మన భారత దేశంలో ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి. ఇలా ఒక ఆలయానికి ఒక్కో విశిష్టత ఒక్కో ప్రాధాన్యత కలిగి ఉంటుంది.కొన్ని ఆలయాలలో నిత్య పూజలు అభిషేకాలను జరుపుకొని 24 గంటలు భక్తులకు దర్శనం కల్పిస్తూ ఉండగా మరికొన్ని ఆలయాలు మాత్రం ఏడాదికి ఒకసారి లేదా కొన్ని ప్రత్యేకమైన రోజులలో మాత్రమే భక్తులకు దర్శనం ఇచ్చేలా ఆలయాలను తెరుస్తూ ఉంటారు.ఈ విధంగా ఏడాదిలో కేవలం కొన్ని గంటలు మాత్రమే భక్తులకు దర్శనం ఇచ్చే అమ్మవారి గురించి ఇక్కడ తెలుసుకుందాం…
చత్తీస్గడ్ లోని గారి జిల్లా కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో కొండపై నిరాయ్ మాత ఆలయం ఉంది. ఈ దేవాలయం ఏడాదిలో ఒకరోజు మాత్రమే తెరిచి కేవలం కొన్ని గంటల పాటు మాత్రమే అమ్మవారి దర్శనాన్ని భక్తులకు కల్పిస్తారు. కేవలం చైత్ర నవరాత్రి అంటే ఉగాది పండుగ ఉత్సవాల సమయంలో తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి 9 గంటల వరకు అమ్మవారి దర్శనాన్ని భక్తులకు కల్పిస్తారు.ఈ సమయంలో అమ్మవారిని దర్శించుకోవడం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలి వెళ్తారు.
ఇకపోతే ఈ ఆలయంలో కేవలం పురుషులకు మాత్రమే అనుమతి ఉంటుంది. మహిళలకు ఎలాంటి అనుమతి ఉండదు. ఇక ఈ ఆలయంలో అమ్మవారికి ఎలాంటి అభిషేకాలు ఉండవు కేవలం కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి ధూపం వేస్తే ఇక్కడ పూజ చేసినట్టే. ఇకపోతే ఈ ఆలయంలోకి మహిళలకు ప్రవేశం మాత్రమే కాదు స్వామివారి ప్రసాదాన్ని కూడా తీసుకోవడానికి వీలు లేదు. ఈ విధంగా స్వామి వారి ప్రసాదం ఎవరైనా తీసుకుంటే వారికి ఏదో ఒక కీడు జరుగుతుందని ఇక్కడ ప్రజలు విశ్వసిస్తారు.అందుకే ఇక్కడ అమ్మవారికి సమర్పించిన ప్రసాదం కానీ లేదా అమ్మవారి దర్శనం కోసం కానీ మహిళలు వెళ్లరు.