మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏదైనా ఒక శుభకార్యం చేయాలంటే ఎన్నో ఆచార సంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు. ఈ విధంగా హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహం కనుక జరిగితే ఈ వివాహ సమయంలో ఎన్నో పద్ధతులు పాటిస్తూ ఉంటారు.అయితే ప్రస్తుత కాలంలో ఇలాంటి ఆచార సంప్రదాయాలన్నీ ఒక్కొక్కటిగా కనుమరుగవుతూ వస్తున్నాయని చెప్పాలి. అయితే ఇప్పటికి పలు ప్రాంతాలలో వివాహ సమయంలో రోలు రోకలితో పాటు తిరగలని కూడా పూజిస్తూ ఉంటారు. ఇలా పూజించడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే…
పూర్వకాలంలో ఒక ఇంట్లో వివాహం నిశ్చయం అయింది అంటే పెళ్లికి కొన్ని నెలల ముందు నుంచి రోలులో బియ్యం దంచడం పసుపు దంచడం అలాగే పెళ్లిలో వంటలకు సరిపడే అన్ని ఆహార పదార్థాలను ముందుగానే దంచి సిద్ధం చేసి పెట్టుకునేవారు.అందుకే ఏ ఇంటిలో అయితే వివాహం జరుగుతుందో ఆ ఇంటిలో ముందుగా రోలు రోకలి తిరగలికి పూజ చేసి పెళ్లి పనులను ప్రారంభించే వారు.అయితే ఇప్పుడు అన్ని కూడా మనకు రెడీమేడ్ దొరకడంతో కొన్నిచోట్ల పెళ్లికి ఒక రోజు ముందు ఇలా రోలు రోకలి తిరగలికి సాంప్రదాయబద్ధంగా పూజలు చేస్తుంటారు.
పురాణాల ప్రకారం బలరాముడు నాగలితో భూమిని దున్ని పంటను పండించి రోకలితో దంచి ఆహారంగా తీసుకోవాలని చెప్పారు. రోలు లక్ష్మీదేవి, రోకలి నారాయణుడు, తిరుగలి శివుడు, దాని పిడి పార్వతి. ఇట్లు ఆయా అధిష్ఠాన దేవతలను పూజించడం వల్ల ధన ధాన్యాలతో పాటు సకల సంపదలు సుఖసంతోషాలు కలుగుతాయని భావిస్తారు. అందుకే పూర్వకాలంలో ఏదైనా శుభకార్యం జరిగితే రోలు రోకలిని పూజించేవారని తెలుస్తుంది.