విజయ్ దేవరకొండ ఆఫర్ తన్నుకుపోయాడు?

విజయ్ దేవకొండ, దుల్కర్ సల్మాన్ కలిసి మహానటి సినిమాలో చేసారు. ఇద్దరూ ఆ సినిమాలో పోటీ పడి నటించారు. ఇప్పుడు దుల్కర్ సల్మాన్..విజయ్ దేవరకొండ ఆఫర్ కొట్టుకుపోయినట్లు సమాచారం. అది కూడా బాలీవుడ్ ఆఫర్..జాన్వీతో . పూర్తి వివరాల్లోకి వెళితే…

శ్రీదేవి కుమార్తె జాన్వి కపూర్ చేసింది ఒక సినిమానే కానీ..ఆమెకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. దాంతో యంగ్ హీరోలంతా ఆమెతో నటించాలని ఉత్సాహం చూపిస్తున్నారు. తాజాగా ఆమె విజయదేవకొండతో నటించాలని ఉందని చెప్పింది. దాంతో త్వరలో కరణ్ జోహార్ నిర్మాణం లో రూపొందే సినిమాలో ఆమెతో జతకడతాడు అనుకున్నారంతా. ఈలోగా దుల్కర్ సల్మాన్ సీన్ లోకి వచ్చేసారు. దుల్కర్‌ సల్మాన్‌, జాన్వి కపూర్‌ కలసి నటించబోతున్నట్లు తెలుస్తోంది.

తొలి మహిళా ఐఏఎఫ్‌ పైలట్‌ గుంజన్‌ సక్సేనా జీవితాధారంగా జాన్వి ఓ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా గురించి చర్చించడానికి జాన్వి గుంజన్‌ను కూడా కలిశారు. అయితే ఈ సినిమాలో జాన్వికి జోడీగా దుల్కర్‌ నటిస్తున్నట్లు తాజాగా వినిపిస్తున్న బాలీవుడ్ టాక్‌. కరణ్ జోహార్ కి చెందిన ధర్మ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో జాన్వి గుంజన్‌ పాత్రలో నటించనున్నారట.

ఐఏఎఫ్‌ విమానం నడిపిన తొలి భారతీయ మహిళ గుంజన్‌. 1999 కార్గిల్‌ యుద్ధంలో గాయాలపాలైన సైనికులను గుంజన్‌ తన విమానంలో ఎక్కించుకుని సురక్షిత ప్రాంతానికి తరలించి అందరి మన్ననలు పొందారు. అందుకే ఆమె జీవితాధారంగా సినిమా తీయాలని కరణ్‌ భావించారట.

మరో పక్క జాన్వి ‘తఖ్త్‌’ అనే చారిత్రక చిత్రంలో నటించే అవకాశం దక్కించుకున్నారు. చిత్రీకరణ వచ్చే ఏడాది సెప్టెంబర్‌ నుంచి ప్రారంభం కానుంది. ఇందులో జాన్వితో పాటు ఆలియా భట్‌, రణ్‌వీర్‌ సింగ్‌, విక్కీ కౌశల్‌, కరీనా కపూర్‌, భూమి పెడ్నేకర్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ఇక ఈ వార్తే నిజమైతే హిందీలో దుల్కర్‌ నటించే మూడో చిత్రం ఇది అవుతుంది. ఇప్పటికే ‘కర్వా’, ‘జోయా ఫ్యాక్టర్‌’ చిత్రాల్లో దుల్కర్‌ నటించారు.