“కళ కళ కోసం కాదు ప్రజలకోసం”- మాదాల రంగ రావు .

“కళ కళ కోసం కాదు ప్రజలకోసం”- మాదాల రంగ రావు 

తెలుగు సినిమాలో విప్లవ , లేదా వాస్తవ సినిమాలు అనగానే గుర్తుకొచ్చేపేరు మాదాల రంగారావు . ఆయన పెట్టిన ఒరవడిని తరువాత కాలంలో ఎందరో ముందుకు తీసుకెడుతున్నారు . ఆ విషయంలో రంగారావే స్ఫూర్తి అని చెప్పాలి . రంగారావు గారు నటుడుగా 1974లో “చైర్మన్ చలమయ్య ” సినిమా తో ప్రవేశించినా ఆయనలో వున్న కళా దాహం తీరలేదు . అందుకే 1980లో నవతరం పిక్చర్స్ సంస్థను ప్రారంభించి ” యువతరం కదిలింది ” అనే సామాజిక ప్రయోజనంతో ఓ చిత్ర నిర్మాణానికి పూనుకున్నారు . ఆ వరవడి ఆయన్ని రెడ్ స్టార్ గా సినిమా రంగంలో గుర్తింపు , గౌరవాన్ని తెచ్చిపెట్టింది .

యువతరం కదిలింది సినిమా అంతా ఒంగోలు లో జరిగింది . ఒంగోలు మాదాల రంగారావు గారి స్వస్థలం . అక్కడ రంగారావు గారి గ్రామస్తులు , మిత్రులు ఎంతోమంది ఈ చిత్ర నిర్మాణంలో సహాయ పడ్డారు . షూటింగ్ ఓ యజ్ఞంలా సాగింది . నేను అప్పుడు ఆంధ్ర జ్యోతి సంస్థ నుంచి వెలువడే జ్యోతి చిత్రలో పనిచేస్తున్నాను . నిర్మాత రంగారావు ఆహ్వానంతో నేను, అడుసుమిల్లి పాండురంగారావు గారి కారులో హైదరాబాద్ నుంచి ఒంగోలు వెళ్లాను . అక్కడ యువతరం కదిలింది సినిమా ఓ జాతరలా , ఓ పెళ్లి లా జరగటం నేను చూశాను . ప్రజలు ప్రకాశం , నెల్లూరు , గుంటూరు ప్రాంతాల నుంచి వచ్చేవారు షూటింగ్ చూడటానికి . నిజానికి ఆ సినిమా రంగారావుకు ఓ మధుర స్వప్నం . ఎందుకంటే రంగారావు కమ్యూనిస్టు పార్టీలోని ప్రజా నాట్యమండలి నుంచి వచ్చారు . ఆ ప్రభావం ఆయన మీద బాగా వుంది . సినిమా అనేది ప్రజల కోసం అనే నమ్మకం వుంది . తనలోని ఆశయాలకు చిత్ర రూపం ఇవ్వడానికి స్వయంగా నిర్మాతగా మారాడు . తానూ ఏమైతే కలలు కన్నాడో వాటిని తెర మీద చూపించడంలో ఎప్పుడూ రాజీ పడలేదు . యువతరం కదిలింది సినిమా అనుకున్న సమయానికి పూర్తి చేశారు . ఆగష్టు 4న సెన్సార్ అయ్యింది . ఈ చిత్రానికి క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చారు .

యువతరం కదిలింది సినిమా సంచలన విజయం సాధించింది . మాదాల రంగా రావు కథను రాసుకున్నారు . ధవళ సత్యం దర్శకత్వం వహించారు . ఈ సినిమాలో రామ్ కృష్ణ , డాక్టర్ ప్రభాకర రెడ్డి , మురళి మోహన్, నారాయణ రావు , సాయి చాంద్ , నర్రా వెంకటేశ్వర రావు , కె . విజయ , కృష్ణవేణి మొదలైన వారు నటించారు . టి . చలపతి రావు సంగీతంలో స్వరపరిచిన గీతాలన్నీ ప్రజాదరణ పొందాయి .

<

p style=”text-align: justify”>
సరిగ్గా 39 సంవత్సరాల క్రితం నాటి అపురూప జ్ఞాపకం . యువతరం కదిలింది సినిమా విదులైన సందర్భంగా హైదరాబాద్ అశోకా హోటల్లో ఆగస్టు 18, 1980న ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు . అప్పట్లో ఈ సినిమాను లక్ష్మీ చిత్ర హరి కృష్ణ గారు విడుదల చేశారు . ఆనాటి పత్రికా సమావేశంలో నాతో పాటు పి .ఎస్ .ఆర్ ఆంజనేయ శాస్త్రి , పన్యాల రంగనాధరావు , కొంపెల్ల విశ్వం , శరత్ కుమార్ , కాట్రగడ్డ రవి , యార్లగడ్డ హనుమంత రావు , శ్రీనివాస ఫిలిమ్స్ అడుసుమల్లి సాంబశివరావు , మరో పంపిణీదారు వెంకట రావు, ఎల్ . ఏ గంగాధర రావు వున్నారు
-భగీరథ