయ కొడుతూ ఉంటారు. అలాగే ఆలయానికి వెళ్లి దేవుడి దర్శనం చేసుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టడం ఆనవాయితీగా వస్తోంది . ఇలా కొబ్బరికాయ కొట్టటం శుభప్రదం అని పండితులు చెబుతున్నారు. అయితే కొన్ని సందర్భాలలో ఇంట్లో లేదా దేవాలయాలలో కొట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోయి ఉంటుంది. ఇలా మనం కొట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోతే అరిష్టంగా ప్రజలు భావిస్తారు.
అయితే కొబ్బరికాయ కుళ్ళిపోతే నిజంగా అరిష్టం జరుగుతుందా? లేదా అన్న విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్ర ప్రకారం పూజా కార్యక్రమం తర్వాత కొట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోవటం అరిష్టం కాదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు వెల్లడించారు. కుళ్లిన కొబ్బరి కాయ కొట్టడం మనకు తెలిసి చేసిన పని కాదు కాబట్టి .. కొబ్బరికాయ కుళ్ళిపోవడం వల్ల ఎటువంటి చెడు జరగదు. అంటే ఇలా కొబ్బరికాయ కుళ్ళిపోతే ఆ దోషం కుళ్లిన కొబ్బరి కాయదే కాని ఇచ్చిన వ్యక్తిది కాదని అర్థం. ఇంట్లో, దేవాలయంలో కట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోతే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంట్లో కొట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోతే.. కుళ్లిపోయిన ఆ కొబ్బరికాయలు తీసివేసి మళ్లీ కాళ్లు ముఖం కడుక్కొని పసుపు నీటితో పూజ గదిని శుద్ధిచేసి ఆ తర్వాత మరల పూజ ప్రారంభించడం వల్ల ఎటువంటి దోషం ఉండదని పండితులు చెబుతున్నారు. ఇక దేవాలయాలలో కొట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోతే దేవుడి విగ్రహాన్ని మంచి నీటితో శుభ్రం చేసి మళ్లీ మంత్రోచ్ఛారణతో స్వామి వారిని అలంకరిస్తారు. ఆ తర్వాత మరొక కొబ్బరికాయ కొడతారు. అలాగే కొత్త వాహనాలకు పూజ చేసిన తర్వాత కొట్టే కొబ్బరికాయ కుళ్ళిపోతే భయపడాల్సిన అవసరం లేదు. ఇలా కొబ్బరికాయ కుళ్ళిపోతే దిష్టి మొత్తం తొలగిపోయినట్లు అర్థం. అలా వాహనం ముందు కొట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోతే మళ్ళీ వాహనాన్ని శుభ్రం చేసి మళ్లీ కొబ్బరి కాయ కొట్టాలని సూచిస్తున్నారు.