సార్వత్రిక ఎన్నికల ముంగిట్లో బీజేపీ రాష్ట్రశాఖ చేపట్టిన అతి కీలక సమావేశానికి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హాజరు కావట్లేదు. కడపలో ఏర్పాటు చేసిన ఈ సమీక్షా సమావేశానికి అమిత్ షా బదులుగా కేంద్ర హోమ్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొనబోతున్నారు. అమిత్ షా స్వైన్‌ఫ్లూతో బాధపడుతుండటం వల్లే ఆయన రావట్లేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కడపలోని కందుల ఎస్టేట్‌లో జరిగే ఈ భేటీలో పాల్గొనడానికి ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు కడపలోనే ఉన్నారు. ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
రాయలసీమలోని నాలుగు జిల్లాల పార్టీ ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. నాలుగు జిల్లాల నుంచీ సుమారు అయిదు వేల మంత్రి ప్రతినిధులు హాజరవుతారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ వారితో ముఖాముఖి నిర్వహిస్తారు. ఎన్నికల మేనిఫెస్టోపై ఈ సమావేశంలోనే చర్చిస్తామని జిల్లా బీజేపీ నాయకులు `తెలుగురాజ్యం`కు తెలిపారు.
మేనిఫెస్టోలో చేర్చడానికి అవసరమైన కొన్ని కీలక అంశాలతో కూడిన ప్రతిపాదనలను సిద్ధం చేశామని, వాటికి తుదిరూపాన్ని ఇస్తామని పార్టీ అధిష్ఠానం ఇచ్చే సూచనలు, సలహలతో వాటిలో మార్పులు చేస్తామని అన్నారు. అభ్యర్థుల జాబితా కూడా ఈ భేటీలోనే ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయని వారు చెప్పారు. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని, ఈ దిశగా పార్టీ శ్రేణులను సమాయాత్తం చేస్తున్నామని చెప్పారు. 175 అసెంబ్లీ స్థానాలకూ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు.
భావసారూప్యం గల పార్టీలు ఏవైనా వస్తే సీట్ల సర్దుబాటు చేసుకుంటామని, దీనిపై పార్టీ అధిష్ఠానానిదే తుది నిర్ణయమని అన్నారు. జనసేన పార్టీతో పొత్తు విషయంపై ప్రశ్నించగా.. ప్రస్తుతానికి అలాంటి ఆలోచన ఏదీ చేయట్లేదని అన్నారు. పవన్ కల్యాణ్ వామపక్ష పార్టీలతో కలిసి తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. వారితో కలిసే ఆయన ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని అన్నారు. దీని ప్రకారం చూస్తే.. పవన్ కల్యాణ్ తమతో పొత్తు పెట్టుకుంటారని అనుకోవట్లేదని బీజేపీ నేతలు అభిప్రాయపడ్డారు.