తమిళ రాజకీయాల్లో ఈమధ్య కాలంలో బాగా సంచలనం రేపిన అంశం రజినీకాంత్ రాజకీయ రంగప్రవేశం, నిష్క్రమణం. దాదాపు రెండు దశాబ్దాలుగా అభిమానులను ఊరించి చివరికి ఆరోగ్యం దృష్ట్యా రాజకీయాల్లోకి రాకూడదనే నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. దీంతో అభిమానులు తీవ్రమైన నిరాశకు గురయ్యారు. రజినీ పార్టీ పెడితే ఆయన మద్దతు తీసుకుని బలపడదామనుకున్న పార్టీలు కూడ డిసప్పాయింట్ అయ్యాయి. అలా అయిన వారిలో బీజేపీ కూడ ఒకటి. జయలలిత మరణానంతరం తమిళనాడులో పాగావేయాలనుకున్న బీజేపీ రజినీని గట్టిగా వాడుకుందామని భావించింది. కానీ చివరి క్షణంలో రజినీ డ్రాప్ అవడంతో ఉసూరుమంది. ఇక రాజకీయాల్లో రజినీ ఛరీష్మాను వాడుకునే అవకాశం లేదని నిర్ణయించుకుంది.
బీజేపీయే కాదు అందరూ అదే అనుకున్నారు. కానీ అనూహ్యంగా మరోసారి రజినీ పేరు రాజకీయాల్లో చర్చకు వచ్చింది. అయితే నేరుగా కాదు పరోక్షంగా. అర్జున మూర్తి అనే వ్యక్తి కొత్త పార్టీని పెట్టబోతున్నాడు. ఈ అర్జున మూర్తికి బీజేపీకి, రజినీకి మధ్య రిలేషన్ చాలా పెద్దది. అర్జున మూర్తి ఒకప్పుడు బీజేపీలో చాలా చురుగ్గా పనిచేశారు. తమిళ రాజకీయాల పట్ల విశేషమైన పరిజ్ఞానం ఉన్న ఈయన తమిళనాట బీజేపీని బలపర్చడంలో తనవంతు పాత్ర పోషించారు. ఇక రజినీ పార్టీ పెట్టాలని అనుకున్నప్పుడు ఈ అర్జున మూర్తి రజినీ క్యాంపుకు మకాం మార్చాడు. రజినీకి ప్రధాన సలహాదారుగా మారారు. రజినీకి కూడ ఈయనంటే మంచి గురి ఉంది.
రజినీ పెట్టాలనుకున్న పార్టీ ప్రధాన కార్యాలయానికి సమన్వయకర్తగా వ్యవహరించారు కూడ. అలాంటి వ్యక్తే ఇప్పుడు పార్టీ పెట్టడానికి రెడీ అవడంతో ఆయన వెనుక రజినీ ఉన్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోయినా తన ప్రతినిధి ఒకరు రాజకీయాల్లో ఉండాలనే ఉద్దేశ్యంతో రజినీ అర్జున మూర్తిని రంగంలోకి దింపారని, వెనుక ఉండి అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తారని రాజకీయ వర్గాలు చెప్పుకుంటున్నాయి. మరి ఆ మాటల్లో నిజమెంత అనేది కాలమే చెప్పాలి. అయితే అర్జున మూర్తి పార్టీ పెడుతున్నట్టు తెలియగానే ఎక్కువగా ఖంగుతిన్నది మాత్రం బీజేపీనే. ఎందుకంటే రజినీ తమలో కలుపుకోవాలని అనుకుని విఫలమయ్యారు. తమలో ఒకడిగా ఉన్న అర్జున మూర్తికి రజినీ పక్కన చేరితే పోనీలే మనకే మంచిది పొత్తుకు ఉపకరిస్తాడని అనుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఇద్దరూ ఏకమై తమతో సంబంధం లేకుండా కొత్త పార్టీ అంటుండటంతో షాకవుతున్నారు.