సంక్రాంతి స్పెష‌ల్ వంట‌కాలు వాటి ప్రాముఖ్య‌త‌…?

సంక్రాంతి అంటే ముత్యాల ముగ్గులే కాదు నోరూరించే పిండివంటలకూ ఈ పండుగ ప్రత్యేకత. సంక్రాంతి అంటే…ఊళ్లల్లో వారం ముందు నుంచే పిండి వంటల హడావిడి మొదలయ్యేది ఒకప్పుడు. ఊరంతా నెయ్యి వాసనతో గుబాళించేది. పండగ వంటలు చేయడంలో ఊరు ఊరంతా బిజీగా ఉండేది. ఒక ఇంట్లో అరిసెలు వండుతున్నారంటే చుట్టుప్ర‌క్క‌ల వాళ్ళు న‌లుగురు క‌లిసి వాళ్ళ‌కి సాయం చేసేవారు. పాకం చూడు వ‌దినా… బాగా కుదిరిందా అంటే.. మ‌రొక‌రు హాఇంకాస్త ముద‌రాలి ఎందుకంటే అరిసెల‌కు క‌దా అంటూ అంద‌రూ చ‌క్క‌గా మాట‌లు చెప్పుకుంటూ ఒక‌ప్పుడు చేసేవారు. అయితే గత కొన్నేళ్లుగా పిండి వంటలు స్వగృహాల్లో కాకుండా… ‘స్వగృహ ఫుడ్స్’లో తయారవుతున్నాయి. రెడీమేడ్ దుస్తులు, రెడీమేడ్ నగల్లాగే వీటిని కూడా రెడీమేడ్‌గా కొనుక్కుని ‘సంక్రాంతి’ జరుపుకుంటోంది నవతరం.

సంక్రాంతి పండుగకు వారం రోజుల ముందునుండే పిండివంటలు చేయడం మొదలెడుతారు. అరిసెలు, సకినాలు, మురుకులు, బొబ్బర్లు, పూర్ణాలు, పాకుండ‌లు, పొంగ‌డాలు ఇలా… పాకుండ‌లంటే చాలా మందికి తెల‌య‌వు. అంటే అరిసెల పిండిని ఉండ‌లా చుట్టి నూనెలో గ‌ట్టిగా వేయిస్తారు. దాన్ని పాకుండ‌లు అంటారు. ఇక పొంగ‌డాలు అంటే అదే పిండిలో కాస్త కొబ్బ‌రి తురుము వేసి గ‌ట్టిగా చేస్తారు వాటిని పొంగ‌డాలు అంటారు. ఈ పండుగ ప్రత్యేక వంటలు. ఉద్యోగాలు వ్యాపారాల పేర్లతో పల్లెలన్నీ పట్నాలకు తరలడంతో పిండివంటలు చేసేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. స్వగృహ పుడ్స్ అందుబాటులోకి రావడంతో పట్నం ప్రజలంతా సంక్రాతి పిండి వంటలను సులువుగా కొనేసుకుంటున్నారు. సంక్రాంతి పండుగ స్వీట్స్ కష్టం లేకుండా స్వగృహ పుడ్స్ పట్నం వాసులకు అందిస్తున్నాయి. సున్ని ఉండలు, అరిశెలు, జంతికలు, గులాబీ పువ్వులు, బూందీ ఉండలు, కజ్జికాయలు, పాకుండలు, పూతరేకులు, కారపు బూందీ అన్ని రకాల సంక్రాంతి పిండివంటలు మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చేశాయి.