చిరంజీవి మెగాస్టార్ అవ్వడం పెద్ద తప్పు.! చిరంజీవి ఏదన్నా కార్యక్రమానికి హాజరైతే నేరం. ఆయనతో కలిసి ఎవరైనా ఫొటో దిగాలనుకుంటే అదో పాపం.! ఇదేనా, చాలామంది మేధావులు చెప్పదలచుకున్న విషయం.?
అలయ్ బలయ్ కార్యక్రమానికి చిరంజీవి హాజరయ్యారు. అదీ హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆహ్వానం మేరకు మాత్రమే చిరంజీవి అక్కడకు వెళ్ళారు. చిరంజీవి కేవలం సినీ నటుడు మాత్రమే కాదు, మాజీ కేంద్ర మంత్రి కూడా. అంతకు మించి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ అలాగే ఆక్సిజన్ బ్యాంకుల ద్వారా సేవా కార్యక్రమాలు తెలుగు రాష్ట్రాల్లో విరివిగా చేస్తున్న వ్యక్తి.
చిరంజీవి మెగాస్టార్ గనుక, ఆయనతో ఫొటోలు దిగేందుకు చాలామంది పోటీ పడతారు. అదులో సెలబ్రిటీలు కూడా వుంటారు. అలా ఫొటోల కోసం వచ్చేవారిని చిరంజీవి పక్కకు తోసెయ్యలేరు కదా.? ఈ విషయం గరికపాటి లాంటి మేధావి, పండితుడికి తెలియదా.? గరికపాటి నరసింహారావు కొంత ఆవేశపడ్డారు. ఇదైతే నిజం. నిజానికి, ఆయన ‘చిరంజీవిగారూ, మీరు ఫొటో సెషన్ మానేసి రాకపోతే, నేను వెళ్ళిపోతాను..’ అని అనకూడదు.
అక్కడ ఫొటో సెషన్ ఏర్పాటు చేసింది చిరంజీవి కాదు. ఆ విషయం గరికపాటికి కూడా తెలుసు. గరికపాటి నిందించాల్సింది, నిలదీయాల్సింది నిర్వాహకుల్ని. పండితుడై వుండీ, పొరపాటున చిరంజీవిని అదిలించే ప్రయత్నం గరికపాటి ఎందుకు చేశారన్నదే అసలు ప్రశ్న. ‘గరికపాటిని ఏపాటి’ అంటూ నాగబాబు సంబోదించారంటూ బ్రాహ్మణ సంఘాల హంగామా షురూ అయ్యింది.
బ్రాహ్మణ సంఘాలేనా, కాపు సంఘాలు లేవా.? ఇక్కడ కుల పంచాయితీ ఏముంది.? ఓ ప్రవచనకర్త, ఓ సినీ నటుడు అలాగే కేంద్ర మంత్రి మీద అసహనం ప్రదర్శించాడు. ఇదీ అసలు విషయం. తప్పు గరికపాటి నుంచే జరిగింది. అయినా, చిరంజీవి హుందాతనాన్ని చాటుకున్నారు. కానీ, నాగబాబు భుజమ్మీద తుపాకీని పెట్టి, చిరంజీవిని కాల్చాలన్న ప్రయత్నం జరుగుతోంది.