(సుగుణాకర్ రెడ్డి)
ఉదయం 11 గంటలకి లగ్గం. పెళ్లి పిల్ల బంధువులు పెళ్లి పిల్లగాడిని తీసుకొచ్చేందుకు వాళ్ళ ఊరు వెళ్లారు. పిల్లగాడిని తీసుకొని ఇంకో 5 కిలోమీటర్లు వెళితే పెళ్లి మండపం చేరుకుంటరు. ఇక్కడే అసలు ట్విస్ట్ జరిగింది. పెళ్లి పిల్లగాడు కార్ ఆపి దిగి పత్తా లేకుండా పారి పోయిండు. ఏం చేద్దాం అని అయోమయ స్థితి లో ఉన్న పిల్ల తరుపు బంధువులకు … అనుకోకుండా ఒక యువకుడి ఆదర్శ నిర్ణయం తో అంత ఊపిరి పీల్చుకున్నారు. పెళ్లి పిల్లగాడు పరార్ కావడం తో ఆగిన పెళ్లికి ముందుకొచ్చి ఓ యువకుడు పెళ్లి పిల్ల మేడలో తాళి కట్టాడు. ఇదంతా సినిమాల్లో ఎన్నో చూసి ఉన్నాం కాబట్టి ఇది ఏ సినిమా స్టోరీనో అనుకుంటున్నారు కదా? కానీ కాదు. ఇది నిజం. నిజ జీవితంలో జరిగిన సత్యం. ఎక్కడ ఏంటి అని అనుమానం ఉందా? చదవండి ఫుల్ స్టోరీ.
శనివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామం లో సినిమా లలో చూసే అరుదయిన పెళ్లి జరిగింది. పొట్లపల్లి గ్రామానికి చెందిన కోలా రాజలింగ, భూలక్ష్మి దంపతులు తమ కుమార్తె ను తన మేనత్త కొడుకు చిగురు మామిడి మండలం చిన్న ముల్కనూర్ గ్రామానికి చెందిన పందిపెళ్లి శ్రీనివాస్ కి ఇచ్చి చేయడానికి పెళ్లి ఫిక్స్ చేశారు. శ్రీనివాస్ కరీం నగర్ లో ఓ ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తున్నాడు. అయితే ఇక్కడ పనిచేస్తున్న క్రమం లో నుస్తులాపూర్ కి చెందిన మరో అమ్మాయి తో ప్రేమలో పడ్డాడు శ్రీనివాస్.
పిల్ల తల్లిదండ్రులకు శ్రీనివాస్ లవ్ యవ్వారం తెలిసింది. ప్రేమలో ఉన్న పిలగాన్ని ఇబ్బంది పెట్టుడు ఎందుకులే అనుకున్నరు. అందుకే తమ కుమార్తెను అదే గ్రామానికి చెందిన పందిపెల్లి రమేష్ అనే యువకుడికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నారు. కానీ శ్రీనివాస్ తల్లి అడ్డం పడ్డది. తన కొడుక్కి ఇచ్చి చేయాల్సిందే అని పట్టుపట్టింది. ఎవలు చెప్పినా వినలేదు. దీంతో మల్లా మనసు మార్చుకున్న పిల్ల తల్లిదండ్రులు రమేష్ ని కాదని శ్రీనివాస్ తో పెళ్లి పెట్టుకున్నారు.
పారిపోయిన పెళ్లి కొడుకు శ్రీనివాస్ ఏం చేసిండో తెలుసా ?
అచ్చం సినిమా లలో జరిగినట్లుగా పెళ్లి పీటల మీదకు వచ్చే సమయం లో శ్రీనివాస్ జంప్ అయిండు. అంతేకాదు నుస్తులాపూర్ గ్రామానికి చెందిన తను ప్రేమించిన అమ్మాయి వద్దకు వెళ్లి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అంతేకాదు తమ రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించాడు. తను వేరే అమ్మాయిని ప్రేమించానని చెప్పినా వినకుండా తన కుటుంబపెద్దలు బలవంతంగా పెళ్లి చేసే ప్రయత్నం చేశారని శ్రీనివాస్ లబోదిబోమంటున్నాడు. అందుకోసమే తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకే అక్కడి నుంచి పారిపోవాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. మేనరికం ఇష్టం లేదని చెప్పినా వినలేదన్నాడు. అందుకే ఈ ప్రయత్నం చేయాల్సి వచ్చిందన్నారు. ఇందులో మోసం చేయాలన్న యావ తనకు ఏమాత్రం లేదని శ్రీనివాస్ చెప్పారు.
శ్రీనివాస్ వేరే పెళ్లి చేసుకోవడంతో ఆగిన రాజలింగ కూతురు పెళ్లిని అదే చిన్న ముల్కనూర్ కి చెందిన పందిపెల్లి రమేష్ తో జరిపించేశారు. రాజలింగ దంపతులు రమేష్ వద్దకు వెళ్లి రిక్వెస్టు చేయగానే ఉన్నతమైన మనసుతో రమేష్ అంగీకరించాడు. దీంతో అదే వేదిక పైన పెళ్లి కానిచ్చారు, రమేష్ పెద్ద మనుసు తో ముందుకు వచ్చి పెళ్లి చేసుకోవడం తో పెళ్లి పిల్ల తో పాటు తల్లి దండ్రుల ముఖం లో ఆనందం నింండింది. రమేష్ ను బంధువులు ప్రశంసలతో ముంచెత్తారు.
ఇలా రెండు పెళ్లిళ్లు ఒకే దెబ్బకు జరిగిపోయాయి. రెండు జంటలు హ్యాప్పీగానే ఉన్నాయి.