సాధారణంగా భక్తులు తమ కోరికలు నెరవేర్చుకోవడానికి దేవుళ్లకు వివిధ రూపాలలో కానుకలు సమర్పించుకుంటూ ఉంటారు. అయితే చాలామంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కు నెరవేర్చుకుంటారు. అలాగే మరి కొంతమంది ముడుపులు కట్టడం, బోనాలు సమర్పించడం, ప్రదక్షణాలు చేయడం, పోర్లు దండాలు పెట్టటం ద్వారా తమ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. అయితే కర్ణాటకలో ప్రజలు మొక్కు తీర్చుకోవటానికి ఆచరించే ఒక విధానం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కర్ణాటకలోని కలబురగి జిల్లాలో కొనసాగుతున్న ఈ విచిత్ర ఆచారం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
కలబురగి జిల్లా అలంద్ తాలూకాలోని గోల బి గ్రామంలో లక్ష్మమ్మ దేవి అమ్మవారి ఆలయం ముందు కొత్త పాదుకలు కట్టే సంప్రదాయం కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతోంది. దీపావళి పండుగ తర్వాత పంచమి, పౌర్ణమి నాడు ఈ గ్రామంలో లక్కమ్మదేవి జాతర నిర్వహిస్తారు. ఈ జాతరలో గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్క ప్రాంతాలలో ఉన్న ప్రజలు కూడా ఈ అమ్మవారి ఆలయానికి చేరుకొని తమ మనసులో ఉన్న కోరికలను నెరవేర్చమని అమ్మవారిని వేడుకుంటూ గుడి ముందు కొత్త పాదరక్షలు కట్టి వారి మొక్కు చెల్లించుకుంటారు. అయితే ఇలా గుడి ముందు చెప్పులు తెచ్చి కట్టడానికి కూడా చాలా పెద్ద కారణం ఉందని ఇక్కడి ప్రజలు వెల్లడించారు.
గోల గ్రామంలో లక్ష్మమ్మ దేవి రాత్రి పూట గుడి వదిలి గ్రామంలో తిరుగుతుందని అక్కడి ప్రజల నమ్మకం. సమయంలో ఆ అమ్మవారు గుడి ముందు సమర్పించిన కొత్త పాదరక్షలను ధరించి తిరుగుతారని ప్రజల విశ్వాసం. జాతర రోజున అమ్మవారి ఆలయం ముందు కట్టిన కొత్త పాదరక్షలు మరుసటి రోజుకి అరిగిపోయి ఉంటాయి. అందువల్ల అమ్మవారు వాటిని ధరించి తిరుగుతుందని ప్రజలు విశ్వసిస్తారు.
సాధారణంగా ఆలయంలో ముందు బాగాన దేవతలకు పూజలు నిర్వహిస్తారు . కానీ ఈ ఆలయంలో మాత్రం ఒక ప్రత్యేకత ఉంది. లక్ష్మమ్మ దేవి ఆలయం వెనుక భాగాన అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇలా చేయటానికి కూడా ఒక కారణం ఉంది. అలంద తాలూకా దుత్తరగావ్ గ్రామానికి చెందిన లక్కమ్మదేవి గోల బి గ్రామానికి వచ్చి వెన్నుపోటుకు గురైనట్టుగా చెబుతారు. అందుకే ఇక్కడ అమ్మవారి ముఖం కనిపించదు. అందువల్ల ఈ ఆలయానికి వచ్చే భక్తులు అమ్మవారికి వెనుకవైపు పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారి వెనుక వైపు నమస్కరిస్తూ ఉంటారు. గుడి ముందు పాదరక్షలు సమర్పించటం వల్ల ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది.