భోగి పండుగ రోజు చిన్న పిల్లలకు భోగి పళ్ళు పోయటం వెనుక గల రహస్యం ఏమిటో తెలుసా…?

దేశవ్యాప్తంగా సంక్రాంతి పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు. ఏ సంక్రాంతి పండుగను ఒక్కొక్క ప్రాంతంలో ఒక్క పేరుతో పిలుస్తూ ఉంటారు. అయితే మూడు రోజులపాటు జరుపుకొని ఈ సంక్రాంతి పండుగకు చాలా విశిష్టత ఉంది. మొదటి రోజు భోగి రెండవ రోజు సంక్రాంతి మూడవ రోజు కనుమ పండుగను జరుపుకుంటారు. ఈ మూడు రోజులపాటు ఇంటిముందు రంగురంగుల ముగ్గులతో లోగిళ్లను అందంగా అలంకరిస్తారు. ఈ సంక్రాంతి పండుగను పల్లెల్లో చాలా ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా భోగి పండుగ రోజున పిల్లలకు భోగి పళ్ళు పోయటం చాలాకాలంగా ఆనవాయితీగా వస్తోంది. అయితే పిల్లలకు భోగి పళ్ళు పోయడానికి గల కారణం గురించి ఇప్పటికి చాలామందికి తెలియదు.

భోగి పండుగ రోజున 10 సంవత్సరాల లోపు వయసు గల పిల్లలకు భోగి పళ్ళు పోయటం వల్ల మంచి జరుగుతుందని ప్రజల నమ్మకం. పిల్లల చేత సాయంత్రం సంది గొబ్బెలు పెట్టించిన తర్వాత ఈ భోగి పళ్లు చేసే కార్యక్రమం మొదలుపెడతారు.రేగి పళ్లు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణేలు, చెరుకు గడల ముక్కలు కలిపి పిల్లలకు భోగి పళ్ళు పోస్తారు. అలా భోగి పళ్ళు పోసిన తర్వాత వాటిని ఎవరూ తినకుండా పారాబోయాలి. అయితే భోగి పండుగ రోజున ఇలా పిల్లలకు రేగి పండ్లు పోయడానికి గల కారణం కూడా ఉంది. సాధారణంగా చిన్నపిల్లలకు తరచూ దిష్టి తగులుతూ ఉంటుంది. పిల్లలు ముద్దుగా ఉండటం వల్ల ప్రతి ఒక్కరూ వారిని చూస్తూ ఉంటారు. అందువల్ల చిన్న పిల్లలకు ఎక్కువగా దిష్టి తగులుతూ ఉంటుంది.

అయితే ఇలా చిన్న పిల్లలకు దిష్టి తగలడం వల్ల వారు తరచూ అనారోగ్యం పాలవుతూ ఉంటారు. అందువల్ల భోగి పండుగ రోజున ఇలా భోగి పళ్ళు పోయటం వల్ల ఏడాది పాటు పిల్లలకు దిష్టి తగలకుండా ఉంటుంది. అంతేకాకుండా రేగి పండును అర్కఫలం అని కూడా అంటారు. ‘అర్కుడు’ అంటే సూర్యుడు. భోగి పండుగ వరుసటి రోజు నుంచి సూర్యుడు ఉత్తరాయణం వైపు మళ్లుతాడు. అందుకే సూర్యుని కరుణాకటాక్షాలు ఎల్లప్పుడు పిల్లలపై ఉండాలని భోగి పండుగ రోజున ఇలా 10 సంవత్సరాల లోపు పిల్లలకు భోగి పళ్ళు పోసే ఆచారం పూర్వకాలం నుండి ఇప్పటికీ కొనసాగుతోంది.