వైజాగ్ గ్యాస్ లీక్ వెన‌క టాప్ సీక్రెట్ ఇదే: ఫోరెన్సిక్

విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఫోరెన్సిక్ నిపుణుల రిపోర్ట్ ఆశ్చ‌ర్య‌క‌ర విష‌యాల్ని వెల్ల‌డించింది. మానవ లోపం, లాక్ డౌన్ సమయంలో నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా స్టైరిన్ లీకేజీ సంభవించిందని వెల్ల‌డైంది. ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే ఏపీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌క‌టించినట్టు ఇది మాన‌వ‌త‌ప్ప‌దమేన‌నే దానికి స‌మ‌ర్థ‌న ఇది. డాక్టర్ ఆర్కె సరీన్, టి సురేష్ నేతృత్వంలోని ఎపీ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎపిఎఫ్ఎస్ఎల్) అధికారుల బృందం గ్యాస్ లీక్ విషాద స్థలాన్ని సందర్శించి గత రెండు రోజులుగా ఆధారాలు సేకరించారు.

స్టైరిన్ స్టోరేజ్ ట్యాంక్‌లో ఆటో పాలిమరైజేషన్ ఇన్ హిబిటర్‌ను జోడించడంలో మానవ నిర్లక్ష్యం బ‌య‌ట‌పడింద‌ని.. లాక్డౌన్ కాలంలో 20 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువ ఉష్ణోగ్రతను నిర్వహించడంలో విఫలమవడం వ‌ల్ల‌నే ప్రమాదానికి దారితీసిందని.. 12 మంది ప్రాణాలు కోల్పోవాల్సి వ‌చ్చింద‌ని ఎపిఎఫ్‌ఎస్‌ఎల్ ప్రాథమిక నివేదిక పేర్కొంది.

ర‌సాయ‌నం స్వీయ-పాలిమరైజేషన్‌ను నివారించడానికి స్టైరిన్‌ను తృతీయ బ్యూటైల్ కాటెకాల్ (టిబిసి) తో కలపాలని ఎఫ్‌ఎస్‌ఎల్ నిపుణులు మీడియాకి చెప్పారు. లాక్డౌన్ వ్యవధిలో టిబిసిని జోడించలేదు. దీంతో స్వీయ-పాలిమరైజేషన్ ప్రారంభమైంది. అది రసాయన ప్రతిచర్యకు దారితీసింది . తరువాత 150 డిగ్రీల సెంటీగ్రేడ్ తో తీవ్ర‌మైన‌ వేడిని ఉత్పత్తి చేసింది.

“స్టైరిన్ పాలిమరైజేషన్‌ను నిరోధించడానికి టిబిసిని కలపాలి. రవాణా సమయంలో కూడా టిబిసి మిశ్రమంగా స్టెరిన్ ని రవాణా చేస్తారు. ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువగా ఉండేలా చూస్తారు. లాక్డౌన్ సమయంలో, సాంకేతిక బృందం టిబిసిని రీమిక్స్ చేసి ఉంటుంది. కానీ అది జరగకపోవచ్చు. శీతలీకరణ ప్రక్రియ కూడా నిర్వహించలేదు. ఇది అపారమైన వేడిని ఉత్పత్తి చేయడానికి దారితీసింది. ఆవిర్లు నెమ్మ‌దిగా బయటకు వ‌చ్చాయి అని APFSL త‌ర‌పున‌ సీనియర్ ఫోరెన్సిక్ అధికారి చెప్పారు.

“అధిక వేడిమిని ధృవీకరించడానికి కంట్రోల్ రూమ్‌లో ఒక ఆపరేటర్ కూర్చుని ఉండాలి. మేము సైట్ ను సందర్శించిన రోజు, నిల్వ ట్యాంకులలో ఉష్ణోగ్రత 120 డిగ్రీల నుండి 150 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పెరిగింది“ అని ఆయన తెలిపారు. యునైటెడ్ స్టేట్స్ వంటి దేశాలలో స్టైరిన్ ప్రమాదంపై కొన్ని కేస్ స్టడీస్ ప‌రిశీలిస్తే.. ఉష్ణోగ్రతలు 150 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా ఉన్న‌ప్పుడు సంభ‌వించిన‌వేన‌ని తేలింది.

స్టైరిన్ మరిగే స్థానం 146 డిగ్రీల సెంటీగ్రేడ్. లాక్డౌన్ వ్యవధిలో, వారు నిల్వ ట్యాంకును సరిగ్గా నిర్వహించక‌పోవ‌డ‌మే వేడి తీవ్ర‌త‌కు కార‌ణమైందని తెలిపారు. దీనిపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) గౌతమ్ సావాంగ్ మాట్లాడుతూ.. శీతలకరణిని విధి నిర్వ‌హ‌ణ‌కు సంబంధించిన‌ సిబ్బంది నిర్లక్ష్యాన్ని ప‌రిశీలించాం. ద‌ర్యాప్తు సాగుతోంది. ఈ సమయంలో వెంట‌నే ఒక నిర్ణయానికి రావడం చాలా కఠినమైనది. ఈ ప్ర‌మాదంలో నిర్లక్ష్యం అనే మానవత‌ప్పిదం ఉంది“ అని వెల్ల‌డించారు.