ప్రస్తుతం సమాజంలో అమ్మాయిలు ఏ విధంగా మోసపోతున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రోజూ ఇలాంటివి ఎన్ని మోసాలు జరుగుతున్నా కూడా అమ్మాయిలు మాత్రం అబ్బాయిలను ఏదో ఒక విషయంలో నమ్ముతూ మోసపోతూనే ఉన్నారు. ప్రేమిస్తామంటారు చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తారు తరువాత పెళ్ళి విషయం వచ్చేసరికి సైలెంట్ అయిపోతారు. ఇవన్నీ ఇటీవల చాలా కామన్‌గా మారాయి. ఇటీవలె అలాంటి ఘటనే ఒకటి హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.
‘‘కులాలు వేరైనా మనద్దిరం ఒకటే.. ఇద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నాం.. మా అమ్మానాన్నలు మన పెళ్లికి ఒప్పుకున్నారు. .. ఎల్లుండి ప్యారడైజ్ కన్వెన్షన్‌లో పెళ్లి.. నా పేరుమీద బుక్ చేశాను..ఉదయాన్నే మీ తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులతో కలిసి అక్కడికి వచ్చేయండి.. పెళ్లయ్యాక ఇద్దరమే ముంబయి, దిల్లీకి వెళ్దాం… మా అమ్మ తన నగలన్నీ నీకే ఇచ్చేస్తానంది’ అంటూ ప్రియుడు ఫోన్ చేసి చెప్పడంతో ఆ యువతి మురిసిపోయింది. అతడి మాటలు నమ్మి సికింద్రాబాద్ ప్యారడైజ్ కన్వెన్షన్‌కు కోటి ఆశలతో వెళ్లిన ఆమె షాకైంది. అక్కడ ఎలాంటి ఏర్పాట్లు లేకపోవడంతో నిర్వాహకులను సంప్రదించగా పెళ్లి లేదు… నిశ్చితార్థం లేదు… వెళ్లండి అంటూ చెప్పారు.
దీంతో ఆ అమ్మాయి అక్కడి నుంచే ప్రియుడికి ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. దాంతో ఆమె మోసపోయానని తెలుసుకుంది. వెంటనే పోలీసులను ఆశ్రయించి జరిగిందంతా చెప్పింది. సికింద్రా బాద్‌లో ఉంటున్న యువతి బేగంపేటలోని ఓ ఎంఎన్సీ కంపెనీలో ఐటీ విభాగంలో నాలుగేళ్లుగా పనిచేస్తోంది. మాసాబ్‌ట్యాంక్‌లోని శాంతినగర్‌లో ఉండే ప్రవీణ్ మూడేళ్ల నుంచి అక్కడే పనిచేస్తున్నాడు. రెండున్నరేళ్ల క్రితం ప్రవీణ్‌ను కూడా ఐటీ విభాగానికి మార్చడంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. కులాలు వేరైనా పెళ్లికి తన తల్లిదండ్రులను ఒప్పిస్తానని చెప్పడంతో యువతి అతడితో సహజీవనం మొదలుపెట్టింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.