బడ్జెట్లో జగన్ పేరుతో రెండు పథకాలు

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్లో విద్యారంగంకు సంబంధించి రెండు పథకాలకు జగన్ పేరు పెట్టారు.  ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధరెడ్డి ప్రవేశపెట్టిన బడ్జెట్లో జగనన్న విద్యా దీవెన, జగన్ అమ్మఒడి పథకాలను ప్రకటించారు. బుగ్గన ప్రకటనతోనే విద్యారంగానికి జగన్ ఇస్తున్న ప్రాధాన్యత ఏమిటో అందరికీ అర్ధమైపోయింది.

జగన్ అమ్మఒడి పథకం ప్రధానంగా పిల్లలను స్కూళ్ళలో చర్చటానికి ఉద్దేశించింది. తమ పిల్లలను తల్లి, దండ్రులు స్కూళ్ళల్లో చేర్పిస్తే ప్రతీ తల్లికి ఏడాదికి ప్రభుత్వం నుండి రూ. 15 వేలు అందుతుంది. ఇక జగనన్న విద్యా దీవెన పథకంలో మెట్రిక్ పై చదువులు చదివే విద్యార్ధులకు అందుతుంది.

అన్నీ సామాజికవర్గాల విద్యార్ధులకు  నూరుశాతం  ఫీజు రీ ఎంబర్స్ మెంట్ ను ప్రభుత్వం అందిస్తుంది.  ఆహారం, ప్రయాణం, హాస్టల్ ఖర్చులు, పుస్తకాలు తదితర కొనుగోలుకు ఈ పథకం ద్వారా నిధులు అందుతాయి. ప్రతీ విద్యార్ధికి ప్రతీ సంవత్సరం ప్రభుత్వం రూ. 20 వేలు అందిస్తుంది. ఇందుకోసం ప్రభుత్వం బడ్జెట్లో రూ. 4,962 కోట్లు కేటాయించింది. అమ్మఒడి పథకానికి కూడా ఏడాదికి రూ. 6455 కోట్లు కేటాయించింది.

మామూలుగా ప్రభుత్వం ప్రవేశపెట్టే  పథకాలకు దివంగత నేతల పేర్లు పెట్టటమే చూస్తుంటాం. కానీ బతికున్న నేతల పేర్లు పెట్టటం మాత్రం మాజీ సిఎం చంద్రబాబునాయుడుతోనే మొదలైంది. చంద్రన్న తోఫా, చంద్రన్న బీమా పథకాలు అందరూ చూసిందే. తాజా బడ్జెట్ ప్రవేశపెట్టిన బుగ్గన రెండు పథకాలకు జగన్ పేరు పెట్టినట్లు ప్రకటించారు.