మృతదేహానికి వైద్యం చేసి 10 లక్షలు వసూలు చేసిన కేర్ హాస్పిటల్

వైద్య వృత్తికే కళంకం తెచ్చే పని చేసింది బంజారాహిల్స్ కేర్ హాస్పిటల్ యాజమాన్యం, మృతదేహానికి చికిత్స చేసి 10 లక్షలు వసూలు చేశారని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. రోగి చనిపోయాడని తమకు చెప్పలేదంటూ, డబ్బుల కోసం ఇలాంటి నీచానికి ఒడిగట్టారంటూ హాస్పిటల్ వద్ద ఆందోళనకు దిగారు మృతుని బంధువులు.

20 రోజుల క్రితం ఒక వ్యక్తి తీవ్రమైన జ్వరంతో కేర్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు. అన్ని టెస్టులు చేసిన వైద్యులు పేషేంట్ కండిషన్ ఎలా ఉందొ మాత్రం బంధువులకు చెప్పలేదు. ఆదివారం నుండి అపస్మారక స్థితిలోనే ఉన్న తమకు కనీస సమాచారం కూడా ఇవ్వలేదని వారు ఆరోపిస్తున్నారు. నిన్న సాయంత్రమే రోగి చనిపోయాడని అనుమానిస్తున్నారు బంధువులు.

హాస్పిటల్ బిల్ కట్టించుకునేందుకే యాజమాన్యం ఇంకా రోగికి చికిత్స చేస్తున్నట్లు నటిస్తుందని చెబుతున్నారు. ఐసీయూ లోకి మమ్మల్ని అనుమతించలేదు. మూడు రోజుల క్రితం చూస్తే ఆయన శ్వాస అందక చాలా ఇబ్బంది పడుతున్నాడు, బ్లడ్ ఎక్కిస్తున్నారు. ఏం జరిగింది అని అడిగితే డాక్టర్స్, సిబ్బంది ఎవరూ సమాధానం ఇవ్వలేదు. ఐసీయూ లోకి అనుమతించకుండా ట్రీట్మెంట్ చేస్తుండటంతో అనుమానం వచ్చి ఈరోజు బలవంతంగా లోపలి వెళ్లగా శరీరం కుళ్లిపోయిన వాసన వచ్చింది అని వెల్లడించారు మృతుని తరపు బంధువులు.

ఇప్పటి వరకు తమ దగ్గర నుండి 10 లక్షలు వసూలు చేశారని, రూమ్ లో ఉన్నప్పుడు బాగున్నా వ్యక్తిని ఐసీయూ లో పెట్టి ఇష్టం వాచినట్టు ట్రీట్మెంట్ చేసి బలిగొన్నారంటూ తీవ్రంగా రోదిస్తున్నారు బంధువులు. ప్రస్తుతం కేర్ హాస్పిటల్ వద్ద ఆందోళన చేపట్టారు.