దివిసీమ ఉప్పెన పెను విషాదం

41 సంవత్సరాలనాటి సంగతి స్మృతి .

1977 నవంబర్ 19న ఉప్పెన దివిసీమను కమ్మేసింది ,కుదిపేసింది ఎందరో ప్రజల ప్రాణాలను కబళించింది . ప్రకృతి ప్రతాపం ఎలావుంటుందో మనిషికి చూపించింది . ఇళ్ళు కూలిపోయాయి , చెట్లు రాలిపోయాయి , సముద్రం పొంగి నేలను ఆక్రమించింది . మనుషులు ,అమాయక జంతువులు కూడా నీటిలో కొట్టుకుపోయాయి . కారు చీకటి , కరాళ రాత్రి , హా హా కారాలు, ఆర్తనాదాలు మిన్నుముట్టాయి , ఆక్రందనలు ఆ హోరు గాలిలో కలసి పోయాయి , వేలాదిమంది ప్రాణాలు ప్రకృతిలో మమేకమయ్యాయి .

అదొక విషాద ఘట్టం , అనిర్వచనీయమైన మానవ మారణ హోమం . ఆ పెను విషాదం అందరినీ కదిలించింది , కన్నీళ్లు పెట్టించింది . దీనిపై కవులూ స్పందించారు . అది “ఉప్పెన “గా వచ్చింది . దివిసీమ ఉప్పెనపై వంశీవారు ప్రచురించిన కవితా సంకలనం “ఉప్పెన ” .మా గురువువు ఆచార్య తిరుమలగారు దీనికి సంపాదకుడు .

ఈ కవితా సంకలనంలో డాక్టర్ దాశరధి , ఆచార్య దివాకర్ల వెంకటావధాని, డాక్టర్ బోయి భీమన్న, డాక్టర్ సి .నారాయణ రెడ్డి , వేలూరి సహజానంద , డాక్టర్ ముకురాల రామారెడ్డి , డాక్టర్ గుంటూరు శేషేంద్ర శర్మ, ఎల్లోరా , ఆచార్య తిరుమల , శార్వరి , సి .కనకాబర రాజు , కె .వి .భాస్కర రావు , రావూరు వెంకట సత్యనారాయణ , ఎల్ .మాలకొండయ్య , శాంతి స్వరూప్ , ఇందిరా ధనరాజ్ గిర్ , డాక్టర్ అంతటి నరసింహం, డాక్టర్ జె .బాపురెడ్డి , శశిధర్ , డాక్టర్ నాయని కృష్ణ కుమారి , జీడిగుంట రామ చంద్ర మూర్తి, అరిపిరాల విశ్వం, పి .ఎస్ .గోపాలకృష్ణ , డాక్టర్ జి .వి సుబ్రహ్మణ్యం , బి ఎన్ . రెడ్డి , ఎమ్ .కె .రాము ,పోతుకూచి సాంబశివ రావు , పోలూరి లక్ష్మి నరసింహ మూర్తి , వంశీ సాయి భాస్కర్, రామకృష్ణ చంద్ర మౌళి, భగీరథ, జ్యోతిర్మయి , పద్మిని చిత్తరంజన్ , శారదా అశోకవర్ధన్ , లక్ష్మీరమణ ,ప్రయాగ వేదవతి , ప్రభావతి , గండికోట సోమయాజులు , తెన్నేటి సుధా రామరాజు .

ఈ కవితా సంకలనాన్ని 14 జనవరి 1978న హైదరాబాద్ రవీద్ర భారతిలో ఆవిష్కరించారు . నేటికీ 41 సంవత్సరాలు .
ఇంతమంది కవులు , కవయిత్రుల తో రాయించిన మా గురువు ఆచార్య తిరుమల కృషి అనన్య సామాన్యం . వంశీ రామరాజు దీనిని పబ్లిష్ చేశారు .

ఈ సంకలనంలో సంక్రాంతి నుద్దేశించి నేను రాసిన “నిరాకృతి ” అన్న కవిత మహామాహులతో పాటు ప్రచురితమైంది .
ఆనాటి కవి సమ్మేళనంలో నేను కూడా పాల్గొన్నాను . ఆ ఉప్పెన అనే విషాద స్మృతి తెలుగు జాతిమీద చెరగని ముద్ర వేసింది .
-భగీరథ