ఈరోజు ఉదయం నుండి ఒకటే వార్త సోషల్ మీడియాలో తెగ ప్రచారమవుతోంది. అదేమిటంటే చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి సంపద రూ. 1200 కోట్లని. బార్ క్లేస్ హూరున్ ఇండియా సంస్ధ దేశంలోని అత్యంత సంపన్నుల జాబితాను రిలీజ్ చేసింది. ఆ జాబితాలో చాలామందే ఉన్న అదంతా మనకనవసరం. అయితే, ఆ జాబితాలోనే తెలుగు ప్రముఖుల జాబితా కూడా ఉంది. ఆ జాబితాలో ఓ 50 మంది పారిశ్రామికవేత్తల దాకా ఉన్నారు.
సంపన్నుల జాబితాలో పారిశ్రామికవేత్తలకే ఎక్కువ అవకాశం ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ కోవలోనే చంద్రబాబు సతీమణ నారా భువనేశ్వరి కూడా చోటు సంపాదించుకున్నారు. భువనేశ్వరికి సంపన్నుల జాబితాలో చోటు లభించటం బహుశా మొదటిసారేమో ? ఇంతకీ ఆమె సంపద ఎంతంటే రూ . 1200 కోట్లట. హెరిటేజ్ ఫుడ్స్ లో భాగస్వామి హోదాలో ఆమెకు అంత సంపద దక్కిందని బార్ క్లేస్ సంస్ధ పేర్కొంది.
ఒకవైపేమో భర్త, టిడిపి అధ్యక్షుడు, ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబేమో తన చేతికి వాచీ లేదు, జేబులో ఒక్క రూపాయి కూడా లేదని ప్రతీ రోజు బీదరపులు అరుస్తుంటారు. అంటే చంద్రబాబు ఉద్దేశ్యం వాచీ కొనుక్కోవటానికి జేబులో పెట్టుకునేందుకు కనీసం డబ్బు కూడా తన దగ్గర లేదని జనాలు అనుకోవాలని అయ్యుండొచ్చు. చంద్రబాబు మాటలు ఎవరైనా నమ్ముతారా లేదా అన్నది వేరే విషయం లేండి.
ఇపుడు విషయం ఏమిటంటే భార్య, భర్తల్లో ఎవరి దగ్గర డబ్బున్నా రెండో వాళ్ళ దగ్గర ఉన్నట్లే కదా ? తన దగ్గర డబ్బు లేదని చంద్రబాబు ఎప్పటి నుండో బీద మాటలు మాట్లాడుతున్నారు. మరి, భువనేశ్వరి ఏకంగా రూ 1200 కోట్ల సంపన్నురాలైందని తేలిపోయింది కదా ? మరి అలాంటపుడు తన భర్త చంద్రబాబుకు ఓ వాచీ కొనిపెట్టి రోజు ఇంతా అని ఎంతో కొంత డబ్బు జేబులో పెట్టొచ్చు కదా ? అని సోషల్ మీడియాలో తెగ సెటైర్లు పేలుతున్నాయి.