పద్మభూషణ్ కృష్ణ మే 31న 77 వ సంవత్సరం లో ప్రవేశించారు. గత సంవత్సరం జూన్ 27న శ్రీమతి విజయనిర్మల మరణించారు. ఆ దుఃఖం నుంచి కృష్ణ ఇంకా కోలుకోలేదు. వారిది 50 సంవత్సరాల అనుబంధం. కృష్ణ అండతో విజయ నిర్మల , విజయ నిర్మల ప్రోత్సాహంతో కృష్ణ తెలుగు సినిమా రంగంలో తమదైన ముద్రవేసుకున్నారు. అందుకే కృష్ణ, విజయ నిర్మల ఎడబాటును తట్టుకోలేకపోయారు. ఈ సంవత్సరం ఆయన పుట్టిన రోజు వేడుకలను చేసుకులేదు. కృష్ణ గారితో జర్నలిస్టు గా నాకు నాలుగు దశాబ్దాలుగా పరిచయం వుంది. ఆయన్ని చాలా దగ్గరగా చూశాను కాబట్టే .. కృష్ణ సూపర్ స్టార్ గా ఎదగడానికి..నేపధ్యం వివరిస్తాను .
1943 మే 31న తెనాలిలో ఒక సామాన్యమైన రైతు కుటుంబంలో జన్మించిన ఘట్టమనేని శివరామ కృష్ణ డిగ్రీ చదివిన తరువాత 1961లో 18వ ఏటనే తల్లి నాగరత్నమ్మ , తండ్రి రాఘవయ్య చౌదరి ఇందిరతో వివాహం చేశారు. అయితే అప్పటికే కృష్ణలో సినిమా నటుడు కావాలన్న కోరిక బలంగా ఉండేది. అందుకే 1962లో రంగుల కలల్లో తేలిపోతూ సినిమా రంగంలో ప్రవేశించారు. తమ ప్రాంతం నుంచి వెళ్లిన గుమ్మడి వెంకటేశ్వర రావు , కొంగర జగ్గయ్య సాయంతో “పదండి ముందుకు” , “కులగోత్రాలు” , “పరువు ప్రతిష్ఠ” సినిమాల్లో చిన్న వేషాలు వచ్చాయి. కానీ కృష్ణ కు సంతృప్తి అనిపించలేదు. నటుడుగా రాణిస్తానన్న నమ్మకం కలగలేదు. అందుకే మద్రాస్ నగరం వదిలి పెట్టి తెనాలి వచ్చాడు. 1964లో ఆదుర్తి సుబ్బారావు అంతా కొత్తవారితో తీసున్న సినిమాలో నటించడానికి ఫోటోలు పంపించాడు. అదే కృష్ణ జీవితాన్ని మలుపుతిప్పింది. ఆ సినిమా పేరు “తేనే మనసులు”. ఆ సినిమా విజయవంతం అయ్యింది. ఆ వెంటనే ఆదుర్తి సుబ్బారావు గారే “కన్నె మనసులు” సినిమాలో మరో అవకాశం ఇచ్చారు ,ఆ వెంటనే డూండీశ్వర రావు “గూఢచారి 116” సినిమాలో బుక్ చేశారు. 1967లో బి .విఠలాచార్య “ఇద్దరు మొనగాళ్లు” సినిమాలో మరో అవకాశం ఇచ్చారు .
అదే సంవత్సరం ప్రసిద్ధ చిత్రకారుడు బాపు “సాక్షి ” అనే సినిమాలో కృష్ణను,విజయ నిర్మలను జంటగా తీసుకున్నారు. అలాగే విజయ నిర్మల బాల తారగా సినిమా రంగంలో ప్రవేశించి 1966లో బి .ఎన్ .రెడ్డి దర్శకత్వం వహించిన “రంగుల రాట్నం ” సినిమాతో హీరోయిన్ అయ్యింది. ఆ తరువాత నిర్మాత ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో దుక్కిపాటి మధుసూదన రావు రూపొందించిన “పూలరంగడు సినిమాలో విజయ నిర్మలకు అవకాశం వచ్చింది. అప్పటికే విజయ నిర్మలకు వివాహమై నరేష్ అనే ఓ కుమారుడు కూడా వున్నాడు. 1965లో కృష్ణకు ఇందిరకు రమేష్ బాబు జన్మించాడు. ఆయినా వారిద్దరి వివాహ బంధం దూరంగా వుంచలేకపోయింది. “సాక్షి” సినిమా షూటింగ్ లో ఇద్దరూ ఒకరిపట్ల మరొకరు ఆకర్షితులయ్యారు. “సాక్షి” సినిమాలో కృష్ణ విజయ నిర్మల ప్రేమకు బీజం పడింది. ఇద్దరూ వివాహితులే అన్న స్పృహ వారిలో వుంది. అయినా వారిద్దరూ ఒకటి కావాలనుకున్నారు . సినిమా రంగంలో కలసి ప్రయాణిస్తూ విజయాలను సాధించాలనుకున్నారు. విజయ నిర్మల భర్త కృష్ణ మూర్తికి విడాకులు ఇచ్చింది. ఇద్దరు కృష్ణ మూర్తికి ఆర్ధికంగా కూడా సహాయం చేశారు. ఇక కృష్ణ తన భార్య ఇందిరకు విడాకులు ఇవ్వకుండానే ఆమెను ,తల్లితండ్రులను ఒప్పించి 1969లో తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వివాహం చేసుకున్నారు
ఒక సామాన్యమైన నటుడు కృష్ణ అసామాన్యంగా ఎదగడానికి , సూపర్ స్టార్ గారు పేరు సంపాదించడానికి , సాహసాలకు మారు పేరుగా నిలబడటానికి కారణం భార్య విజయ నిర్మల , సోదరులు హనుమంతరావు , ఆదిశేషగిరి రావు. అప్పటికే సినిమా రంగాన్ని బాగా అవగాహన చేసుకున్న కృష్ణ. ఆ ముగ్గురు తన విజయాలుకు దోహదం చేస్తారని నమ్మాడు. అందుకే 1971లో ఇద్దరు సోదరులను మద్రాస్ కు రప్పించుకొని “పద్మాలయ ” ఫిలిమ్స్ సంస్థను ప్రారంభించారడు. పద్మావతి కృష్ణ కు మొదటి బిడ్డ. విజయ నిర్మలను వివాహం చేసుకున్న సంవత్సరమే పద్మావతి జన్మించింది . అందుకే తన కుమార్తె పేరుతో స్వంత నిర్మాణ సంస్థను హైద్రాబాద్లో పద్మాలయ స్టూడియోస్ ను ప్రారంభించి “మోసగాళ్లకు మోసగాడు ” సినిమా ను రూపొందించాడు. అలా కృష్ణ తెలుగు సినిమాలో తన బలగం తో బలాన్ని పెంచుకున్నాడు .
సినిమాలకు సంబందించిన సూచనలు , సలహాలు విజయ నిర్మల ఇచ్చేది. సినిమా నిర్మాణ వ్యవహారాలు హనుమత రావు , పాలనా ఆర్ధిక వ్యవహారాలను ఆదిశేషగిరి రావు చూసుకునేవారు. తమ్ముళ్ల అండ తో విజయ నిర్మల ప్రోత్సాహంతో కృష్ణ దూసుకుపోయేవాడు. సినిమా రంగంలో సరికొత్త ప్రయోగాలు, సాంకేతిక విజయాలు అందించడంలో పద్మాలయ సంస్థ ఎప్పుడు ముందు ఉండేది, తెలుగు తో పాటు హిందీ ,తమిళ , కన్నడ రంగాల్లో కూడా పద్మాలయ సంస్థ సంచలన చిత్రాలను నిర్మించింది. అప్పటికే తెలుగు సినిమా రంగంలో అగ్ర కథానాయకులుగా వున్న అక్కినేని , నందమూరిని ఢీ అంటే ఢీ అన్నాడు. 1974లో అక్కినేని నాగేశ్వర రావు నటించి “దేవదాసు” సినిమాను విజయ నిర్మల దర్శకత్వంలో అదే పేరుతో నిర్మించాడు.
అలాగే 1977లో నందమూరి తారక రామారావు నిర్మించిన “దానవీర శూర కర్ణ ” చిత్రానికి పోటీగా “కురుక్షేత్రం ” ను నిర్మించాడు. 1982లో ఎన్ .టి రామారావు తెలుగు దేశం పార్టీ ని ప్రారంభించి 1983లో అధికారం లోకి వచ్చాడు. రామారావు ముఖమంత్రిగా వున్నప్పుడు ఆయన్ని విమర్శిస్తూ చిత్రాలు నిర్మించి కాంగ్రెస్ పార్టీకి చేరువయ్యాడు. రాజీవ్ గాంధీ ప్రేరణతో 1989లో ఏలూరు నుంచి పార్లమెంట్ కు పోటీ చేసి గెలుపొందాడు. రాజీవ్ గాంధీ మరణంతో మళ్ళీ రాజకీయాల్లోకి వెళ్ళలేదు. తమ్ముడు హనుమంత రావు మరణంతో కృష్ణ మానసికంగా క్రుగిపోయాడు. ఎందుకంటే హనుమంతరావు చాలా ధైర్యవంతుడు , “అన్నా నీ వెనుక మేమున్నాం .. నువ్వు ఏది చెయ్యాలన్నా చెయ్యి ” అని నైతిక బలం ఇచ్చాడు. ఇక గత సంవత్సరం తన జీవితంతో పెనవేసుకు పోయిన విజయ నిర్మల నిష్క్రమించింది . అయినా విజయ నిర్మల జ్ఞాపకాలతో ఆమె ఇంట్లోనే ఉంటున్నాడు.
పద్మభూషణ్ కృష్ణ నటుడుగా ఎన్ని విజయాలు సాధించినా వాటి వెనుక తన అర్ధాంగి విజయ నిర్మల, సోదరులు హనుమంతరావు, ఆదిశేషగిరావు వున్నారని ఇప్పటికీ నమ్ముతారు, ఇక కుటుంబ బంధాలకు కూడా కృష్ణ ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఆయన విజయ నిర్మలతో పాటు మొదటి భార్య ఇందిరతో కూడా కలసి ఉండేవాడు. కృష్ణ , ఇందిరకు రమేష్ బాబు ,పద్మావతి, మంజుల, మహేష్ బాబు, ప్రియదర్శిని, ఐదుగురు సంతానం. కృష్ణ ,విజయ నిర్మలకు పిల్లలు లేరు. జీవితంలో ఒకటి కావడానికి కృష్ణ విజయ నిర్మల తీసుకున్న నిర్ణయం. కృష్ణ తన సోదరులను కూడా సినిమా రంగంలో ఆహ్వానించిన తీరు చూస్తే ఆయన దార్శనికుడని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి. ఆయన వారసత్వాన్ని మహేష్ బాబు నిలబెట్టడం కృష్ణకు అంతులేని తృప్తి నిస్తుంది. కృష్ణ తన కలలను సాకారం చేసుకుని ఓ చరిత్రను సృష్టించుకున్నాడు.
– భగీరథ