దిశ హత్య కేసు లో నిందితులైన నలుగురు నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గుడిగండ్ల, జక్లెర్ గ్రామాలకు చెందినవారు. నిందితులు ఎన్ కౌంటర్ లో చనిపోవడంతో పోలీసులు ఈ రెండు గ్రామాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. నిందితుల ఇళ్ల వద్ద ప్రత్యేక నిఘా ఉంచారు. తమవాళ్లంతా చనిపోయినట్లు తెలియడంతో నిందితుల కుటుం బీకుల ఆర్తనాదాలు మిన్నంటాయి. నిందితుల శవాలను పూడ్చేందుకు జక్లేర్, గుడిగండ్ల గ్రామాల్లో గుంతలు తీయడానికి ప్రజలెవరూ ముందుకు రాలేదు. దీంతో పోలీసులు జేసీబీని తెప్పించి గుంతలను తవ్వించారు. అయితే పొలం యజమాని ఇక్కడ పూడ్చడానికి వీలులేదని తవ్విన గుంతలను పూడ్చేపించాడు.
దీంతో పోలీసులు మళ్లీ జేసీబీని పిలిపించి వేరే స్థలంలో గుంతలను తవ్వించారు. వనపర్తి జిల్లా ఎస్పీ అపూర్వరావు శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో జక్లేర్, గుడిగండ్ల గ్రామాలకు చేరుకుని పరిస్థితి సమీక్షించారు. నిందితుల కుటుంబసభ్యులను హాస్పిటల్ కు తీసుకువెళ్లేందుకు ప్రయత్నించగా మొదట నిరాకరించారు. ఎస్పీ అపూర్వరావు గ్రామస్థులు, కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని ఒప్పించారు. పోలీసు వాహనాల్లో ఎక్కించుకుని పోస్టుమార్టం చేస్తున్న ఆస్పత్రికి తరలించారు. రెండు గ్రామాల్లో పోలీసు బలగాలు పెద్దఎత్తున మోహరించడంతో గ్రామాల్లోని ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు.
బంధువులు ఎక్కువగా రాకపోవడం, మృతుల ఇళ్ల దగ్గర కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే ఉండటంతో ఎలాంటి రోదనలు లేకుండా ప్రశాంతంగా ఉంది. నిందితుల మృతదేహాలను సాయంత్రం మహబూబ్ నగర్ ఆస్పత్రికి తరలించారు. అంతకుముందే నిందితుల బంధువులను ఆస్పత్రికి రప్పించిన పోలీసులు.. వారిముందే మృతదేహాలను మార్చురీకి తరలించారు.
దిశ నిందితుల్లో ఒకరైన చేన్న కేశవులు భార్య రేణుక సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో అంతరాష్ట్ర రహదారి ఎన్ హెచ్ 167పై బైఠాయించారు. పోలీసులు పోస్టుమార్టం తర్వాత తన భర్త చెన్నకేశవులు శవాన్ని తమకు అప్పజెప్పకుండా నేరుగా శ్మశానవాటికకే తీసుకుపోతున్నారనే సమాచారంతో ఆందోళనకు దిగారు. తన భర్తను కడసారి చూపు చూసేందుకు అవకాశం కల్పించాలని, లేకుంటే రోడ్డుపైనే ఆత్మహత్య చేసుకుంటానని అన్నారు. ఆమె భర్త శవాన్ని కుటుంబసభ్యులకు అప్పగిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో శాంతించింది.