పూర్వంలో అమ్మాయికి పెళ్లి చేయాలంటే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసి పెళ్లిళ్లు చేసేవారు. కానీ ఈ రోజుల్లో మాత్రం ఆడపిల్లల తల్లిదండ్రులు చాలా సులువుగా మోసపోతున్నారు. తమ పిల్లల భవిషత్తు బాగుండాలని కోట్ల రూపాయలు కట్నం ఇచ్చి మరీ ఎన్నారై సంబంధాలు తెచ్చి పెళ్లిళ్లు చేస్తున్నారు. అయితే కొంతమంది వ్యక్తులు మాత్రం పెళ్లిని కూడా ఒక వ్యాపారంగా భావించి అదనపు కట్నం కోసం మహిళలను వేధింపులకు గురి చేస్తున్నారు. అంతేకాకుండా మరి కొంతమంది యువకులు ఇక్కడ పెళ్లి చేసుకొని విదేశాలలో ఉంటూ భార్యకు తెలియకుండా వేరొకరితో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, లేదా భార్యని ఇక్కడ వదిలేసి అక్కడ వేరే మహిళలను వివాహం చేసుకోవడం చేస్తున్నారు. తాజాగా ఇటువంటి ఘటన గుంటూరులో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే…పల్నాడు జిల్లా క్రోసూరు మండలం అందుకూరు గ్రామానికి చెందిన సతీష్‌బాబు అనే వ్యక్తి అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇదివరకే వివాహమైన అతను తన భార్యకు విడాకులు ఇచ్చానని నమ్మించి గుంటూరు రవీంద్ర నగర్ కు చెందిన మహిళను ఈ సంవత్సరం జూన్ 16వ తేదీన వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత తన భార్యతో కలిసి హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీలో కాపురం పెట్టాడు. వివాహమైన కొంతకాలానికే సతీష్ బాబు ఇంటి నిర్మాణం కోసం 20 లక్షల రూపాయలు తీసుకురమ్మని భార్యపై ఒత్తిడి చేశాడు. డబ్బులు తీసుకురాని పక్షంలో బెడ్ రూమ్ లో తీసిన ఆమె నగ్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెట్టి డబ్బులు సంపాదిస్తానంటూ ఆమెను బెదిరింపులకు గురిచేసాడు. భర్త పెట్టే టార్చర్ భరించలేక ఆ మహిళ బెంగుళూరు వెళ్లి ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది.
అయితే సతీష్ బాబు అక్కడికి కూడా వెళ్లి ఆమెను వేధించేవాడు. ఒకరోజు ఆమె తన ఫోటోల కోసం సతీష్ బాబు ఫోన్ పరిశీలించగా.. గతంలోనే అతనికి నాలుగు పెళ్లిళ్లు జరిగినట్లు గుర్తించింది. దీంతో ఆ మహిళ గుంటూరు డీఐజీ తివిక్రమ వర్మకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న దిశ పోలీసులు దర్యాప్తు చేయగా.. సతీష్ బాబు 2005 లో మొదటి వివాహం చేసుకోగా.. 2014లో అమెరికాకు చెందిన ఒక యువతిని వివాహం చేసుకున్నాడు. ఆమెకి విడాకులు ఇచ్చి తర్వాత 2017లో మూడవ వివాహం చేసుకున్నాడు. 2019లో నాలుగవ వివాహ చేసుకున్న సతీష్ బాబు ఆమెను కూడా వేధించటంతో ఆమె సతీష్ బాబు పై గుంటూరులో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఆమెతో విడాకులు తీసుకోకుండానే ఆ విషయం దాచి పెట్టి సతీష్ బాబు 2022లో గుంటూరుకు చెందిన మరొక మహిళను ఐదవ వివాహం చేసుకున్నడని తేలింది. సతీష్ బాబు 5 పెళ్లిళ్ల వెనుక తమ తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా ఉందని తెలియడంతో పోలీసులు సతీష్ బాబుతో పాటు అతని తండ్రిని కూడా అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరిచినట్లు పోలీసులు వెల్లడించారు.