ఇప్పట్లో దళితుల బహిష్కరణ, పరువు హత్యలు ఆగవా?

(సువర్ణ సంకసర్ల, మంచిర్యాల జిల్లా)

నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండంలోని మారంపల్లి గ్రామాభివృద్ధి కమిటీ ఆగడాలు మితిమీరిపోయాయి. ఆ గ్రామంలోని 80 దళిత కుటుంబాలను సాంఘిక బహిష్కరణ చేశారు గ్రామ అభివృద్ధి కమిటీ నాయకులు. ఈ విషయమై పోలీసులకు బాధిత దళితులు ఫిర్యాదు కూడా చేశారు. ఈ ఘటన చూసినా… నిన్నమొన్న కులాంతర వివాహాలు (అసలు కారణం కులం తక్కువ వాడిని చేసుకున్నారన్న కసి) చేసుకున్నందుకు సొంత బిడ్డలనే చంపుకుంటున్న మన సమాజం ఎటువైపు పయనిస్తున్నది?

భారత దేశం ఎంతో అభివృద్ధి చెందిన దేశం, అభివృద్ధి చెందుతున్న దేశం అని గొప్పగా చెప్పుకుంటున్నాము. ఎక్కడ ఉంది అభివృద్ధి. ఈ వార్త చూస్తే మనం ఇంకా ఎటువంటి సమాజంలో ఉంటున్నాము. ఎక్కడ అభివృద్ధి చెందింది అనిపిస్తుంది. 

నాడు బ్రిటిష్ కాలంలోనే మహిళలు మైల పడ్డారు అని కొంత మంది పెద్దలు చెప్పినప్పుడు, కొన్ని పుస్తకాలల్లో చదివినప్పుడు తెలుసుకున్నాము. ఎక్కడుంది మైల పడని కులం. వారి సంతతి వాళ్ళమే కదా అందరం. తక్కువ కులం అని వేరు చేసి చూస్తున్నారు కాబట్టే కదా. మేము మీకు తోడుగా ఉన్నాము అని మనలో ధైర్యాన్ని, నమ్మకాన్ని నింపి, మనతో పాటుగా నివసిస్తూ, మన బాగోగులు చూస్తున్నారు అని క్రిస్టియన్ వారు మిషనరీస్ రూపంలో కలిసిపోయారు.

అందుకోసమే మత మార్పిడి జరిగిందని కొన్ని పుస్తకాలలో రాసి పెట్టి ఉంది. హిందువు మరి మరొక హిందువు అయిన తక్కువ కులం వాడికి సహాయం చేయక పోగా… కాకుల్లా పొడుచుకు తింటుంటే ఇంకెన్నాళ్లు భరించేది…? ఎప్పటికి జరుగుతుంది ఈ కుల నిర్మూలన?

కులం తక్కువ వాళ్ళని ప్రేమించారు, పెళ్లిచేసుకున్నారు అని ప్రాణాలను సైతం తీస్తున్నారు. రాజకీయ నాయకులకు డబ్బు, పదవులు తప్ప ఇలాంటివి కనిపించడం లేదా…? ఈ కాలంలో కూడా ఇలాంటి వెలివేయబడిన దీన, నీచమైన పరిస్థితుల్లో ఉన్నామంటే ఇదేనా అభివృద్ధి చెందుతున్న మన భారత దేశం అనిపిస్తుంది.

అయ్యో…. అయ్యో…. అయ్యో….

ఏమిటి ఈ హత్యలు, ఎవరి కోసం, ఎం సాధించడం కోసం పసి మొగ్గలని చిదిమేస్తున్నారు. కడుపున పుట్టిన కన్న పిల్లల జీవితాలను బలి తీసుకుంటూ కాల యముడవుతున్నారు. ప్రేమించడమే వారు చేసిన నేరమా… తక్కువ కులం వారిని పెళ్లి చేసుకుని వారి బ్రతుకు వారు బ్రతకాలని మీకు దూరంగా బ్రతకడమే వారు చేసిన పాపమా… కులం అనే గజ్జిలో కొట్టుకుపోతూ పేగు బంధాన్ని చేతులారా బలితీసుకుంటున్నారు.

నీ రక్తాన్ని, పేగు ను చంపేసి నువ్వేమి సాదించావు. నీ కులం ఏమి సాధించింది. నీ బిడ్డల్ని చంపుకున్నందుకు నీ కులం నీకు సమాజంలో పెద్ద పీట వేసి కూర్చోబెట్టిందా? లేక అన్ని కులాలల్లో నీ కులమే గొప్ప అని గిన్నిస్ బుక్ లో నీ పేరు, నీ కులం పేరు ఏమైనా ఎక్కించారా? కులాలు అనేవి రాయకీయాలకు అతీతం కాదని మనుష్యులందరు ఒక్కటే అని ఎలక్షన్స్ ముందు బహిరంగ సభలలో మైకులల్లో డబ్బాలు కొట్టుకున్న నాయకులారా మీరేం చేస్తున్నారు.

అప్ డేట్ అవుతున్నామా మనం అసలు?

మీ పదవుల కోసం ఆరాటపడుతున్నారా? ప్రతీది అప్ డేట్ (update) అవుతుంది అని సంకలు గుద్దుకుంటున్నాము. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఎన్ని చట్టాలు వచ్చినా ఈ కుల హత్యలు ఆగడం లేదు. నాయకులారా ఇవి మీకు కనిపించడం లేదా? అధికారం కోసం అప్పుడు, అధికారం కాపాడుకోవడం కోసం ఇప్పుడు తాపత్రయ పడుతున్నారు. ఇక్కడ ఎక్కడ అప్ డేట్ (update) అయింది.

కులం కోసం కన్న వాళ్ళను, వారు ప్రేమించిన వారిని చంపడం లో అభివృద్ధి అయిందా? కులం కులం అని మొత్తుకునే కుల పిచ్చి సమాజమా నాడు బ్రిటీష్ కాలంలో ఏ ఒక్క ఆడదాన్ని వదలలేదు అని రాసిన, చెప్పిన మన పెద్దల మాటలు, రాతలు విస్మరించారా ? మనందరము మైల పడిన పూర్వీకుల నుండే వచ్చాము. ఇంకెక్కడ ఉంది మైల పడని కులం? ఈ కుల పిచ్చిలో కన్న పిల్లలని సైతం బలి తీసుకుంటున్నారు. పిల్లలు సంతోషంగా ఉంటే చంపేసిన మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు.

కుల సంఘాల నాయకులారా! మీ కులాల మీటింగ్ లలో తక్కువ కులం వాళ్ళ పిల్లలు ప్రేమిస్తే, పెళ్లి చేసుకుంటే వారు ప్రేమించిన వారిని చంపమని చెప్తున్నారా? ప్రతీ మతంలో ఒకరినొకరు ప్రేమించుకోవాలి, జీవ హింస చేయకూడదు అని చెప్తారు. దేవుళ్ళకు లేని కుల పిచ్చి మనుషులమైన మనకెందుకు…? ఆలోచించండి.

నాడు మిర్యాలగూడలో అమృత, ప్రణయ్ లు తండ్రిని కావాలనే రెచ్చగొడుతూ వీడియో సాంగ్స్, పార్టీలు చేసుకున్నారు అని అక్కడ నేను తండ్రికి కోపం వచ్చి చేసాడు అనుకున్నాము. కానీ మొన్నటికి మొన్న మంచిర్యాల జిల్లా లో అనురాధ ని అత్యంత కిరాతకంగా చంపి, పెట్రోలు పోసి తగలబెట్టి, బూడిదను చెరువులో కలిపేశారు. ఆమెకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు.

ఎర్రగడ్డలో కులం తక్కువ వాడిని ప్రేమించిందని మనోహరాచారి తన బిడ్డనే చంపుకోవాలని చూశాడు. నెల్లూరు జిల్లాలో యాదయ్య అనే తండ్రి అందరూ చూస్తుండగానే కత్తితో తన కూతురు దేవయాని పైన దాడి చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నవి. ఒక్కసారి ఆలోచించండి అందరం సంకరజాతి ప్రజలమే ఎందుకు ఈ కుల పిచ్చి?  ప్రేమించి, కలిసి బ్రతుకుదామనుకునే మనం అల్లారు ముద్దుగా పెంచుకున్న మన వారసత్వాన్ని మనము మొగ్గలోనే తుంచివేయడం న్యాయమా? మనుషులుగా పుట్టిన మనమంతా ఆలోచిద్దాం.